విశ్వాసం : దానం చేయాలి

విశ్వాసం : దానం చేయాలి

మనం సంపాదించిన దానిలో ఆరో వంతు దానాలకు వినియోగించాలని వేదవ్యాసుడు శ్రీమద్భాగవతంలో చెప్తున్నాడు. ఈ రోజులలో అంత దానం చేయటానికి కుదరకపోవచ్చు. అందుకే  కాలానుగుణంగా... చేతనైనంత, వీలైనంత మాత్రమే దానం చేయవచ్చని పండితులు చెప్తున్నారు. అవకాశం కుదరక దానం చేయలేకపోతే, అందువల్ల ఎటువంటి దోషము అంటదని పెద్దలు చెప్తున్నారు. అతిగా దానం చేసి, అప్పులపాలు అవ్వమని ఏ శాస్త్రమూ బోధించట్లేదు. అలా చేస్తే దానిని తనకుమాలిన ధర్మం అనటం పరిపాటి. 

అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం, సువర్ణదానం, రజతదానం, విద్యాదానం, కన్యాదానం... దానాలలో అనేకరకాలు ఉన్నాయి. కొందరు నిత్యాన్నదానం చేస్తారు. మరికొందరు నిరంతరం దానం చేస్తారు. మరికొందరైతే మాధూకం చేసుకునేవారికి వారానికి ఒకసారి అన్నదానం చేస్తారు. దానాలన్నిటిలోకి అన్నదానం శ్రేష్టమైనదని చెప్తారు.

పూర్వకాలంలో మహారాజులు యజ్ఞయాగాదులు చేసినప్పుడు తన పరిపాలనలోని వారందరికీ ఏదో ఒకరకంగా దానాలు చేయటం మనం చదువుతూనే ఉన్నాం. బలిచక్రవర్తి ఎన్నో దానాలు చేశాడు. విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చి, మూడడుగుల నేల కోరినప్పుడు, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని తెలిసినప్పటికీ, యోగ్యుడు కనుక ఆలోచించకుండా మూడడుగుల నేల దానం చేశాడు. వామనుడు త్రివిక్రముడై, సమస్త భూమండలాన్నీ ఆక్రమించుకున్నాడు. రఘుమహారాజు కాలంలో వరతంతు అనే గురువు ఉండేవాడు. ఆయన విద్యార్థులకు విద్యాదానం చేసేవాడు. విద్యపూర్తయిన తరువాత విద్యార్థులు గురుదక్షిణ చెల్లించేవారు. కౌత్సుడు అనే శిష్యుడు గురు దక్షిణ చెల్లించటం కోసం రఘుమహారాజు దగ్గరకు వెళ్లాడు. అప్పటికే ఎన్నో దానాలు చేసిన ఆ మహారాజు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఉన్నాడు. అటువంటి సమయంలో కుబేరుడి మీద యుద్ధం చేసి, బంగారు నాణాలు తెచ్చి, దానమిచ్చాడు. మహారాజు కనుక అడిగిన వారికి లేదనకుండా దానం చేయాలి. కర్ణుడిని మహాదాత కర్ణుడు అనటం తెలిసిందే. ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగానికి వచ్చినవారందరికీ భూరిదానాలు చే శాడు. దానానికి అంతటి ప్రాధాన్యత ఉంది భారతీయ సనాతన ధర్మంలో.

దానం చేయడానికి ఆరు గుణాలు ఉండాలని రామాయణం చెబుతోంది. దానం చేయాలనుకునేవాడు సత్ప్రవర్తన కలిగిన ధర్మాత్ముడై ఉండాలి. దానం పుచ్చుకునేవాడు యోగ్యుడై ఉండాలి. దానం శ్రద్ధగా చేయాలి. దానం ధర్మబద్ధంగా ఉండాలి. దానాన్ని ఎక్కడపడితే అక్కడ కాకుండా, మంచి స్థలంలో చేయాలి. ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా, మంచి సమయంలో చేయాలి. చేసేదానం మంచిదై ఉండాలి. పాడైపోయినవి, పనికిరానివి దానం చేయకూడదు. దానం చేయాలనుకున్నవారు ఈ నియమాలు పాటించి తీరాలి. ఏదో పుణ్యం వస్తుందిలే అని ఏదిపడితే అది, ఎవరికిపడితే వారికి చేసిన దానం... దానం అనిపించుకోదు.  

ఈ దానాలు చేసేవారు అనేక రకాలు..

ప్రత్యుపకారం కోసం కొందరు దానాలు చేస్తుంటారు. దానిని రాజస దానం అంటారు. పరిపాలనలో ఉన్నవారు తమ దగ్గర పనిచేస్తున్నవారికి చేసే దానం ఇటువంటిదే. వారి నుంచి ఎంతో కొంత ప్రత్యుపకారాన్ని పాలకులు ఆశిస్తారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రతిరోజూ ఏదో ఒకదానిని దానం చేస్తే.. ఆ దానాన్ని నిత్యదానం అంటారు. అదేవిధంగా ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం మంచి వారికి మాత్రమే, మంచి సమయంలో చేసే దానాన్ని సాత్వికదానం అంటారు.
అర్హత లేనివారికి సమయం సందర్భం లేకుండా చేసే దాన్ని తామస దానం లేదా అనుచితదానం అంటారు. చెడ్డపనులు చేసేవారికి చేసే దానం అది.
అదేవిధంగా అపాత్రదానం, శక్తికి మించిన దానం చేయకూడదని కూడా శాస్త్రం చెబుతోంది. అర్హత లేనివారికి చేసిన దానం దుర్వినియోగం అవుతుంది. అలాగే శక్తికి మించి దానాలు చేయటం వలన, చివరకు ఆ దాత మరొకరిని యాచించే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మన ఆదాయంలో ఆరో వంతు మాత్రమే దానం చేయాలని సూచిస్తోంది ధర్మశాస్త్రం.

శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులకు రత్నహారాలతో పాటు భూమిని దానంగా ఇచ్చి, వారిని గౌరవంగా సత్కరించాడు. భోజమహారాజు కూడా తన కొలువులోని నవరత్నాలను ఆదరించి, సత్కరించాడు. వీరిరువురూ ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన ఈ దానం సాత్విక దానం అనిపించుకుంటుంది. 
భారతీయ సనాతన ధర్మం దానానికి అంత ప్రాధాన్యత ఇచ్చింది.

- డా. వైజయంతి పురాణపండ 
ఫోన్​: 80085 51232