హైదరాబాద్, వెలుగు: చెస్‌లో సత్తా చాటుతున్న హైదరాబాద్ యంగ్ ప్లేయర్ ధ్రువ తోట ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) హోదా అందుకున్నాడు. తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన 13వ ప్లేయర్‌గా నిలిచాడు. 16 ఏండ్ల ధ్రువ 2023 నవంబర్‌లో హంగేరీలో తొలి నార్మ్ సాధించి ఐఎం హోదాకు బాటలు వేసుకున్నాడు. అక్కడి నుంచి నిలకడగా ఆడుతున్న అతను స్పెయిన్, ఫ్రాన్స్‌లో జరిగిన టోర్నీల్లో సత్తా చాటి వరుసగా రెండు నార్మ్‌లను దక్కించున్నాడు.
తాజాగా సెర్బియాలో జరిగిన రుడార్ ఐఎం నార్మ్ రౌండ్ రాబిన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన ధ్రువ తద్వారా నాలుగో నార్మ్‌ను అందుకొని ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించాడు. ప్రస్తుతం ఫిడే రేటింగ్‌లో 2411 పాయింట్లతో నిలిచిన ధ్రువ గతేడాది తెలంగాణ స్టేట్ చెస్ చాంపియన్‌గా నిలవడంతో పాటు పలు నేషనల్ టోర్నీల్లో సత్తా చాటాడు. ఐఎం హోదా సాధించిన తర్వాత అతను గ్రాండ్‌మాస్టర్ టైటిల్ పై గురి పెట్టాడు.
అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి వరల్డ్ క్లాస్ కోచింగ్‌తో పాటు క్రమం తప్పకుండా ఇంటర్నేషనల్ టోర్నీల్లో పాల్గొనడం అవసరం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంతో పాటు కార్పొరేట్ స్పాన్సర్‌షిప్స్‌ను ధ్రువ, అతని పేరెంట్స్ కోరుతున్నారు.
