ఇక దబిడి దిబిడే.. ఆర్‌సీబీ కొత్త కోచ్‌గా మాజీ కెప్టెన్

ఇక దబిడి దిబిడే.. ఆర్‌సీబీ కొత్త కోచ్‌గా మాజీ కెప్టెన్

ఐపీఎల్ 2024 సందడి దేశంలో అప్పుడే మొదలైపోయింది. గత సీజన్‌లో అద్బుతంగా రాణించిన జట్లు అప్‌కమింగ్ సీజన్‌లో ఎలాంటి వ్యూహాలు అమలుచేయాలన్న దానిపై ప్రణాళికలు రచిస్తుండగా.. విఫలమైన జట్లు ఆటగాళ్లు, సిబ్బంది ఏరివేతకు పూనుకున్నాయి. 

ఇప్పటికే తెలుగు అభిమాన జట్టు సన్‌రైజర్స్ యాజమాన్యం.. హెడ్‌కోచ్ బ్రియన్ లారాపై వేటు వేసినట్లు వార్తలొస్తుండగా, కర్ణాటక ప్రాంచైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అలాంటి కీలక నిర్ణయమే తీసుకుంది. అప్‌కమింగ్ సీజన్‌లో టైటిలే లక్ష్యంగాఆర్‌సీబీ జట్టు ప్రక్షాళన చేపట్టింది. టీమ్ డైరెక్టర్‌గా.. హెడ్ కోచ్‌గా సేవలందించిన మైక్ హెస్సెన్‌ తో పాటు హెడ్ కోచ్‌గా సేవలందించిన సంజయ్ బంగర్‌పై వేటు వేసింది. కొత్త కోచ్‌గా జింబాబ్వే మాజీ ప్లేయర్ ఆండీ ఫ్లవర్‌ను నియమించింది. ఈ మేరకు ఆర్‌సీబీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.

ఆండీ ఫ్లవర్‌ గొప్పోడే.. మరి ఆర్‌సీబీకి పట్టిన దరిద్రం పోతుందా?

హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌కు మంచి రికార్డే ఉంది. గతేడాది ఇంగ్లండ్ కోచ్‌గా ఆ జట్టుకు టీ20 ప్రపంచకప్ అందించిన ఆండీ ఫ్లవర్.. యాషెస్ సిరీస్‌లోనూ విజేతగా నిలబెట్టారు. కరీబియన్ లీగ్‌, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్, ఇంటర్నేషనల్ లీగ్ 20, అబుదాబి టీ10, ది హండ్రెడ్ 2022లో తాను హెడ్ కోచ్‌గా పనిచేసిన జట్లను విజేతగా నిలబెట్టారు. అంతేకాదు.. ఐపీఎల్‌ టోర్నీలో లక్నో ఫ్రాంచైజ్ లక్నో సూపర్ జెయింట్స్‌ను రెండు సార్లు ప్లే ఆఫ్స్ చేర్చారు. ఈ రికార్డులు చూసే ఆర్‌సీబీ.. అతని వైపు మొగ్గుచూపింది.