మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 30 వరకు ఇంటర్నెట్ నిషేధం

మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..  జూన్ 30 వరకు ఇంటర్నెట్ నిషేధం

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల నిషేదాన్ని మరో ఐదు రోజులు పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. జూన్ 30 మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్నెట్ నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో  పేర్కొంది.   

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మే 3న మొదటిసారిగా రాష్ట్రంలో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. కాగా మే3 నుంచి మణిపూర్‌లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 120 మంది ప్రాణాలు కోల్పోయారు. 3వేల మందికిపైగా గాయపడ్డారు. 4వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

మరోవైపు మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు తమకు సూచనలు ఇస్తున్నారని తెలిపారు. మణిపూర్‌లో ఘర్షణలు మొదలైన రోజు నుంచి ఈ అంశంపై తాను ప్రధానమంత్రితో చర్చించని రోజే లేదన్నారు.