తండ్రి బార్బర్‌‌‌‌.. కొడుకు సూపర్​ బౌలర్‌‌

తండ్రి బార్బర్‌‌‌‌.. కొడుకు సూపర్​ బౌలర్‌‌

ముంబై: ఐపీఎల్‌‌తో ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ఆ జాబితాలో ఇప్పుడు మరో ప్లేయర్‌‌ చేరాడు.  తనే  రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ యువ పేసర్‌‌, 25 ఏళ్ల కుల్దీప్‌‌ సేన్‌‌. ఆదివారం లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌తో పోరులో ఐపీఎల్‌‌ ప్రయాణం మొదలు పెట్టిన సేన్‌‌ తన తొలి మ్యాచ్‌‌లోనే అద్భుతంగా బౌలింగ్‌‌ చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో మార్కస్‌‌ స్టోయినిస్‌‌ లాంటి వరల్డ్‌‌ క్లాస్‌‌ హిట్టర్‌‌ క్రీజులో ఉండగా.. 15 రన్స్‌‌ను కాపాడుకొని టీమ్‌‌ను గెలిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.   సేన్‌‌  నేపథ్యం తెలిస్తే అతనిపై గౌరవం పెరుగుతుంది.  ఎందుకంటే కుల్దీప్​ సేన్​ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి బార్బర్‌‌. మధ్యప్రదేశ్‌‌ రెవా జిల్లాలోని హరిహర్‌‌పూర్‌‌ పట్టణం వీళ్ల స్వస్థలం. సొంతూరులో తండ్రి రామ్‌‌ పాల్‌‌ సేన్‌‌కు ఉన్న  హెయిర్‌‌ సెలూన్‌‌ షాప్‌‌ కుటుంబానికి జీవనాధారం. అయితే, చిన్నప్పటి నుంచే క్రికెట్‌‌పై ఇష్టం పెంచుకున్న సేన్‌‌ టాలెంట్‌‌ను గుర్తించిన రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ ఈ సీజన్‌‌ వేలంలో రూ. 20 లక్షల ప్రారంభ ధరకు కొనుగోలు చేసింది. అంతేకాకుండా తమ నాలుగో మ్యాచ్‌‌లోనే అతనికి అవకాశం ఇచ్చింది. టీమ్‌‌ నమ్మకాన్ని నిలబెట్టిన కుల్దీప్‌‌ సేన్‌‌.. ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో  11 రన్స్‌‌ మాత్రమే ఇచ్చి హీరో అయ్యాడు.  కుల్దీప్‌‌ సేన్‌‌ ఆటను  రామ్‌‌ పాల్‌‌ సేన్‌‌.. ఆదివారం రాత్రంతా తన హెయిర్‌‌ సెలూన్‌‌లోనే ఉండి చూశాడు.