పరిచయం : మిస్టరీ సినిమాల్లో చేయాలి

పరిచయం : మిస్టరీ సినిమాల్లో చేయాలి

మొన్నటి వరకు గుజరాతీ సినిమాల్లో పేరుతెచ్చుకున్న ఓ అమ్మాయి.. ఇప్పుడు బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చింది. నటనలో సీనియారిటీ లేదు.. కానీ, సీనియర్​ యాక్టర్స్​తో పోటీపడి నటించింది. ఆమె ఎవరంటే...  జానకి (జాన్కీ) బోడీవాలా.గుజరాతీలో వచ్చిన ‘వశ్​’ అనే హారర్​ థ్రిల్లర్​లో మాంత్రికుడి వశంలో ఉన్న అమ్మాయిగా నటించింది. ఆ సినిమా హిట్ కావడంతో దాన్ని బాలీవుడ్​లో ‘షైతాన్​’ పేరుతో రీమేక్ చేశారు. అందులోనూ జానకి అదే పాత్రలో నటించింది. ఆ సినిమా మార్చిన 8న థియేటర్​లో రిలీజ్ కాబోతుంది. మరి ఆ లోపు.. ఈ గుజరాతీ అమ్మాయి సినిమా జర్నీ ఎలా సాగిందో చదివేయండి...

మాది అహ్మదాబాద్​. అమ్మానాన్న పేర్లు భరత్, కశ్మీర. నాకొక బ్రదర్ ఉన్నాడు. తన పేరు ధృపద్. నా చదువంతా అహ్మదాబాద్​లో స్కూల్లోనే. తర్వాత గాంధీనగర్​లోని ‘గొయెంకా రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ డెంటల్​ సైన్స్’​లో బ్యాచిలర్​ ఆప్​ డెంటల్ సైన్స్​ (బీడీఎస్) చదివా. మా కజిన్ సిస్టర్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో మోడల్స్​. కానీ, నేను మాత్రం డెంటిస్ట్​ కెరీర్​లో ఉన్నా. అది నా ఇష్టప్రకారం తీసుకున్నది ఏమీ కాదు. ఫిజియోథెరపీ చేయాలనేది నా ఇంట్రెస్ట్. కానీ, మా నాన్న డెంటల్​ చేయమన్నారు. నాన్న కోసం  నా ఇంట్రెస్ట్​ పక్కన పెట్టేశా. ఇష్టం లేకపోయినా అందులోనే చేరా. 

నేను ఇష్టం లేకుండా చదువుతున్నా అనే విషయం మా నాన్న గమనించి, అర్థం చేసుకున్నారు. ‘‘నీకు నచ్చకపోతే వదిలెయ్. నీకేది నచ్చితే అదే చెయ్. నువ్వేం చేసినా సపోర్ట్​ చేస్తా. మేం నీకు తోడుగా ఉంటాం’’ అని చెప్పారు. ఆ తర్వాత కూడా నేను యాక్టర్ అవ్వాలనుకోలేదు. మా కజిన్ సిస్టర్స్ యాక్టింగ్ చేసేటప్పుడు సెట్​కి వెళ్లి చూసేదాన్ని. వాళ్లు రిహార్సల్స్ చేస్తుంటే నేను కూడా తమాషాకి చేస్తుండేదాన్ని. అలా చేస్తున్న నన్ను చూసి సినిమాలోకి తీసుకున్నారు. యాక్సిడెంటల్​గా నేను యాక్టర్ అయిపోయా. అప్పటికీ నాకు ఒక సినిమాకి ఎంత మంది పనిచేస్తారు? అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది? వంటి విషయాలేవీ తెలియదు. కానీ యూనివర్స్ నన్ను యాక్టింగ్​లోకి లాగేసింది. నాకోసం ఇది ప్లాన్ చేసిందని నేను తర్వాత రియలైజ్ అయ్యా. 

ఇప్పటికైతే నటిగా నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే... రియల్​ లైఫ్​లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కానీ, అన్ని ఎమోషన్స్ ఒకరిలోనే కనిపించవు. కానీ యాక్టర్​కి మాత్రం ఆ ఛాన్స్ ఉంది. ప్రతి పాత్రలో లీనమై ఆ ఎమోషన్స్ ఎక్స్​ప్రెస్​ చేసే వీలుంటుంది. నాకు ఇమిటేట్ చేయడమంటే ఇంట్రెస్ట్​. యాక్టర్​గా నాకు అది ప్లస్ పాయింట్​.

సక్సెస్ కాకపోయినా..

