జూన్‌‌ 27 నుంచి సైయంట్​ డీఎల్​ఎం ఐపీఓ

జూన్‌‌ 27 నుంచి సైయంట్​ డీఎల్​ఎం ఐపీఓ
  • ప్రైస్​ బ్యాండ్​ రూ. 250–265

ముంబై: హైఎండ్​ ఎలక్ట్రానిక్స్​ తయారీ రంగంలోని సైయంట్​ డీఎల్​ఎం ఐపీఓ ఈ నెల 27 న మొదలవనుంది. ఒక్కో షేరుకు రూ. 250 – రూ. 265 ప్రైస్​ బ్యాండ్​గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ. 700 కోట్లను కంపెనీ సమీకరించాలనుకుంటోంది. ఐపీఓ తర్వాత కంపెనీలో ప్రమోటర్ల వాటా 70 శాతానికి తగ్గనుంది. హనీవెల్​, థేల్స్​, ఏబీబీ, బీఈఎల్​, మోల్బియో వంటి పెద్ద కంపెనీలు సైయంట్ డీఎల్​ఎం కస్టమర్లు. మార్చి 2023 నాటికి తమ ఆర్డర్​ బుక్​ సైజు రూ. 2,450 కోట్లకు చేరినట్లు చైర్మన్​ గణేష్​ వెంకట కృష్ణ బోదనపు చెప్పారు.

రాబోయే రెండేళ్లలో ఈ ఆర్డర్లను నెరవేర్చ వలసి ఉంటుందని పేర్కొన్నారు. ఏడాది కాలానికి చూస్తే ఆర్డర్​ బుక్​ డబులైందని అన్నారు. ప్రింటెడ్​ సర్క్యూట్​ బోర్డులు, ప్రోగ్రామబుల్​ లాజిక్​ కంట్రోలర్స్​, సెంట్రల్​ ప్రాసెసింగ్​ యూనిట్లు, ట్రాన్స్​మిటర్లు, రిసీవర్లు వంటి ఎలక్ట్రానిక్స్​ ప్రొడక్టులను సైయంట్​ డీఎల్​ఎం తయారు చేస్తోంది. రెవెన్యూలో 40 శాతం డొమెస్టిక్​ సేల్స్​ నుంచి వస్తోందని, మైసూర్​ యూనిట్​ ప్రధానంగా దేశీయ కస్టమర్ల కోసం పనిచేస్తోందని మేనేజింగ్​ డైరెక్టర్ రాజేంద్ర వెలగపూడి వెల్లడించారు. హైదరాబాద్​లోని యూనిట్ల నుంచి ఎగుమతులు సాగిస్తున్నామని చెప్పారు. ఐపీఓ ద్వారా వచ్చే డబ్బుతో రూ. 450 కోట్ల అప్పులను తీర్చి వేస్తామని, మిగిలిన దానిని వర్కింగ్​ క్యాపిటల్​ అవసరాల కోసం వాడుకుంటామని తెలిపారు. మార్చి 2023 తో ముగిసిన ఫైనాన్షియల్​ ఇయర్లో కంపెనీ రూ. 832 కోట్ల రెవెన్యూ పై, రూ. 129 కోట్ల నికరలాభం సంపాదించింది.