పరిచయం : నా లైఫ్​లో మర్చిపోలేను

పరిచయం : నా లైఫ్​లో మర్చిపోలేను

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ‘ప్రేమలు’ సినిమా హీరోయిన్ మమిత బైజు. ఒక్క సినిమాతో అటు మలయాళీలను, ఇటు తెలుగు వాళ్లని తనవైపుకు తిప్పుకుంది. మమిత యాక్టింగ్​ గురించి పాన్​ ఇండియా డైరెక్టర్​ రాజమౌళి మాట్లాడుతూ ‘‘గీతాంజలి సినిమాలో గిరిజ, ఫిదాలో సాయిపల్లవిలను గుర్తు చేసింది” అన్నాడు. లీడ్​ రోల్​లో మొదటిసారి నటించిన ఒక నటి​కి ఇంతకంటే గొప్ప ప్రశంస ఉండదేమో! యూత్​కి కనెక్ట్​ అయ్యే సినిమా ‘ప్రేమలు’తో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్​ని తన వైపు తిప్పుకున్న మమిత సినీ జర్నీ ఎలా మొదలైందో ఆమె మాటల్లోనే... 

‘‘మా ఊరు కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న కిడంగూర్. మా నాన్న బైజు.. డాక్టర్. అమ్మ పేరు మినీ. నాకో అన్న ఉన్నాడు. పేరు మిథున్​ బైజు. నాకు మా ఫ్యామిలీతో బాండింగ్​ చాలా ఎక్కువ. నా చదువు విషయానికొస్తే.. కట్టాచిరాలో ‘మేరీ మౌంట్​ పబ్లిక్ స్కూల్‌’లో ప్రైమరీ ఎడ్యుకేషన్​ అయ్యాక కిడంగూర్​లో ‘ఎన్.ఎన్​.ఎస్​. హయ్యర్ సెకండరీ’ స్కూల్లో చదివా. ఇప్పుడు కొచ్చిలోని ‘శాక్రెడ్ హార్ట్​ కాలేజీ’లో బిఎస్సీ సైకాలజీ చదువుతున్నా.

స్కూల్లో చదివేటప్పుడు విపరీతంగా రూల్స్ బ్రేక్ చేసేదాన్ని. నాకు యూనిఫాం మీద వేసుకునే షూ సరిపోలేదు. దాంతో అదే కలర్​లో ఉండే వేరే షూ వేసుకుని వెళ్లా. రూల్స్ బ్రేక్ చేసినందుకు పనిష్మెంట్స్ తప్పదు కదా! తరువాత కాలేజీకి వెళ్లేప్పుడు రోజూ లేట్​గా వెళ్లేదాన్ని. ఆలస్యంగా వెళ్లినందుకు ప్రిన్సిపల్​ కొట్టేవారు. దెబ్బలు తిన్నాకే క్లాస్​లో అడుగుపెట్టేదాన్ని. ఒక్కోసారి ప్రిన్సిపల్​కి కనపడకుండా తప్పించుకుని వెళ్లేందుకు ట్రై చేసేదాన్ని. కానీ, సీసీ కెమెరాలో చూసి.. ఆయన నన్ను ఆఫీస్ ​రూమ్​కి పిలిపించేవారు. అలా అల్లరిగా ఉన్నానని సరిగ్గా చదవను అనుకుంటున్నారా? కానే కాదు. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా పాస్​ కావాల్సిందే.  

పది సినిమాలు చేశాక..

పది సినిమాలు చేశాక నాకు ‘ఇది కదా లైఫ్​ అంటే..’ అనిపించింది. అప్పటివరకు పెద్దగా పట్టించుకోలేదు. నాకు మొదటి ఛాన్స్​ అనుకోకుండా వచ్చింది. నేను క్లాసికల్ డాన్సర్​ని. స్టేట్​ లెవల్​ కాంపిటీషన్​లో ప్రైజ్ కూడా వచ్చింది. ఆ టైంలో నాన్న ఫ్రెండ్​ ఒకరు ‘సర్వోపరి పాలక్కరన్​​’ అనే సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయన మా నాన్నకు ఫోన్​ చేసి ‘‘మా సినిమాలో ఒక చిన్న రోల్ ఉంది. మమితతో చేయిద్దాం. తీసుకురా’’ అని అడిగారు.

