క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ సెన్సేషన్

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ సెన్సేషన్

బహుశా ఈ క్రికెటర్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ క్రికెటర్ పేరు చెప్పినా.. ఇతను ఏపిల్‌లో ఆడారా! అని వారిలో వారు ప్రశ్నించుకుంటారు. అలాంటి ఐపీఎల్ సెన్సేషన్ ఇతగాడు. పేరు.. పాల్ వాల్తాటి. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ఆడారు.

ఇతను పేరు ప్రపంచానికి తెలిసిందంటే.. అది 2011 ఐపీఎల్. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై మురళి విజయ్(74), బద్రినాథ్ (66),కెప్టెన్ ధోని (43) బ్యాట్ ఝళిపించడంతో.. నిర్ణీత ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్.. ఆదిలోనే షాక్ తగిలింది. గిల్ క్రిస్ట్, షాన్ మార్ష్ త్వరగానే పెవిలియన్ కి చేరారు. అసలే బలహీనంగా ఉన్న పంజాబ్ జట్టుకి ఇక ఓటమి తప్పదనుకున్నారంతా.  పంజాబ్ డగౌట్‌లో కూడా విజయం మీద ఎవరికి ఆశలు లేవు. 

ఆ దశలో వాల్తాటి చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఏ ఒక్క బౌలర్‌ని వదలకుండా బౌండరీల వరద పారించాడు. 63 బంతుల్లోనే 120 పరుగులు చేసి జట్టుకి ఊహించని విజయాన్ని అందించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తోనే అతను మ్యాచ్ విన్నర్‌గా మారిపోయారు. చెన్నై కెప్టెన్ ధోని చేత ప్రశంసలు అందుకున్నారు. అలాంటి గొప్ప క్రికెటర్.. నేడు క్రికెట్‍కి వీడ్కోలు పలికారు. కంటికి గాయం కావడంతో ప్రొఫెషనల్ క్రికెట్‌కి దూరంగా ఉంటూ వస్తున్న  వాల్తేటి.. ముంబై క్రికెట్ అసోసియేషన్‌కి ఈ విషయాన్ని తెలియచేస్తూ లేఖ రాశారు.

"నా కెరీర్‌లో ఎన్నో జట్లకు ఆడాను. ఛాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా టీంకి, ఇండియా అండర్-19 జట్టుకి, ముంబై సీనియర్స్ జట్టుకు ఆడే అవకాశం దక్కినందుకు చాలా గర్వపడుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి, ముంబై క్రికెట్ అసోసియేషన్‌కి ధన్యవాదాలు. అలాగే, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌ తరుపున ఆడడాన్ని ఎన్నటికీ మరిచిపోలేను. ముంబై నుంచి వచ్చి ఐపీఎల్‌లో సెంచరీ చేసిన మొదటి ప్లేయర్‌ని, నాలుగో భారత క్రికెటర్‌ని నేనే. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.." అని వా ల్తాటి లేఖలో ప్రస్తావించారు.