ధర్మాన్ని కాపాడటం ఈ శరీరంతోనే సాధ్యం

ధర్మాన్ని కాపాడటం ఈ శరీరంతోనే సాధ్యం

శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్‌‌ అని కుమార సంభవంలో కాళిదాసు చెప్తున్నాడు. ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలలో మొదటిది ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించటానికి ఈ శరీరమే సాధనం. అంటే శరీరాన్ని సత్కార్యాలు చేయటానికి వినియోగించుకోవాలని అర్థం. భగవంతుడు చేపగా అవతరించి వేదాలను కాపాడాడు, తాబేలుగా జన్మించి క్షీరసాగర మధనవేళ సముద్రాన్ని చిలికే కవ్వానికి ఆధారభూతంగా నిలబడ్డాడు.

ఇక బలిచక్రవర్తి విషయానికి వస్తే, అడిగినవారికి లేదనకుండా దానం చేయటమే ధర్మంగా భావించాడు. అందరికీ దానాలు చేశాడు. విష్ణుమూర్తి వామనుడిగా వచ్చి మూడడుగుల నేలను కోరితే, వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని తెలిసినప్పటికీ, ధర్మానికి కట్టుబడి దానం చేశాడు. పాతాళలోకానికి చేరుకున్నాడు. అయినప్పటికీ నేటికీ ధర్మాత్ముడనే పేరుతో బలిచక్రవర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. ప్రతి అవతారంలోనూ ధర్మసాధన కోసమే జన్మించాడు పరమాత్ముడు. 

పరిత్రాణాయ సాధూనామ్‌‌ వినాశాయచ దుష్కృతామ్‌‌ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, వాడే తనకు ఇష్టుడని గీతలో కృష్ణపరమాత్మ చెప్తాడు. యుధిష్ఠరుడు ధర్మాన్ని అతిక్రమించకుండా, అసత్యదోషం వాటిల్లకుండా జీవించాడు. ఆ ధర్మమే తన పేరుగా మార్చుకుని ధర్మరాజు అయ్యాడు. యుద్ధసమయంలో అసత్యం పలకమని చెప్పినా, ధర్మాన్ని అతిక్రమించను అని ‘అశ్వత్థామ హతః కుంజరః’ అనే పలికాడు. కాని అవసరార్థం కుంజరః అనే పదం వచ్చే సమయానికి శంఖనాదం చేయటంతో ఆ పదం ద్రోణునికి వినపడలేదు. అయితే ధర్మరాజు మాత్రం ధర్మం అనే హద్దును దాటలేదు. అందుకే చివరకు బొందితో కైలాసం చేరుకున్నాడు. 

ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని కాపాడటం ఈ శరీరంతోనే సాధ్యం అనేది అర్థం చేసుకోవాలి. అంతరించిపోతున్న ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆదిశంకరాచార్యుడు కాలి నడకన దేశమంతా పర్యటించి తన జన్మను చరితార్థం చేసుకుని, అతి పిన్నవయసులో అంటే కేవలం 32 సంవత్సరాలకే తనువు చాలించాడు. అయితేనేం కొన్ని వందల సంవత్సరాలకు సరిపడేంత ధర్మసంపదను అందరికీ పంచాడు. 

ఆ తరవాయి విద్యారణ్యులు – ధర్మ స్థాపన కోసం విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి నడుం బిగించాడు. తురుష్క మూకలను తునుమాడాడు. చరిత్రలో నిలిచిపోయాడు. వివేకానందుడు కాషాయవస్త్రాలు ధరించి విదేశీయులకు మన ధర్మాన్ని చాటి చెప్పి, కేవలం నాలుగు పదుల వయసులోనే  కన్నుమూశాడు. నేటికీ వివేకానందుని ధర్మసూక్తులు అందరికీ ఆచరణీయంగా నిలిచిపోయాయి. 

ధనసంపాదన, కామ భోగాలు అన్నిటినీ ధర్మమార్గంలో సాధిస్తేనే మోక్షపథానికి చేరుకుంటారనే ఉద్దేశంతోనే పెద్దలు ధర్మానికి మోక్షానికి  మధ్యనే అర్థకామాలను ఇమిడ్చారు. ధర్మానికి అంత ప్రాధాన్యత ఉంది. మన ఉపనిషత్తులు ‘సత్యం వద, ధర్మం చర’ అని పలికాయి. ఇన్ని ధర్మాలను సాధించడానికి మన శరీరమే సాధనం. పశుపక్ష్యాదులన్నీ వాటివాటి ధర్మాలను అవి అనుసరిస్తూనే ఉన్నాయి. మానవులు మాత్రం ఎవరికి తోచినట్లు వారు జీవిస్తూ, అదే ధర్మమని భావిస్తున్నారు. అందుకే ధర్మశాస్త్రకారులు ఏయే ధర్మాలను ఎవరెవరు ఏ విధంగా పాటించాలో మనకు సోదాహరణంగా వివరిస్తున్నారు. 

చేసే పనులను అనుసరించి ఆచరించవలసిన ధర్మశాస్త్రాలను మనకు పూర్వీకులు అందించారు. వైద్య వృత్తిని అనుసరించేవారు ప్రాణాన్ని పోయటం వారి ధర్మం. తమ వృత్తి ద్వారా న్యాయం అందించటం న్యాయవాదుల విధి. మనం చేయవలసిన పనిని సక్రమంగా చేయటం ద్వారా ఆ ధర్మాన్ని అనుసరించటమే కాకుండా, ధర్మాన్ని నిలబెట్టినవారమవుతాం. ప్రజలను కష్టాల బారి నుంచి రక్షించటం రాజధర్మం. శాస్త్రాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయటం పండితుల ధర్మం. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగినప్పుడు వారికి ఉపశమనం కలిగించి ప్రాణాలు నిలబెట్టడం వైద్య ధర్మం. అన్యాయం జరిగినప్పుడు వారికి న్యాయం చేకూర్చటం న్యాయవాదుల ధర్మం. రాజు అనుసరించవలసిన ధర్మాన్ని సామాన్యులు అనుసరించరాదు. తన పాలనలో ఎవరైనా తప్పు చేస్తే ఆ అపరాధిని శిక్షించటం రాజధర్మం. ఎప్పటికప్పుడు లెక్కలు చూసుకుంటూ క్రయవిక్రయాలు చేయటం వ్యాపారస్థుని ధర్మం. ఆయా వృత్తులవారు వారి వృత్తికి సంబంధించిన ధర్మాన్ని అనుసరించటం వారి విధి. అందుకే శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్‌‌  అని పలికాడు కాళిదాసు.
–డా. వైజయంతి పురాణపండ 
ఫోన్: 80085 51232