అప్పటివరకు నేను కెమెరా ముందు నటించలేదు. దాంతో నాక్కొంచెం భయమేసింది. అప్పుడు నాన్న ‘‘చిన్న రోల్​ అది. రెండు రోజుల్లో అయిపోతుంది’’ అని నచ్చజెప్పి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక వాళ్లంతా టెక్నికల్​గా మాట్లాడుతుంటే నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఆ టైంలో ఆ సినిమా కెమెరామెన్​ నాకు చాలా హెల్ప్​ చేశారు. ఆయన ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. అలా నా మొదటి సినిమా పూర్తి చేశా. అప్పటి నుంచి చిన్న రోల్స్ వచ్చేవి. అవి చేసేదాన్ని. అలా పది సినిమాలు చేసేసరికి నేను ఇంటర్మీడియెట్​ సెకండియర్​కి వచ్చేశా. అప్పుడు నాన్న ‘‘ఇక సినిమాలు చాలు. చదువు మీద దృష్టి పెట్టు. మెడిసిన్ చదువు. డాక్టర్ కావాల’’ని చెప్పారు. ఫ్యామిలీ మొత్తం ఆ మాట మీదే నిలబడ్డారు. అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యా. కానీ నాన్నతో ‘‘నాకు సినిమాలు చేయడమే ఇష్టం’’ అని చెప్పా. నాకు సైన్స్​ సబ్జెక్ట్​ కూడా చాలా ఇష్టం. అందుకే బీఎస్సీ సైకాలజీ తీసుకున్నా. అలా ఇప్పటికీ చదువు, యాక్టింగ్ రెండు మేనేజ్ చేస్తున్నా. 

హైదరాబాద్​ జ్ఞాపకం పదిలం

‘ప్రేమలు’ రిలీజ్ అయ్యాక నేను కేరళ నుంచి హైదరాబాద్​ వెళ్లేసరికి రాత్రి11 గంటలు అయింది. ఆ టైంలో షో వేశారు. వెంటనే టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్​కి వెళ్లి చూశా. లైవ్​లో ఆడియెన్స్​ రెస్పాన్స్ చూసి చాలా థ్రిల్​ అయ్యా. ఆ ఎక్స్​పీరియెన్స్​ ఎప్పటికీ మర్చి పోలేను. పంచెకట్టు దోశ, బావర్చి బిర్యానీ టేస్ట్ చేశా. సీన్​లో యాక్టింగ్ చేసేటప్పుడు ఇంప్రవైజ్ చేసేదాన్ని. అది చూసి డైరెక్టర్ నేను ఇది చెప్పలేదు కదా అనేవాళ్లు. నచ్చితే నేను చేసింది అలాగే ఉంచేవాళ్లు కూడా. ప్రేమలు డైరెక్టర్ గిరీశ్ అంత ఫ్రీడమ్​ ఇచ్చారు​. ‘‘ఈ సీన్​లో ఇలా చేస్తాం’’ అని అడిగి మరీ చేసేవాళ్లం. అలాగే మాంటేజ్ సాంగ్ ఒకటి చేస్తున్నప్పుడు హాస్టల్లో చిన్న కెమెరా పెట్టారు. అలా కెమెరా పెట్టిన విషయం మాకు తెలియదు. ఒక పక్క నేను ఏదో పాటలు పాడుతున్నా. మరో పక్క తింటున్నాం. ఆ సీన్​ థియేటర్​లో చూసి షాక్ అయ్యా. అలా సినిమా మొత్తం చాలా నేచురల్​గా వచ్చింది. 

తెలుగుతో అలా కనెక్ట్​ అయ్యా

నాకు ఇతర భాష నేర్చుకోవడం అంటే భయం అనిపించదు. ‘‘ఆ భాష రాదు.. ఎలా?’’ అనే ఆలోచన ఉండదు. వేరే భాషలో ఏవైనా చెప్పమంటే ఎలాంటి బెరుకు లేకుండా చెప్పడానికి ట్రై చేస్తా. తెలుగు కూడా అంతే. నాకు తెలుగు అర్థం కావడానికి కారణం..  తెలుగు సినిమాలు బాగా చూస్తా. మామూలుగానే నాకేదైనా సినిమా బాగా నచ్చితే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. తెలుగు సినిమాలంటే​ చాలా ఇష్టం. ‘ఈగ, మగధీర’ అయితే, ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు.

