హైదరాబాద్ లో కేబుల్ వైర్లు కట్.. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

హైదరాబాద్ లో కేబుల్ వైర్లు కట్.. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ స్తంభాలపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించడంతో.. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లో విద్యుత్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో కరెంట్​స్తంభాలపై ఉన్న కేబుల్​వైర్లను తొలగించారు. 

దీంతో ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వై-ఫై కనెక్షన్లకు కూడా అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించాలని గత ఏడాది కాలంగా కేబుల్ ఆపరేటర్లకు సూచించినప్పటికీ, వారు స్పందించకపోవడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని డిస్కం వర్గాలు తెలిపాయి. 

డిస్కం ఆఫీస్ ఎదుట కేబుల్ ఆపరేటర్ల ధర్నా

విద్యుత్ శాఖ అధికారులు కేబుల్ వైర్ల తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో మంగళవారం కేబుల్ ఆపరేటర్లు సదరన్ డిస్కం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కేబుల్ వైర్లలో విద్యుత్ ప్రసారం జరగదని, రామంతాపూర్ ఘటనకు కేబుల్ వైర్లు కారణం కాదని వారు పేర్కొన్నారు. 

కేబుల్ వైర్ల తొలగింపు వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోతారని, వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటారని వాదించారు. విద్యుత్ శాఖ అధికారులు మాత్రం.. ప్రజల భద్రతే ప్రధానమని, కేబుల్ వైర్లను రీ -అలైన్​మెంట్ చేసుకోవాలని లేకపోతే తొలగింపు అనివార్యమని స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో కేబుల్ వైర్ల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు.