
- వైభవ్ మెరిసెన్.. 6 వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ గెలుపు
- రాణించిన జురెల్, శాంసన్, జైస్వాల్
- ఆకట్టుకున్న రాయల్స్ బౌలర్లు
న్యూఢిల్లీ: ప్లే ఆఫ్స్‌కు దూరమైన రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పైచేయి సాధించింది. టార్గెట్ ఛేజింగ్‌లో వైభవ్ సూర్యవంశీ (33 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), కెప్టెన్ సంజూ శాంసన్ (31 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), ధ్రువ్ జురెల్ (12 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31 నాటౌట్) దంచికొట్టడంతో.. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచి మెగా లీగ్‌ను ముగించింది.
టాస్ ఓడిన చెన్నై 20 ఓవర్లలో 187/8 స్కోరు చేసింది. ఆయుష్ మాత్రే (20 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), డేవ్లాడ్ బ్రేవిస్ (25 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), శివమ్ దూబే (32 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) రాణించారు. తర్వాత రాజస్తాన్ 17.1 ఓవర్లలో 188/4 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (36) ఫర్వాలేదనిపించాడు. మధ్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
78 రన్స్‌కే 5 వికెట్లు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నైని ఆరంభంలో రాజస్తాన్ బౌలర్లు బాగా కట్టడి చేసినా లోయర్ ఆర్డర్‌లో బ్రేవిస్, దూబే ధనాధన్ బ్యాటింగ్‌తో మంచి స్కోరును అందించారు. స్టార్టింగ్‌లో ఓపెనర్ ఆయుష్ మాత్రే వరుస ఫోర్లతో రెచ్చిపోయాడు. కానీ రెండో ఓవర్‌లో యుధ్వీర్ సింగ్ (3/47) మూడు బాల్స్ తేడాలో డేవన్ కాన్వే (10), ఉర్విల్ పటేల్ (0)ను ఔట్ చేశాడు.
12/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను ఆయుష్, అశ్విన్ (13) నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆరో ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే (1/33).. ఆయుష్‌ను పెవిలియన్‌కు పంపడంతో మూడో వికెట్‌కు 56 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. పవర్‌ప్లేలో సీఎస్కే 68/3తో నిలిచింది. ఈ దశలో బ్రేవిస్ నిలకడగా ఆడినా.. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత ఏడు బాల్స్ తేడాలో అశ్విన్, జడేజా (1) ఔట్ కావడంతో చెన్నై 78 రన్స్‌కే సగం వికెట్లను కోల్పోయింది.
బ్రేవిస్‌తో జత కలిసిన దూబే బ్యాట్ ఝుళిపించాడు. ఆకాశ్ మధ్వాల్ (3/29)ను మినహాయించి ఈ ఇద్దరు మిగతా బౌలర్లను ఉతికేశారు. ఈ క్రమంలో ఆరో వికెట్‌కు 59 రన్స్ జోడించి బ్రేవిస్ వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన ధోనీ (16) నెమ్మదిగా ఆడినా దూబే ఎక్కడా తగ్గలేదు. ఫలితంగా ఏడో వికెట్‌కు 43 రన్స్ జతయ్యాయి. బ్రేవిస్, దూబేతో పాటు ధోనీ వికెట్లు పడగొట్టిన మధ్వాల్ భారీ స్కోరును అడ్డుకున్నాడు. చివర్లో అన్షుల్ కాంబోజ్ (5 నాటౌట్), నూర్ అహ్మద్ (2 నాటౌట్) ఓ మాదిరిగా ఆడారు.
టాప్ లేపారు..
ఛేజింగ్‌లో రాజస్తాన్ టాప్ ఆర్డర్ మెరుగ్గా ఆడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీని అడ్డుకోవడంలో సీఎస్కే బౌలర్లు విఫలం కావడంతో ఆరంభం నుంచే పరుగుల వరద పారింది. అయితే నాలుగో ఓవర్‌లో కాంబోజ్ (1/21)దెబ్బకు జైస్వాల్ ఔట్ అవడంతో తొలి వికెట్‌కు 37 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. వన్‌డౌన్‌లో శాంసన్ కూడా సమయోచితంగా ఆడటంతో పవర్‌ప్లేలో రాయల్స్ 56/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ విస్తరించిన తర్వాత సూర్యవంశీ మరింత వేగం పెంచాడు.
శాంసన్ లాంగాన్, లాంగాఫ్‌లో సిక్సర్లు బాదడంతో 10.3 ఓవర్లలో స్కోరు వందకు చేరింది. ఈ క్రమంలో సూర్యవంశీ 27 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక నిలకడగా ఆడుతున్న ఈ జోడీని అశ్విన్ (2/41) 14వ ఓవర్‌లో విడగొట్టాడు. నాలుగు బాల్స్ తేడాలో శాంసన్, సూర్యవంశీని ఔట్ చేసి రెండో వికెట్‌కు 98 రన్స్ భాగస్వామ్యానికి తెరదించాడు.
మధ్యలో రియాన్ పరాగ్ (3) నిరాశపర్చినా, ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడ్డాడు. నాలుగో వికెట్‌కు పరాగ్‌తో 20 రన్స్ జత చేసిన అతను చివర్లో హెట్‌మయర్ (12 నాటౌట్)తో ఐదో వికెట్‌కు 9 బాల్స్‌లోనే 30 రన్స్ జోడించి ఈజీగా విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 187/8 (ఆయుష్ 43, బ్రేవిస్ 42, దూబే 39, యుధ్వీర్ 3/47, మధ్వాల్ 3/29).
రాజస్తాన్: 17.1 ఓవర్లలో 188/4 (వైభవ్ 57, శాంసన్ 41, జురెల్ 31*, అశ్విన్ 2/41).