ఐపీఎల్ ఈజ్ బ్యాక్.. 3 వారాల్లో 31 మ్యాచ్​లు!

ఐపీఎల్ ఈజ్ బ్యాక్.. 3 వారాల్లో 31 మ్యాచ్​లు!
  • యూఏఈలో ఐపీఎల్‌ ఫేజ్‌2
  • సెప్టెంబర్‌ 18న రీస్టార్ట్‌ !
  • అక్టోబర్​ 9 లేదా 10న ఫైనల్​
  • 10 డబుల్​ హెడర్​ మ్యాచ్​లు

ఐపీఎల్​ ఫేజ్​–2కు రంగం సిద్ధమవుతోంది..! అందరూ అనుకున్నట్లుగానే... ​ అరబ్​ గడ్డపైనే ధనాధన్​ లీగ్​ను కంప్లీట్​ చేసేందుకు బీసీసీఐ ప్లాన్స్​ వేస్తోంది..! అయితే ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు బాగా లేకపోవడంతో.. మూడు వారాల్లోనే మిగిలిన 31 మ్యాచ్​లను పూర్తి చేయాలని భావిస్తోంది..! ఇదే జరిగితే యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 18న లీగ్​ను రీస్టార్ట్​ చేసి..అక్టోబర్​ 10న తెరదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..! మొత్తానికి అందర్ని సంతృప్తి పరిచే విధంగా లీగ్​ను ఫినిష్​ చేయాలని బోర్డు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది..!!

న్యూఢిల్లీ: ఐపీఎల్​–14 వాయిదా పడి నెల రోజులు కూడా గడవకముందే.. లీగ్​ను మళ్లీ పట్టాలెక్కించేందుకు బీసీసీఐ రెడీ అవుతున్నది. అనీ అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్​–అక్టోబర్​ విండోలో లీగ్​ను కంప్లీట్​ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పుడున్న సమాచారం మేరకు.. మిగిలిపోయిన 31 మ్యాచ్​లను మూడు వారాల విండోలో ఫినిష్​ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అంటే సెప్టెంబర్​ 18 లేదా 19న లీగ్​ను రీస్టార్ట్​ చేసి అక్టోబర్​ 9 లేదా 10న ఫైనల్​తో ఫినిష్​ చేయాలనుకుంటోంది. క్రికెటర్లు, స్టేక్​ హోల్డర్స్​, బ్రాడ్​కాస్టర్స్​, ఫ్రాంచైజీలను సంతృప్తి పరిచే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై బోర్డు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ‘లీగ్​కు సంబంధించిన అన్ని స్టేక్​ హోల్డర్స్​, ఫ్రాంచైజీలు, బ్రాడ్​కాస్టర్స్​తో  రీస్టార్ట్​ గురించి బీసీసీఐ చర్చించింది. 18, 19 శని, అదివారాలు ఉండటంతో రీస్టార్ట్​కు ఇంతకంటే మంచి చాన్స్​ ఉండదు. ఫైనల్​ కూడా సేమ్​ వీకెండ్​లోనే వస్తుంది. ఇప్పటికైతే  ప్రాధమిక షెడ్యూల్​ను కంప్లీట్​ చేసే పనిలో ఉన్నాం. మొత్తం 10 డబుల్​ హెడర్​ మ్యాచ్​లు ఉండొచ్చు. అలాగే, 4  మెయిన్​ మ్యాచ్​లు (2 క్వాలిఫయర్స్​, 1 ఎలిమినేటర్​, ఫైనల్) ఉంటాయి. ఓవరాల్​గా 31 మ్యాచ్​లను మూడు వారాల విండోలో పూర్తి చేస్తాం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నాడు. 

డైరెక్ట్​గా దుబాయ్​కు..
యూకే టూర్​ తర్వాత టీమిండియాతో పాటు, ఇంగ్లండ్​ ప్లేయర్లందరూ ఐపీఎల్​ ఫేజ్​2 కోసం  నేరుగా దుబాయ్​ చేరుకునే విధంగా ప్లాన్​ చేస్తున్నారు. సెప్టెంబర్​ 14న మాంచెస్టర్​లో ఇంగ్లండ్​తో లాస్ట్​ టెస్ట్​ ముగుస్తుంది. ఆ తర్వాతి రోజు చార్టెడ్​ ఫ్లైట్​లో ఇరుజట్ల ప్లేయర్లు దుబాయ్​కు చేరుకుంటారు. అంటే బబుల్​ టు బబుల్​ ట్రాన్స్​ఫర్​ జరుగుతుంది. ‘రెండు టీమ్​లు ఒకే ఫ్లైట్​లో ట్రావెల్​ చేస్తాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​లో ఆడే వెస్టిండీస్​ ఆటగాళ్లు కూడా డైరెక్ట్​గా యూఏఈకి చేరుకుంటారు. వాళ్లకు స్పెషల్​ ఫ్లైట్స్​ ఏర్పాటు చేస్తాం. ఏ ఒక్కర్ని కూడా కమర్షియల్​ ఫ్లైట్స్​లో ట్రావెల్​ చేయకుండా చూస్తాం’ అని బోర్డు సోర్సెస్​ వెల్లడించాయి.  

