
బచ్చన్నపేట,వెలుగు: కరెంట్ షాక్ కొట్టి ఇంటర్ విద్యార్థి చనిపోయిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ లోని ముషీరాబాద్‌కు చెందిన ఎండీ అలీ, అలియాబేగం దంపతులు తమ కొడుకు ఎండీ అసద్(17) తో కలిసి రెండు రోజుల కింద బచ్చన్నపేటలోని బంధువుల ఇంట్లో జరిగే పెండ్లికి వచ్చారు. గురువారం సాయంత్రం బచ్చన్నపేట పక్కనే ఉండే గోపాల్‌నగర్‌లోని మేనమామ ఎండీ జమాల్ ఇంటికి అసద్ వెళ్లాడు. స్నానం చేసేందుకు బాత్రూమ్ లో నీళ్లు రాకపోవడంతో చూసేందుకు ఇంటిపైన వాటర్‌ట్యాంక్‌పైకి ఎక్కాడు.
పైనుంచి వెళ్లే ఎల్టీ 11కేవీ లైన్ తీగలు తలకు తగలడంతో అసాద్ కరెంట్ షాక్ కొట్టి కిందపడి చనిపోయాడు. బచ్చన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ లైన్ కింద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రాణాలు పోయేందుకు కారణమైన జమాల్‌పై పోలీసులు కేసు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గోపాల్‌నగర్ లో మరో ఇరవై మంది ఇండ్లపై నుంచి ఎల్టీ లైన్కరెంటు తీగలు వెళ్తుండగా.. వాటిని తొలగించాలని విద్యుత్ అధికారులను అడిగితే.. రూ. 3.22లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని పలువురు ఆరోపించారు.