నా మొదటి సినిమా ‘చెల్లో దివస్’ (2015). ఆ సినిమా సక్సెస్​ కాలేదు. అయినప్పటికీ సినిమాల్లో నటించేందుకు అవకాశాలు వచ్చాయి. నేను కూడా గుజరాతీ ఇండస్ట్రీలో ‘ఆ తారే’, ‘తంబురొ’, ‘ఛుట్టీ జాషె ఛక్క’, ‘తారీ మాటె ఒన్స్​ మోర్’, ‘బౌ నా విచార్’, ‘నాడి దోష్​’ వంటి సినిమాల్లో వరుసగా చేస్తూనే ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ‘వశ్’​ మరో ఎత్తు. ఆ సినిమా తర్వాత నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో డైరెక్టర్ క్రిష్ణదేవ్​ యాగ్నిక్​ నాకు అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఒకవైపు సినిమాలు చేస్తూనే మోడలింగ్ కాంపిటీషన్స్​లో పాల్గొన్నా. 2019లో మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్​లో గుజరాత్​ తరఫున ముగ్గురు ఫైనలిస్ట్​ల్లో ఒకరిగా సెలక్ట్ అయ్యా. 

క్రేజ్ ఉంది కానీ.. 

‘నాడి దోష్’ సక్సెస్​ అయ్యాక నాకు కొంత క్రేజ్ కూడా వచ్చింది. అయినా కూడా ఆ వెంటనే అవకాశాలు రాలేదు. ‘వశ్​’ సినిమా ‘ఓకే’ చేసేవరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఒక యాక్టర్​గా అవకాశాలు లేకుండా ఖాళీగా ఉండడం అంత ఈజీ కాదు. మనల్ని అభిమానించే ప్రజల కోసం సినిమాలు కాకుండా వేరే కంటెంట్​ ఏదైనా చేయాలనిపించేది. కానీ, అది చేయలేం. ఎందుకంటే యాక్టర్​గా ఒక లెవల్​లో ఉండి, గ్లామర్​ రోల్స్ చేస్తాం. సడెన్​గా రూట్ మార్చి వేరే కంటెంట్​ అంటే ప్రేక్షకులు వెంటనే ఒప్పుకోరు. కాబట్టి అలా చేయడానికి ఆలోచించాల్సి వస్తుంది. 

కొవిడ్​ వల్ల డిజప్పాయింట్!

కొవిడ్​కు నాకు ఒక ఆఫర్ వచ్చింది. అది చేస్తే ఇంకా వస్తాయనే ఆశ కలిగింది. కానీ, అది ఆగిపోయింది. ఆ టైంలో కూడా కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ, ఆ ప్రాజెక్ట్స్ ఏవీ పట్టాలెక్కలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఒక్కటే.. కేవలం డబ్బు కోసమనే కాదు. ఒక పని ఉండాలి. మైండ్ ఎప్పుడూ బిజీగా ఉండాలి. అంటే.. రోజూ బిజీగా ఉండాలి.  లేదా ప్రతి రోజు కొత్తగా ఉండాలి అనిపిస్తుంది. మనకేం కావాలో అది చేయాలి. ఆ విషయం నేను రియలైజ్ అయ్యాక ముంబైకి షిఫ్ట్ అయ్యా. అప్పటి నుంచి ఎక్కువగా ఎక్స్​ప్లోర్ చేయాలనుకున్నా. యోగా,  టెన్నిస్ వంటి వేరే ఫీల్డ్స్​లో ​ ట్రై చేశా. కొవిడ్​ టైంలో ‘అది చేయాలి.. ఇది చేయాలి..’  అని చాలా ప్లాన్స్​ వేసుకున్నా. కానీ అవి కుదరక చాలా దిగులు పడ్డా.

కొత్తగా ట్రై చేద్దామని...

ఫిట్​నెస్​ కోసం జిమ్​, యోగా చేసేదాన్ని. కొవిడ్​ తర్వాత అందరూ హెల్త్​, ఫిట్​నెస్​ మీద ఫోకస్​ చేశారు. నేను అప్పటివరకు యోగా చేయలేదు. కొత్తగా ట్రై చేద్దామని యోగా స్టార్ట్ చేశా. ఏడాదిన్నర తర్వాత నాకో రియలైజేషన్ వచ్చింది. ‘జిమ్​లో చేరకూడదు. ఫిట్​నెస్ క్లాసులు తీసుకోకూడదు’ అనిపించింది. ఎందుకంటే యోగా చాలా మంచి ఎక్సర్​సైజ్​. 

