
షార్జా: ఐపీఎల్ 14 సెకండ్ ఫేజ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్రేక్‌లు పడ్డాయి. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. డీసీకి చెక్ పెట్టింది. మంగళవారం మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 127/9 స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్ (39), రిషబ్ పంత్ (39) రాణించారు. షార్జా స్లో వికెట్‌పై సమష్టిగా రాణించిన కోల్‌కతా బౌలర్లు.. ఢిల్లీ భీకరమైన లైనప్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. ధవన్ (24) ఫర్వాలేదనిపించగా, శ్రేయస్ అయ్యర్ (1), హెట్‌మయర్ (4), లలిత్ (0), అక్షర్ (0), అశ్విన్ (9) ఫెయిలయ్యారు. లాస్ట్ ఓవర్‌లో మోర్గాన్, అశ్విన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. తర్వాత టార్గెట్ ఛేజింగ్‌లో కోల్‌కతా 18.2 ఓవర్లలో 130/7 స్కోరు చేసి గెలిచింది. నితీశ్ రాణా (36 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (30) నిలకడగా ఆడారు. రాణా చివరి దాగా క్రీజులో ఉండగా.. నరైన్ (10 బాల్స్‌లో 1ఫోర్, 2 సిక్సర్లతో 21) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. నరైన్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.