రష్యా‑ఉక్రెయిన్ యుద్ధంతో ఐపీఓలు ఆగినయ్‌!

రష్యా‑ఉక్రెయిన్ యుద్ధంతో ఐపీఓలు ఆగినయ్‌!
  • సెబీ అనుమతులున్నా,  ముందుకు రాని 51 కంపెనీలు
  •  మార్కెట్ నెగెటివ్‌‌లో ఉండడమే కారణం

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: కిందటేడాది దూసుకుపోయిన ఐపీఓ మార్కెట్‌‌, రష్యా–ఉక్రెయిన్ సంక్షోభంతో ఈ ఏడాది చతికిలపడింది. సెబీ నుంచి అనుమతులొచ్చినప్పటికీ కంపెనీలు పబ్లిక్‌‌ ఇష్యూకి రావడానికి ఇష్టపడడం లేదు.  సుమారు రూ. 77 వేల కోట్ల విలువైన ఐపీఓలు ప్రస్తుతం ఇన్వెస్టర్ల ముందుకు రావడానికి జంకుతున్నాయి. ఇందులో ఎల్‌‌ఐసీ ఐపీఓ కలిసి లేదు. ఉక్రెయిన్‌‌పై రష్యా దాడి చేసిన తర్వాత నుంచి గ్లోబల్ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌‌లు కూడా నష్టపోతున్నాయి. రష్యా తన దాడులను ఇప్పటిలో ఆపేటట్టు కూడా కనిపించడం లేదు. దీంతో గ్లోబల్‌‌గా క్రూడాయిల్, ఇతర కమోడిటీల రేట్లు చుక్కలనంటుతున్నాయి. దేశంలోనూ, గ్లోబల్‌‌గా ఇన్‌‌ఫ్లేషన్‌‌ పెరుగుతోంది. ఈ పరిస్థితులన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌ను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి టైమ్‌‌లో ఐపీఓకి రాకూడదని కంపెనీలు భావిస్తున్నాయి. 

ఎల్‌‌ఐసీ ఐపీఓ వస్తుండడంతో వెనక్కి..
మార్కెట్ కండీషన్స్‌‌తో పాటు ఎల్‌‌ఐసీ ఐపీఓ ఉండడంతో కూడా మిగిలిన కంపెనీలు తమ పబ్లిక్‌ ఇష్యూలను వాయిదా వేసుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ నెగెటివ్‌‌లో ఉండడంతో ఎల్‌‌ఐసీ ఐపీఓని వాయిదా వేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఎల్‌‌ఐసీ ఐపీఓ వస్తే మార్కెట్‌‌లో లిక్విడిటీ తగ్గుతుందని మిగిలిన కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ పూర్తయ్యాక ఇన్వెస్టర్ల ముందుకు రావడం బెటర్ అనుకుంటున్నాయి. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఎల్‌‌ఐసీ ఐపీఓ వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో  ఐపీఓకి వస్తే హై వాల్యుయేషన్ ఉన్న పబ్లిక్‌‌ ఇష్యూలు నష్టపోతాయి.  జియో పొలిటికల్ టెన్షన్లతో పాటు, ఇన్‌‌ఫ్లేషన్‌‌, వడ్డీ రేట్లు పెరుగుతుండడం వంటి అంశాలు కూడా ఈక్విటీ మార్కెట్‌‌లను కలవరపెడుతున్నాయి’ అని క్యాపిటల్‌‌వయా గ్లోబల్‌‌ రీసెర్చ్‌‌ ఎనలిస్ట్‌‌ హర్ష్‌‌ పాటిదార్ పేర్కొన్నారు. మార్కెట్‌‌లో పాజిటివ్‌‌ సెంటిమెంట్‌‌ ఉంటే  హై వాల్యుయేషన్ దగ్గరైనా కంపెనీలు ఫండ్స్‌‌ను రైజ్ చేయగలుగుతాయని అన్నారు. గ్లోబల్‌‌ అంశాల వలన ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ నెగెటివ్‌‌గా ఉందని చెప్పారు. 

ఈ ఏడాది మూడే వచ్చాయ్‌‌..
సెబీ నుంచి అనుమతులొచ్చినప్పటికీ మొత్తం 51 కంపెనీలు తమ ఐపీఓలను హోల్డ్‌‌లో పెట్టాయని క్యాపిటల్ మార్కెట్స్‌‌ రీసెర్చ్ కంపెనీ ప్రైమ్‌‌ డేటాబేస్ పేర్కొంది. వీటికి అదనంగా  సెబీ నుంచి ఇంకా అనుమతులు పొందని కంపెనీలు 44 ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు ఐపీఓలు మాత్రమే సక్సెస్‌‌ఫుల్‌‌గా పూర్తయ్యాయి. అదానీ విల్‌‌మర్‌‌‌‌, వేదాంత్‌‌ ఫ్యాషన్స్‌‌, ఏజీఎస్‌‌ ట్రాన్సాక్ట్‌‌ ఐపీఓలు రూ. 7,429 కోట్లను సేకరించాయి.సెకండరీ మార్కెట్ (షేరు మార్కెట్‌‌) పాజిటివ్‌‌గా ఉంటేనే  ఐపీఓ మార్కెట్‌‌ సక్సెస్ అవుతుందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.  దీంతో కంపెనీలు కూడా మార్కెట్ మూడ్ మారేంత వరకు వెయిట్‌‌ చేయాలని చూస్తున్నాయని చెబుతున్నారు.  ఫార్మ్‌‌ఈజీ, డెల్హివరీ, వారీ ఎనర్జీస్‌‌, ఎంక్యూర్‌‌‌‌ ఫార్మాస్యూటికల్స్‌‌, స్టెరిలైట్‌‌ పవర్‌‌‌‌ ట్రాన్స్‌‌మిషన్‌‌, పెన్నా సిమెంట్‌‌, వన్‌‌ మొబిక్విక్‌‌ సిస్టమ్స్‌‌, ప్రదీప్‌‌ ఫాస్పెట్స్‌‌, గో ఎయిర్‌‌‌‌లైన్‌ వంటి కంపెనీలకు  సెబీ అనుమతులున్నా, ఇన్వెస్టర్ల ముందుకు రావడానికి ఆలోచిస్తున్నాయి. 

ఎల్‌‌‌‌ఐసీ ఐపీఓకి సెబీ అనుమతి..
ఎల్‌‌ఐసీ ఐపీఓకి మార్కెట్ రెగ్యులేటరీ సెబీ అనుమతులు వచ్చాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. కంపెనీలో 5 శాతం వాటాను ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రభుత్వం సేల్ చేయనుంది. ఐపీఓ పేపర్లు ఫైల్ చేసిన  21 రోజుల్లోనే  ఎల్‌‌ఐసీకి సెబీ అనుమతులు రావడం విశేషం.  ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.63 వేల కోట్లను ప్రభుత్వం సేకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రభుత్వం షేర్లను అమ్మనుంది. ఎల్​ఐసీ షేరు ఫేస్ వాల్యూ రూ. 10.