బీసీసీఐ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతాం

బీసీసీఐ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతాం

విదేశీ లీగ్స్లకు టీమిండియా ప్లేయర్లను అనుమతించేది లేదన్న బీసీసీఐ నిర్ణయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తున్నాయి. ఆటగాళ్లపై కోట్లు పెట్టామని..బీసీసీఐ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతామని చెబుతున్నాయి. ఇది అన్యాయమని ఐపీఎల్ ఫ్రాంచైజీలు గగ్గోలు పెడుతున్నాయి. 

బీసీసీఐ కారణాలు చెప్పాలి..


టీమిండియా ప్లేయర్లు విదేశీ లీగ్స్ ఆడే విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై కారణాలు చెప్పాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. అయితే ఈ అంశంపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి  అధికారిక సమాచారం లేదని పేర్కొంటున్నాయి. మీడియాలోనే బీసీసీఐ నిర్ణయం గురించి చూశామని..ఒకవేళ బోర్డు నిర్ణయం అదే అయితే..తాము నష్టపోతామంటున్నాయి. తమకు అందుబాటులో ఉన్న  వనరులను ఎక్కడైనా ఉపయోగించుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఇండియాలోనే కాకుండా..విదేశీ లీగ్స్లో  పెద్ద మొత్తంలో  నగదు ముట్టజెప్పి  ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నామన్నాయి. వాళ్లను ఎక్కడైనా ఉపయోగించుకునే ఛాన్స్ తమకు ఇవ్వాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. 

ఫ్రాంచైజీలకు బీసీసీఐ షాక్..


సౌతాఫ్రికా, యూఏఈలో జరిగే క్రికెట్ లీగ్లలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు జట్లను కొనుగోలు చేశాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో 6  జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే కొనుగోలు చేయడం గమనార్హం. ఇందులో  ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల యాజమాన్యం కూడా అక్కడ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి.  ఐపీఎల్లో ఆడే భారత ఆటగాళ్లను అక్కడ ఆడించాలనుకున్నాయి. ఇటు చెన్నై సూపర్ కింగ్స్..తమ కెప్టెన్ ధోనిని  జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ టీమ్‌కు మెంటార్‌గా నియమించాలని భావించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోని.. ఐపీఎల్ మాత్రమే ఆడుతుండటంతో ..బీసీసీఐ నుంచి అనుమతి లభిస్తుందని సీఎస్కే యాజమాన్యం భావించింది.  కానీ ఆ జట్టుకు బీసీసీఐ షాకిచ్చింది.

రూల్ ఈజ్ రూల్..రూల్ ఫర్ ఆల్..
విదేశీ లీగ్స్కు భారత క్రికెటర్లను అనుమతించే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. విదేశీ లీగ్స్ ఆడాలనుకుంటే భారత్ క్రికెట్‌తో తెగతెంపులు చేసుకోవాలని సూచించింది.  విదేశీ లీగ్స్లో ఆడాలనుకుంటే జాతీయ, అంతర్జాతీయ క్రికెట్తో పాటు..ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.  ఎంత పెద్ద క్రికెటర్కైనా ఇదే రూల్ వర్తిస్తుందని పేర్కొంది.