న్యూస్​ పేపర్లలో, టీవీ ఛానెల్స్​లో ఏ టైంకి ఏ సినిమా వస్తుందో చూసి, ఆ టైంకి రెడీ అయిపోయేదాన్ని. టాలీవుడ్​తో నాకున్న మరో కనెక్షన్... ​ నా ఫేవరేట్​ హీరో అల్లు అర్జున్. నాకు తన సినిమాలంటే బోలెడంత ఇష్టం. అల్లు అర్జున్ తెలుగు సినిమాలు మలయాళంలో డబ్​ అయ్యాయి. ఆ సినిమాలను రెండు భాషల్లో చూడడానికి ఇష్టపడతా. టీవీలో, లాప్​ట్యాప్​లో... అవే సినిమాలు రిపీటెడ్​గా చూస్తుంటా. అల్లు అర్జున్​ సినిమాల్లో పాటలంటే కూడా చాలా ఇష్టం. ‘ప్రేమలు’ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు హైదరాబాద్​లో కొన్ని రోజులు ఉన్నాం. ఆ టైంలోనే అల్లు అర్జున్​కి నేషనల్ అవార్డ్ వచ్చింది. మా షూటింగ్ లొకేషన్​కి దగ్గర్లోనే అల్లు అర్జున్ ఇల్లు ఉందని తెలిసి ఆయన్ని చూడడానికి అక్కడికి వెళ్లా.

పేరు వచ్చింది అప్పుడే...

‘ఆపరేషన్​ జావా’ సినిమా 2021లో చేశా. అందులో ‘అల్ఫోన్సా’ అనే రోల్​ చేశా. ఆ రోల్​​కి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశా. ఇప్పటివరకు చేసినవన్నీ మలయాళంలోనే. కానీ, ఇప్పుడు ‘ప్రేమలు’ సినిమాలో లీడ్​ రోల్​ చేశా. ఇంతకుముందు వరకు చేసిన సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్​ మాత్రమే చేశా. ఫస్ట్ టైం లీడ్​ రోల్​ కనిపించడం చాలా హ్యాపీగా ఉంది. అయితే ‘ప్రేమలు’ సినిమా తెలుగులో కూడా రిలీజ్​ కావడంతో టాలీవుడ్​లో కూడా అడుగుపెట్టినట్టు అయింది.

నాకు హైదరాబాద్​ చాలా నచ్చింది. ప్రేమలు సినిమా కోసం దాదాపు నెల రోజులు హైదరాబాద్​లోనే షూటింగ్ చేశాం. షూటింగ్​ చేసే రోజుల్లో మేం ఎవరో ఇక్కడి వాళ్లకు తెలియదు. కాబట్టి అందరిలానే మేం కూడా జనాల్లో కలిసిపోయి చాలా ఎంజాయ్ చేశాం. కానీ సినిమా రిలీజ్​ అయ్యాక మాత్రం ఎక్కడికెళ్లినా అందరూ గుర్తుపడుతున్నారు. ఆ మార్పు చాలా హ్యాపీగా ఉంద”ని చెప్పింది .

ప్రేమలు గురించి..

‘ ప్రేమలు’ సినిమాలో నేను చేసిన రీను క్యారెక్టర్​లో నటించలేదు.. జీవించా! ఆ క్యారెక్టర్​ చేస్తున్నంత సేపు చాలా ఎంజాయ్​ చేశా. హైదరాబాద్​లో షూటింగ్ చేసినన్ని రోజులు మాకు జాలీ ట్రిప్​కి వచ్చినట్లే అనిపించింది. కొన్నిసార్లు కెమెరా ఉందని మర్చిపోయి మరీ గోల చేసేవాళ్లం. డైరెక్టర్ గిరీష్ 2022లో తీసిన ‘సూపర్ శరణ్య’ అనే మూవీ చేశా. అది సక్సెస్ అయ్యి నాకు పేరొచ్చింది. గిరీశ్ వర్కింగ్​ స్టయిల్​ నాకు తెలుసు. యాక్టింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఎక్స్​ప్రెషన్స్ పెట్టడం, మేనరిజమ్స్ చూపించడం వంటి వాటిల్లో యాక్టర్​కి కొంత స్పేస్ ఇస్తాడు ఆయన. అలాగని  లీడ్ యాక్టర్స్​ కాకుండా చిన్న రోల్​ చేసేవాళ్లయినా సరే ఏదైనా చెప్తే వింటాడు. చెప్పింది నచ్చితే అలాగే చేయమంటాడు. నిజంగా అది ఆయన గొప్పతనం. అందుకే గిరీష్​ డైరెక్షన్​లో చేయడం నాకు చాలా కంఫర్టబుల్​గా ఉంటుంది. అలా ‘సూపర్ శరణ్య’ ద్వారా నటి​గా కొంత నేర్చుకున్నా. కెరీర్​లో ఒక మెట్టు ఎక్కా. 

- ప్రజ్ఞ