సౌతాఫ్రికా సిరీస్​ రద్దు​
ఐపీఎల్​ పూర్తి చేయడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన బీసీసీఐ.. ఇందుకోసం కొన్ని త్యాగాలు కూడా చేస్తున్నది. ఇందులో భాగంగా సెప్టెంబర్​లో సౌతాఫ్రికాతో జరగాల్సిన వైట్​బాల్​ సిరీస్​ను బోర్డు రద్దుచేయనుంది. టీ20 వరల్డ్​కప్​ ప్రిపరేషన్స్​ కోసం దీనిని షెడ్యూల్​ చేసినా.. ఐపీఎల్​ కంటే బెటర్​ టోర్నీ మరోటి లేదని ఇండియన్​ బోర్డు భావిస్తోంది. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ సఫారీలతో సిరీస్​ జరగదు. దాని ప్లేస్​లో ఐపీఎల్​లాంటి మెగా లీగ్​ ఆడటం కంటే టీ20 వరల్డ్​కప్​కు మంచి ప్రిపరేషన్​ మరోటి లేదు. లీగ్​ ముగిసిన వెంటనే వారం, పది రోజుల్లో మెగా ఈవెంట్​ మొదలవుతుంది. సౌతాఫ్రికా సిరీస్​ తర్వాత ప్లాన్​ చేస్తాం. వచ్చే ఏడాది​ ఎలాగూ అక్కడికి వెళ్లే చాన్స్​ ఉంది. ఆ టైమ్​లోనే ఎక్కువ మ్యాచ్​లు ఆడతాం’ అని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. 

కివీస్​తో సిరీస్​ షిఫ్ట్​..
హోమ్​ సిరీస్​లో భాగంగా ఇండియా... న్యూజిలాండ్​తో నవంబర్​లో ఆ రెండు టెస్ట్​లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్​ను కూడా షిఫ్ట్​ చేసే చాన్స్​ ఉంది. టీ20 వరల్డ్​కప్​ ముగిసిన తర్వాత ఈ సిరీస్​ జరిగే చాన్స్​ ఉంది. దీనిపై బోర్డు తుది  నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు టీ20 వరల్డ్​కప్​ వేదికపై  ఇంకా స్పష్టత రాలేదు. ఇండియాలో కరోనా సిచ్యువేషన్స్​ను బట్టి దీనిపై నిర్ణయం వచ్చే చాన్స్​ ఉంది. హెల్త్​  ఎమర్జెన్సీ వల్ల వేరే  దేశాలు ఇండియా వచ్చేందుకు ఇష్టపడకపోతే అప్పుడు మరో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

వ్యాక్సినేషన్​ ఎలా..?
ఐపీఎల్​ కోసం యూఏఈ బోర్డు.. బీసీసీఐతో అగ్రిమెంట్​ చేసుకున్నా వ్యాక్సినేషన్​ విషయంలో కొద్దిగా ఇబ్బందులు రావొచ్చు. ప్రస్తుతం ఇండియాపై యూఏఈ ట్రావెల్​ బ్యాన్​ విధించింది. కొన్ని రూల్స్​ సడలించినా.. వ్యాక్సినేషన్​ మాత్రం తప్పనిసరి చేసే అవకాశాలున్నాయి. అలా చేస్తే ప్లేయర్లు, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌, మ్యాచ్​ అఫీషియల్స్​, కోచింగ్​ స్టాఫ్​, ఫ్రాంచైజీ అఫీషియల్స్​, బీసీసీఐ అఫీషియల్స్​.. ఇలా దాదాపు 700 నుంచి 800 మంది దాకా వ్యాక్సిన్​ వేయించుకోవాల్సి ఉంటుంది. టీమిండియా మెంబర్స్​కు ఇప్పటికే ఒక డోస్‌ వ్యాక్సినేషన్​ పూర్తయినా.. డొమెస్టిక్​ క్రికెటర్లకు ఇంకా మొదలే కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెప్టెంబర్​లోపు రెండో డోసుల వ్యాక్సిన్​ వేసుకోవడం  కష్టంగా మారింది. ‘యూఏఈ వచ్చే వారు కచ్చితంగా వ్యాక్సిన్​ వేయించుకోవాలన్నది అక్కడి గవర్నమెంట్​ రూల్​. అబుదాబిలోనూ ఇదే పరిస్థితి.  మ్యాచ్​ల సందర్భంగా లాస్ట్​ ఇయర్​ పరిస్థితే ఉంటుంది. కచ్చితంగా క్వారంటైన్​ రూల్స్​, కొవిడ్​ టెస్ట్​లు ఇలా అన్నీ ఫాలో కావాల్సిందే’ అని బోర్డు వర్గాలు వెల్లడించాయి.