అందులో ఉండే ఆసనాలు ఒక్కోటి నేర్చుకోవడంలో థ్రిల్ ఉంటుంది. చేతుల్ని కింద ఆన్చి, శరీరాన్ని పైకి ఉంచడం చాలా కష్టమైన ఆసనం అనిపించింది. అది నేను చేయలేనేమో! బాడీ బరువు అంతా చేతుల మీద పడితే మోయలేనేమో! నా చేతుల్లో అంత శక్తి లేదనుకున్నా. కానీ, ఆ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసి సాధించా. ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా నాకు మూడ్​ బాగోలేకపోతే దాన్నుంచి రిఫ్రెష్​ అయ్యేందుకు నేను డాన్స్​ చేస్తా. దాంతో వెంటనే ఆ మూడ్ నుంచి రిలీఫ్​ అయిపోతా. 

థ్రిల్లర్​ సినిమాలంటే ఇష్టం

నాకు పర్సనల్​గా రొమాంటిక్ కామెడీ మూవీస్ ఇష్టం. నటించాలనుకునే జానర్స్ విషయానికొస్తే.. మొదట థ్రిల్లర్​ ఫిల్మ్స్. అలాగే మిస్టరీ మూవీలో చేయాలనేది నా కోరిక. ఎందుకంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు మన మైండ్​లో ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీ ఉంటుంది. మనం ఒకటి ఎక్స్​పెక్ట్​ చేస్తాం. అక్కడ వేరేలా జరుగుతుంది. అలా థియేటర్​లో కూర్చున్నంతసేపు ఫోన్ చూడకుండా సినిమానే చూడాలి. అప్పుడే ఆ సినిమా బాగున్నట్లు. అంత ఇంట్రెస్ట్​ క్రియేట్​ చేసే సినిమాల్లో నటించాలని ఉంది. 

దక్షిణాది సినిమాలు చూస్తా

దక్షిణాది సినిమాలు ఈ మధ్య చాలా పాపులర్ అయ్యాయి. మంచి కంటెంట్​ ఉన్న సినిమాలు వస్తున్నాయి. భాషాభేదం లేకుండా అన్ని రకాల ఆడియెన్స్​కి నచ్చుతున్నాయి. దక్షిణాది సినిమాల్లో నాకు ‘సీతారామం’ చాలా నచ్చింది. ఆ సినిమా చూస్తూ చాలా ఎమోషనల్ అయ్యా. గుజరాతీ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా వేగంగా డెవలప్​ అవుతోంది. గుజరాతీ సినిమాలకు కూడా స్పెషల్ ఆడియెన్స్ ఉన్నారు.

షైతాన్ గురించి...

ఇది బాలీవుడ్​లో నా డెబ్యూ ఫిల్మ్​. హిందీలో నా మొదటి సినిమాలోనే అజయ్ దేవ్​గన్, ఆర్​. మాధవన్, జ్యోతిక వంటి సీనియర్​ నటులతో నటించడం ఒక కలలా అనిపిస్తుంది. సినిమా విషయానికొస్తే.. ఇది గుజరాతీ ‘వశ్​’ సినిమా రీమేక్. అందులో నేను చేసిన పాత్రలోనే ఇందులో కూడా కనిపించా. అది హారర్ ఫిల్మ్ అవ్వడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో అటెన్షన్ వచ్చింది. అందులో నా నటన నచ్చడంతో రీమేక్​లో కూడా ఆ పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. 

ఇండస్ట్రీ కొత్తది అయినప్పటికీ క్యారెక్టర్ పాతదే కావడం వల్ల ఇబ్బంది పడకుండా నటించా. ఫస్ట్​ టైం వాళ్ల ముగ్గురినీ ఒకచోట చూడగానే నేను స్టన్​ అయ్యా. లోపల చాలా టెన్షన్ పడ్డా. నన్ను నేను కంట్రోల్​ చేసుకున్న క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ‘ఇప్పుడు నువ్వు వాళ్లతో కలిసి నటించబోతున్నావు. ప్రొఫెషనల్​గా ఉండాలి’ అని నాకు నేను చెప్పుకున్నా. షూటింగ్​ టైంలో కొంచెం మేనేజ్​ చేశా. 

కానీ, ఆ తరువాత మాత్రం ఆగలేకపోయా. వాళ్ల దగ్గరికి వెళ్లి సెల్ఫీ అడిగేశా. షూటింగ్​ టైంలో వాళ్లు నాకు చాలా హెల్ప్​ చేశారు. ఈ సినిమాలో నటించడం ఒక అమేజింగ్ ఎక్స్​పీరియెన్స్. మామూలుగా ఇతర భాషలో డెబ్యూ అంటే.. కొన్ని ఆలోచిస్తాం. కానీ, బాలీవుడ్​లో డెబ్యూగా నాకు వచ్చిన ఈ అవకాశానికి చాలా రుణపడి ఉంటా. ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకోలేను కూడా.

 ప్రజ్ఞ