ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 44 వేల కోట్లు..!

ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 44 వేల కోట్లు..!

ఐపీఎల్ బీసీసీఐకు కనకవర్షాన్ని కురిపించింది.  2023 నుంచి 2027 మధ్య కాలానికి ఐపీఎల్ ప్రసార హక్కులు కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయాయి.  ఐదేళ్ల పాటు టీవీ, డిజిటల్ హక్కులు రూ.44 వేల 75  కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. ముంబై వేదికగా జరిగిన వేలంలో టీవీ హక్కులు రూ.23,575 కోట్లకు డిస్నీ స్టార్ (స్టార్ స్పోర్ట్స్) దక్కించుకుంది. .డిజిటల్ రైట్స్ను జియో (వయాకామ్ 18 ) రూ.20,500 కోట్లకు సొంతం చేసుకుంది.  టీవీ ప్రసార హక్కుల కోసం డిస్నీ స్టార్ (స్టార్ స్పోర్ట్స్)  ఒక్కో మ్యాచ్ ను 57.5 కోట్లకు కొనుక్కోగా.. డిజిటల్ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్కు జియో (వయాకామ్ 18 ) 50 కోట్లు వెచ్చించడం విశేషం. ఈ లెక్కన  ఒక్కో మ్యాచ్‌ ప్రసార హక్కులు రూ.107.5 కోట్లకు అమ్ముడుపోయాయి. 2023 నుంచి 2027 వరకు ఐదు సీజన్లలో 410 మ్యాచ్‌లు జరగనున్నాయి. 

నాలుగు కేటగిరీలుగా ప్రసార హక్కులు..
ఐపీఎల్ మీడియా రైట్స్‌ను బీసీసీఐ నాలుగు కేటగిరీలుగా విభిచించింది.  ప్యాకేజీ A టివి ప్రసార హక్కులు, ప్యాకేజీ B డిజిటల్ ప్రసార హక్కులు. ప్యాకేజీ C  ప్రతీ సీజన్లో 18 ఎంపిక చేసిన మ్యాచ్లను ప్రసార్ చేయడం, ప్యాకేజీ D భారత్లో కాకుండా వరల్డ్ వైడ్గా ప్రసార హక్కులు పొందడం. ఇందులో  టీవీ ప్రసార హక్కుల కోసం బీసీసీఐ ఒక్కో మ్యాచ్‌కి రూ.49 కోట్లు బేస్ ప్రైజ్ నిర్ణయించింది.  డిజిటల్ హక్కుల కోసం  రూ.33 కోట్లు బేస్ ప్రైజ్‌గా ప్రకటించింది. అయితే రెండు రోజుల పాటు జరిగిన వేలంలో   ప్రసార హక్కులను దక్కించుకునేందుకు వయాకామ్ 18 ,డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమేజాన్‌, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు పోటీపడ్డాయి. చివరకు డిస్నీ స్టార్ (స్టార్ స్పోర్ట్స్) , వయాకామ్ 18  రూ. 44,075 కోట్లకు  ప్రసార హక్కులను దక్కించుకున్నాయి. అయితే C,D కేటగిరీల్లో  ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా వచ్చే మొత్తం అదనం.

ప్రపంచంలో రెండవది..
ప్రసార హక్కులు రూ. 44 వేల 75 కోట్లకు అమ్ముడు పోవడంతో..ఐపీఎల్ వరల్డ్ లోనే రెండో ఖరీదైన లీగ్గా నిలిచింది.  ఇప్పటికే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ను  దాటేసింది. అయితే మొదటి స్థానంలో అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ ఉంది. 

గతంలో రేట్లు..
2017 నుంచి 2022 మధ్య ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్సే రూ.16,347.50 కోట్లకు దక్కించుకుంది. అప్పుడు ఒక్కో మ్యాచ్ కోసం రూ.55 కోట్లు చెల్లించింది.  ఇక 2008లో సోనీ పిక్చర్స్ ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.  పదేళ్ల కాలానికి గానూ రూ.8200 కోట్లకు కొనుక్కుంది.  2015లో ఐపీఎల్ గ్లోబల్ డిజిటల్ రైట్స్‌ను మూడేళ్ల కాలానికి గానూ రూ.302.2 కోట్లకు నోవి డిజిటల్ సొంతం చేసుకుంది.