ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐకి ఇవ్వాలనే రిట్​పై ఇయ్యాల విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐకి ఇవ్వాలనే రిట్​పై ఇయ్యాల విచారణ

హైదరాబాద్, వెలుగు: నలుగురు టీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని బీజేపీ నేత జి.ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్‌కు విచారణార్హత ఉందో.. లేదో.. మంగళవారం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొంది. రిట్‌కు విచారణ అర్హత ఉందని, కేసు నమోదుకు ముందే పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని పిటిషనర్‌‌ తరఫు లాయర్‌‌ వాదించారు. దీంతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. వాదనల తర్వాత మంగళవారం దీనిపై నిర్ణయం వెల్లడిస్తామని జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం చెప్పారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన 24 గంటలు కూడా అవ్వకుండానే దర్యాప్తు ఏకపక్షంగా ఉందని, సీబీఐకి ఇవ్వాలని కేసుకు ఏ మాత్రం సంబంధం లేని బీజేపీ నాయకుడు రిట్‌ దాఖలు చేయడం చెల్లదని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదించారు. 

నిందితుడు నందు భార్య చిత్రలేఖ వేసిన రిట్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు పర్మిషన్‌ ఇవ్వాలని సీనియర్​ లాయర్​ ఉదయ్‌ హోళ్ల హైకోర్టును కోరారు. రామచంద్రభారతి, కోరె నందకుమార్‌ (నందు), సింహయాజిలు కలిసి రిట్‌ వేశారని చెప్పారు. నందు రిట్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు న్యాయమూర్తి అనుమతించారు. తిరిగి ఉదయ్‌ వాదిస్తూ, సుప్రీంకోర్టు వెస్ట్‌ బెంగాల్‌ వర్సెస్‌ కమిటీ ఫర్‌ డెమక్రటిక్‌ రైట్స్‌ మధ్య కేసులో పోలీసులు కేసు పెట్టడానికి ముందే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టరాదని చెప్పిందన్నారు. కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరారు. తీన్మార్‌ మల్లన్న వేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ తరఫు అడ్వొకేట్‌ సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయబోగా హైకోర్టు ఆక్షేపించింది. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను ఇంకా అనుమతించలేదని చెప్పింది. బీజేపీ రిట్‌కు విచారణార్హత ఉందో లేదో అనే వివాదంపై ఇరుపక్షాలు ప్రస్తావించిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రతులను అందజేయాలని ఆదేశించింది. దీనిపై మంగళవారం తగిన ఉత్తర్వులు ఇస్తామని చెప్పింది.