గోదావరి, కృష్ణాలకు వరద తగ్గుముఖం .. ఎగువన వర్షాలు లేకపోవడమే కారణం

గోదావరి, కృష్ణాలకు వరద తగ్గుముఖం .. ఎగువన వర్షాలు లేకపోవడమే కారణం

గద్వాల/శ్రీశైలం/హాలియా/భద్రాచలం, వెలుగు: ఎగువన వర్షాలు లేకపోవడంతో గోదావరి, కృష్ణా నదులకు వరద తగ్గుముఖం పట్టింది. శనివారం కర్నాటక ప్రాజెక్టుల నుంచి ఇన్​ఫ్లో తగ్గిపోయింది. ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్  డ్యామ్ కు 42,500 క్యూసెక్కులు, అక్కడి నుంచి జూరాలకు 22,320 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఓపెన్  చేశారు. జూరాలకు1,08,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 1,04,493 క్యూసెక్కులు వదులుతున్నారు. 

శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వరద కొనసాగుతోంది. జూరాల పవర్​ హౌస్​ నుంచి 31 వేల క్యూసెక్కులు, క్రస్ట్​ గేట్ల ద్వారా 68 వేల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 39 వేల క్యూసెక్కులతో కలుపుకొని 1.39 క్యూసెక్కుల ఇన్​ ఫ్లో వస్తోంది. శ్రీశైలంలో 855 అడుగులకు గాను, ప్రస్తుతం 883 అడుగులు, ఫుల్​ కెపాసిటీ 215.80 టీఎంసీలకు గాను, 204.35 టీఎంసీలు నీనిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్​ కేంద్రాలకు 68 వేల క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు ఒక గేటును 10 మీటర్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 

పవర్​ జనరేషన్, గేట్ల ద్వారా 95 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నాగార్జునసాగర్​ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.040 టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రం 6 గంటల వరకు 548. 60 అడుగులకు(206.7042 టీఎంసీలు) చేరింది. హైదరాబాద్  జంట నగరాల తాగునీటి అవసరాలకు ఏఎమ్మార్పీకి 1,650 క్యూసెక్కులు, మెయిన్​ పవర్​ హౌజ్​ ద్వారా 4,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 62,400  క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,650 క్యూసెక్కులు ఉంది.   

గోదావరికీ వరద తగ్గుమఖం..

భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఎగువ బ్యారేజీల నుంచి వచ్చిన ప్రవాహంతో మధ్యాహ్నం 2 గంటలకు 41.5 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. స్నానఘట్టాలు నీట మునిగాయి. కరకట్ట స్లూయిజ్​ల వద్దకు నీరు చేరడంతో గేట్లను మూసివేశారు. వరద ముంచెత్తకుండా ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.