రాజస్తాన్​పై ఢిల్లీ కీలక విజయం

రాజస్తాన్​పై ఢిల్లీ కీలక విజయం
  • మిచెల్‌‌ మార్ష్‌‌ ఆల్‌‌రౌండ్‌‌ షో
     

నవీ ముంబై: మిచెల్ మార్ష్  (62 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 89; 2/25) మాస్‌‌ ఆటతో ఆల్‌‌రౌండ్‌‌ షో చూపెట్టిన వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కీలక విజయం సొంతం చేసుకుంది. ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారిన తరుణంలో బుధవారం జరిగిన మ్యాచ్‌‌లో ఎనిమిది వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌‌ను చిత్తు చేసింది. లీగ్‌‌లో ఆరో విజయంతో ప్లే ఆఫ్స్‌‌ రేసులో ఓ అడుగు ముందుకేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 160/6 స్కోర్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (38 బాల్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50), దేవదత్ పడిక్కల్ (30 బాల్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో మార్ష్, సకారియా (2/23),  అన్రిచ్‌‌ (2/39) రెండు వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ 18.5 ఓవర్లలో 161/2 రన్స్ చేసి గెలిచింది. మార్ష్ తో పాటు వార్నర్ (41 బాల్స్ లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 52 నాటౌట్) ఫిఫ్టీ కొట్టాడు.  రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్ (1/32), చహల్ (1/43) రాణించారు.  మార్ష్‌‌కే ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 
ఆదుకున్న అశ్విన్, పడిక్కల్
మొదట బ్యాటింగ్ లో స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ అశ్విన్, పడిక్కల్ రాజస్తాన్ ను ఆదుకున్నారు. ఇన్ ఫామ్ బ్యాటర్ బట్లర్ (7) వికెట్ ను మూడో ఓవర్లోనే చేజార్చుకున్న రాజస్తాన్ మూడో నెంబర్ లో అశ్విన్ ను బ్యాటింగ్‌‌కు దించి మరోసారి ప్రయోగం చేసింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19)తో కలిసిన అశ్విన్ ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడటంతో రాయల్స్ పవర్ ప్లేలో 43/1తో నిలిచింది. కాసేపటికే జైస్వాల్ ను మార్ష్ ఔట్ చేయడంతో పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కాసేపు ఇన్నింగ్స్ చప్పగా సాగింది. అయితే 12వ ఓవర్లో అశ్విన్ ఒక సిక్స్ తో పాటు తర్వాతి ఓవర్లో పడిక్కల్ రెండు బాల్స్‌‌ను స్టాండ్స్‌‌కు పంపి స్కోర్ లో వేగం పెంచారు.

కొద్దిసేపటికే ఫోర్ తో పాటు సింగిల్ తో అశ్విన్ టీ20ల్లో తన మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ తర్వాతి బంతిని గాల్లోకి లేపి క్యాచ్ ఔట్ గా వెనుదిరగడంతో మూడో వికెట్ కు 53 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో పడిక్కల్ మూడు ఫోర్లతో ఊపందుకున్నాడు. కానీ, వరుస ఓవర్లలో  కెప్టెన్ శాంసన్ (6)తో పాటు పడిక్కల్‌‌ను అన్రిచ్‌‌ ఔట్ చేసి రాయల్స్​ స్పీడుకు బ్రేకులేశాడు. హిట్టర్‌‌ రియాన్ పరాగ్ (9) కూడా ఫెయిలవగా... చివర్లో -డుసెన్ (12 నాటౌట్), బౌల్ట్ (3 నాటౌట్)ను కట్టడి చేసిన ఢిల్లీ బౌలర్లు రాజస్తాన్‌‌ను ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేశారు. 
144 రన్స్​ పార్ట్​నర్​షిప్​.. 
ఓవైపు మార్ష్‌‌.. మరోవైపు వార్నర్‌‌ దంచికొట్టడంతో ఢిల్లీ సులువుగా గెలిచింది.  రాయల్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరికీ అదృష్టం కూడా తోడైంది. అయితే, ఛేజింగ్ లో ఢిల్లీకి సరైన ఆరంభం లభించలేదు. తొలి ఓవర్లో భరత్ (0)ను ఔట్‌‌ చేసిన బౌల్ట్‌‌ ఒకే పరుగివ్వగా.. రెండో ఓవర్‌‌ను ప్రసిధ్‌‌ మెయిడిన్‌‌ చేశాడు. బౌల్ట్‌‌ వేసిన మూడో ఓవర్లో రివ్యూకు వెళ్లకపోవడంతో ఎల్బీ ఔట్ నుంచి తప్పించుకున్న మార్ష్ .. వార్నర్ తో కలిసి మొదట జాగ్రత్తగా ఆడడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 38/1 చేసింది. తర్వాతి ఓవర్లోనే రెండు భారీ సిక్సర్లతో మార్ష్ దూకుడు పెంచాడు.

మరోఎండ్​లో వార్నర్ అతడికి సపోర్ట్ ఇచ్చాడు. బట్లర్‌‌ క్యాచ్‌‌ డ్రాప్‌‌ చేయడంతో పాటు.. చహల్‌‌ బాల్‌‌ వికెట్లకు తాకినా బెయిల్స్‌‌ పడకపోవడంతో వార్నర్‌‌కు రెండు లైఫ్‌‌లు దక్కాయి. ఇక, చహల్ ఓవర్లోనే  సిక్స్ తో మార్ష్  ఐపీఎల్​లో మొదటి ఫిఫ్టీ సాధించాడు. ఇక 16,17 ఓవర్లలో 30 రన్స్ పిండుకున్న ఈ ఇద్దరూ  ఢిల్లీ విజయం ఖాయం చేశారు. చివరకు మార్ష్‌‌ను ఔట్‌‌ చేసిన చహల్ రెండో వికెట్​కు 144 రన్స్ పార్ట్ నర్ షిప్ ను బ్రేక్ చేసినా.. వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు మ్యాచ్​ను ముగించాడు.