
అది అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్‌లాండ్ లో అనాటమీ ల్యాబ్ .. అసిస్టెంట్ ప్రొఫెసర్ వాకర్ ఓ శవాన్ని పరిశీలిస్తున్నారు.. స్టూడెంట్లకు వివరిస్తున్నారు.. అతనికి ఏదో తేడా కొట్టింది.. శరీరంలోని రక్తనాళాలు మామూలు మనిషిలో ఉన్నట్టు కాకుండా మరోలా అమరి ఉన్నాయి.. వెంటనే బాడీని మొత్తంతెరిచి చూశాడు.. గుండె తప్ప మిగిలిన అవయవాలన్నీ రాంగ్‌సైడ్ అమరి ఉన్నాయి.. ఆశ్చర్యపోయాడు..ఇలాంటి సమస్య ఉన్న వారు ఎలా జీవించారో? వాళ్లకు ఎలాంటి వ్యాధులొచ్చాయో? ఎంత కాలంబతికారో తెలుసుకోవాలని అనుకున్నాడు. ముందుఆ శవం ఎవరిదని ఆరా తీశాడు.
బెంట్లీకి తెలియదు
రోస్ మేరీ బెంట్లీ మంచి స్విమ్మర్.. అమెరికాలోని పోర్ట్‌లాండ్ వాసి .. ఐదుగురు సంతానం.. భర్త జేమ్స్ షాప్ నడిపిస్తుండే వాడు.. తనూ చేదోడువాదోడుగా ఉండేది.. 99 ఏళ్లు బతికింది.. తనదే ఆ ప్రొఫెసర్ వాకర్ పరిశీలించిన శరీరం.. చనిపోయాక దేహాన్నిఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ (ఓహెచ్ ఎస్‌యూ)కు ఇస్తానని అంగీకరించింది. అవయవాలు వ్యతిరేకంగా అమరి ఉన్నాయని బెంట్లీకి తెలుసా అని తనకు సంబంధించిన వారిని ప్రొఫెసర్ ఆరాతీశారు. తెలియదని కూతురు అల్లీ చెప్పారు. ఇంట్లోకూడా ఎవరికి తెలియదన్నారు. ఉన్నన్ని రోజులు బెంట్లీ సాధారణ జీవితమే గడిపిందని అన్నారు. తనను కీళ్లనొప్పులు ఎక్కువగా బాధ పెట్టాయని వివరించారు. కానీ 50 ఏళ్ల వయసులో సమస్యలు మొదలయ్యాయని, గర్భాశయాన్ని తీసేయాల్సి వచ్చిందని చెప్పారు. అప్పుడు అపెండిక్స్ తీసేయాలని ఓ డాక్టర్ చెప్పారని, కానీ అతనికి అది కనిపించలేదని అన్నారు.కానీ తర్వాత మరో డాక్టర్ దాన్ని తీసేశారని చెప్పారు.
అమ్మ సంతోషించేది: అల్లీ
ఇలా అవయవాలు వ్యతిరేకంగా అమరి ఉండటాన్ని మెడికల్ భాషలో ‘సైటస్ ఇన్వర్సెస్ విత్ లెవొకార్డియా’ అంటారు. సుమారు 22వేల మందికి ఒకరు ఇలా పుడుతుంటారని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ(ఓహెచ్ ఎస్యూ) చెప్పింది. ఈ సమస్య ఉన్నవాళ్లు 73 ఏళ్లకు మించి బతకలేదని చెప్పింది. వీళ్లకు గుండె జబ్బులు, అసాధారణ రోగాలు వస్తుంటాయని వివరించింది. కానీ ఆశ్చర్యం బెంట్లీ 99 ఏళ్లు బతికారు. కొత్త కొత్త మెడికల్ ప్రయోగాలకు తన శరీరం ఉపయోగపడుతోందని తెలిసి ఉంటే అమ్మ ఎంతో సంతోషించేదని అల్లీ అన్నారు. తండ్రి జేమ్స్ కు తెలిసినా బాగా ఆటపట్టించేవాడన్నారు.