రాజస్తాన్ రాయల్స్ ఫ్యాన్స్ రావాలమ్మా.. శాంసన్ టీంలో లేకపోవడం లోటే.. కానీ..

రాజస్తాన్ రాయల్స్ ఫ్యాన్స్ రావాలమ్మా.. శాంసన్ టీంలో లేకపోవడం లోటే.. కానీ..

ఐపీఎల్ తొలి సీజన్‌‌లోనే చాంపియన్ అనిపించుకున్న రాజస్తాన్ రాయల్స్ (ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌) రెండో ట్రోఫీ కోసం ఏండ్లుగా నిరీక్షిస్తూనే ఉంది. 2022లో ఫైనల్ చేరినప్పటికీ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్‌‌తో సరిపెట్టుకుంది. గతేడాది కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి నిరాశపరిచిన రాయల్స్.. 2026 సీజన్ కోసం జట్టులో విప్లవాత్మక మార్పులు చేసింది. చాలా కాలంగా జట్టును నడిపించిన సంజూ శాంసన్‌‌ను చెన్నై సూపర్ కింగ్స్‌‌కు ట్రేడ్ చేసి, బదులుగా రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకుంది.

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన శాంసన్ లేకపోవడం జట్టుకు లోటే అయినా.. జడేజా లాంటి స్టార్ ఆల్‌‌రౌండర్ రాక, యంగ్ ప్లేయర్‌‌‌‌ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో  రాయల్స్ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. యువ రక్తం, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు ఈసారి ఎలాగైనా రెండో టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది.

బలాలు
పవర్ హిట్టింగ్ రాజస్తాన్ రాయల్స్ కు అసలైన బలం. యశస్వి జైస్వాల్ క్లాస్ బ్యాటింగ్‌‌కు తోడు, ఐపీఎల్ చరిత్రలో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్‌‌‌‌  వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్  జట్టుకు కొండంత అండ. మిడిల్ ఆర్డర్‌‌లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్‌‌మయర్ వంటి హార్డ్ హిట్టర్లు ఉండటంతో ఎంతటి భారీ టార్గెట్ అయినా ఛేదించే సత్తా ఈ జట్టుకు ఉంది. ఇక బౌలింగ్‌లో రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్‌‌తో కూడిన స్పిన్ విభాగం ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉంది. జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్ వంటి ఫారిన్ పేసర్లు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నారు.

బలహీనతలు
బ్యాటింగ్ ఆర్డర్‌‌లో స్పష్టత లేకపోవడం రాయల్స్ ప్రధాన బలహీనత. ఓపెనర్లుగా  జైస్వాల్, సూర్యవంశీ ఖాయమైనా.. కెప్టెన్ రియన్‌‌ పరాగ్‌‌తో పాటు మిడిల్ ఆర్డర్‌‌లో డొనొవన్ ఫెరీరా వంటి ప్లేయర్లను ఎలా వాడుకుంటారనే దానిపై సందిగ్ధత ఉంది. ట్రేడింగ్‌‌లో వచ్చిన సామ్ కరన్ గాయంతో దూరం అయ్యే అవకాశం ఉండటం ఆల్‌‌రౌండ్ విభాగంపై ప్రభావం చూపనుంది. జడేజా కేవలం బౌలర్‌‌గానే ఉంటాడా లేదా బ్యాటింగ్‌‌లోనూ ప్రమోషన్ పొందుతాడా అనేది చూడాలి. జట్టులో ఫారిన్ ప్లేయర్ల ఎంపిక కూడా మేనేజ్‌‌మెంట్‌‌కు సవాలుగా మారనుంది. తుది జట్టులో కేవలం నలుగురికే అవకాశం ఉండటంతో సరైన కాంబినేషన్ కుదరకపోతే జట్టు స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఉంది.

రాజస్తాన్ రాయల్స్ టీమ్
రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్‌‌మయర్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌‌పాండే, సందీప్ శర్మ, నండ్రే బర్గర్, ఆడమ్ మిల్నే, క్వేనా మఫాకా, వైభవ్ సూర్యవంశీ, డొనొవన్ ఫెరీరా, రవి బిష్ణోయ్, శుభమ్ దూబే, కుల్దీప్ సేన్, యుధ్వీర్ సింగ్ చారక్, లువాన్ డ్రే ప్రిటోరియస్, విఘ్నేష్ పుతూర్, సుశాంత్ మిశ్రా, యష్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ, అమన్ రావు.