
ముంబై: గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ టీమ్‌లో చేరాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో హోమ్ సిరీస్ సందర్భంగా సూర్య చేతి వేలికి గాయమైంది. అప్పటి నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో చేరి కోలుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తొలి మ్యాచ్‌కు సూర్య అందుబాటులో లేకుండా పోయాడు. అయితే, క్వారంటైన్ పూర్తి చేసుకున్న అనంతరం బుధవారమే తను టీమ్‌లో కలిశాడని ముంబై ఫ్రాంచైజీ తెలిపింది. టీమ్‌మేట్స్ పొలార్డ్, ఇషాన్ కిషన్, బుమ్రాతో కలిసి జిమ్ సెషన్‌లో ఫిట్‌నెస్ ట్రెయినింగ్‌లో కూడా పాల్గొన్నాడని చెప్పింది. ఈ నేపథ్యంలో శనివారం రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో సూర్య తుది జట్టులో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.