ఐపీఎల్ మీడియా హక్కులు @ రూ. 43,000 కోట్లు !

ఐపీఎల్ మీడియా హక్కులు @ రూ. 43,000 కోట్లు !

బీసీసీఐ పంట పడింది. ఐపీఎల్ పుణ్యాన బీసీసీఐ గల్లాపెట్టె  కాసులతో మరోసారి నిండనుంది. ఆదివారం ప్రారంభమైన ఐపీఎల్ మీడియా రైట్స్ వేలం.. బీసీసీఐకు భారీ ఆదాయాన్ని సమకూర్చే అవకాశం కనిపిస్తోంది.  హోరా హోరీగా సాగిన ఐపీఎల్ మీడియా రైట్స్ వేలంలో బిడ్డర్లు పోటీ పడి బిడ్స్ దాఖలు చేశారు. టీవీ, డిజిటల్ హక్కుల కోసం వేలంలో నువ్వా నేనా అన్నట్లు పాల్గొన్నారు.  ఐదేళ్లకాలానికి ఉన్న ఈ రైట్స్‌ కనీస ధరని బీసీసీఐ రూ.32 వేల కోట్లుగా నిర్ణయించింది. ఫస్ట్ డే రూ. 40 వేల కోట్లు దాటడం విశేషం.  

 ఫస్ట్ డే @ రూ. 43 వేల కోట్లు..
2023 నుంచి 2027  ఐపీఎల్ సీజన్ టీవీ, డిజిటల్ ప్రసారాలకు సంబంధించి మీడియా హక్కులను బీసీసీఐ వేలంలో ఉంచింది. నాలుగు ప్యాకేజీలుగా ( A,B,C,D)  వేలం వేస్తోంది. ప్యాకేజీ A లో.. ప్రతీ సీజన్లో 74 ఐపీఎల్ మ్యాచ్‌లను ఇండియాలో టీవీల ద్వారా ప్రసారం చేయడం, ప్యాకేజీ B లో.. డిజిటల్ హక్కులు పొందడం..వీటిని ఇండియాలోనే ప్రసారం చేయడం.. ప్యాకేజీ - C లో.. ప్లేఆఫ్స్‌తో పాటు  కొన్ని  స్పెషల్ మ్యాచ్‌లను మొత్తంగా 18 మ్యాచులను ప్రసారం చేయడానికి అవసరమైన డిజిటల్ హక్కులు పొందడం. ఇవి భారత్లోనే ప్రసారం చేయడం.  ప్యాకేజీ -Dలో..వరల్డ్ వైడ్ గా టీవీ,  డిజిటల్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడం. అయితే ఆదివారం A ( భారత్ లో టీవీ హక్కులు ) B ( డిజిటల్ హక్కులు) విభాగాలకు వేలం జరిగింది.   ఫస్ట్  రెండు ప్యాకేజీల్లో మొదటి రోజే రూ.42 వేల కోట్లు దాఖలయ్యాయి. ఇందులోటీవీ ప్రసార హక్కుల కోసం రూ. 23,370 కోట్లు, డిజిటల్ ప్రసార హక్కుల కోసం  రూ. 19,700 కోట్లు దాఖలయ్యాయి. నాలుగు ప్యాకేజీలకు కలిపి బీసీసీఐ రూ. 32,890 కోట్ల బేస్ ప్రైజ్ను నిర్ణయిస్తే.. కేవలం మొదటి రెండు ప్యాకేజీల్లోనే ఈ బేస్‌ప్రైస్ను క్రాస్ చేసి..అధికంగా మరో రూ. 10 వేల కోట్లు అధికంగా బిడ్డింగ్స్ దాఖలవడం విశేషం. 

 మ్యాచ్ కు రూ. 100 కోట్లా.. !
టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్కు రూ. 49 కోట్లు,  డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా బేస్ ధర  ప్రైజ్ను  బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఆదివారం జరిగిన వేలంలో ఒక్క మ్యాచ్కు వంద కోట్లకు పైగా దాఖలవడంతో బీసీసీఐతో పాటు ఆటగాళ్లు, క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 57 కోట్లు, డిజిటల్ హక్కులు రూ. 48.04  కోట్లుగా బిడ్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన ఒక్కో మ్యాచ్కు రూ. 105.04 కోట్లుగా బిడ్లు దాఖలవడం గమనార్హం.  టీవీ అయితే సోమవారం కూడా ఈ వేలం కొనసాగనుండటంతో..ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. 

 దిగ్గజాల మధ్య ఐపీఎల్ వేలం వార్..
టీవీ, డిజిటల్ ప్రసార హక్కుల కోసం  డిస్నీస్టార్, రిలయన్స్ వయాకామ్ 18, సోనీ నెట్‌వర్క్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి దిగ్గజ కంపెనీలు పోటీపడ్డాయి. వీటితో పాటు టైమ్స్ ఇంటర్నెట్, రిలయన్స్ జియో కూడా బిడ్స్ దాఖలు చేశాయి.  డిజిటల్ హక్కుల కోసం  టైమ్స్ ఇంటర్నెట్, రిలయన్స్ జియో బిడ్డింగ్స్ వేయగా..సూపర్ స్పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్రిటరీ హక్కుల కోసం బిడ్డింగ్స్ వేసింది. అయితే ఫస్ట్ రెండు ప్యాకేజీల కోసం  డిస్నీస్టార్, రిలయన్స్ వయాకామ్ 18, సోనీ నెట్‌వర్క్ సంస్థలు  తీవ్రంగా పోటీపడ్డాయి.  అయితే  జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్యాకేజీ- A కోసం బిడ్డింగ్స్ దాఖలు చేసింది. 

రూ. 60 కోట్ల మార్కు అందుకునేనా..?
2018 నుంచి 2022 వరలకు ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ మీడియా గ్రూప్ 2017లో దక్కించుకుంది. అప్పట్లో రూ.16,347 కోట్లతో  స్టార్ ఇండియా బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం  ఐపీఎల్కు ఆదరణ పెరగడంతో..బీసీసీఐ బేస్ ప్రైజ్ను డబుల్ (రూ. 32,890 కోట్లు) చేసింది. అయినా మీడియా కంపెనీలు తగ్గేదెలా అన్నట్లు పోటీపడుతున్నాయి.  ముఖ్యంగా  రిలయన్స్‌కి చెందిన వయాకాన్ 18, డిస్నీ స్టార్, సోనీ నువ్వా నేనా అన్నట్లు వేలం పాటలో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం పోటీ నుంచి అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తప్పుకోగా..మొత్తంగా 10 కంపెనీలు పోటీపడుతున్నాయి. సోమవారం కూడా వేలం కొనసాగనుండటంతో...ఇదే స్పీడ్ కొనసాగితే మాత్రం..60 వేల కోట్ల మార్కును అందుకోవడం ఈజీ అని  మార్కెట్ నిపుణులు అంటున్నారు.