
- 13 వారాల గర్భాన్ని తొలగించిన ‘డాక్టర్లు’
- విచారణ ప్రారంభించని డాక్టర్ల టీమ్
యాదాద్రి, వెలుగు: అర్హతలు లేకున్నా స్థాయికి మించి వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లను అరికట్టేందుకు .. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న అక్రమాలను నిలువరించేందుకు అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా యాదాద్రి జిల్లాల్లో వారి ఆగడాలు ఆగడంలేదు. జిల్లాలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
ఇటీవల యాదాద్రిలోని ఒక ఆస్పత్రిలో మహిళకు అక్రమంగా అబార్షన్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ముగ్గురు డాక్టర్లతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఇంకా టీమ్ విచారణ ప్రారంభించలేదు.
యాదాద్రి జిల్లాలో ఇటీవల వరుసగా అబార్షన్ల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. జూలై లో మూడు అబార్షన్ల కేసులు బయటకు వచ్చాయి. ఈ కేసుల్లో బాలింత, ఓ శిశువు చనిపోయిన విషయం తెల్సిందే. ఏ అర్హతలు లేకపోయినా ఇద్దరికి అబార్షన్లు చేసిన వ్యక్తిమీద కేసు నమోదు చేశారు. అబార్షన్ చేయించుకున్న మరో మహిళ .. తనకు అబార్షన్ చేసిన నకిలీ డాక్టర్‌తో రాజీ పడడంతో కేసు పక్కదారి పట్టింది.
వరుస అబార్షన్ల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌పై అధికారులు దాడులు చేస్తున్నారు. అస్పత్రుల పర్మిషన్లు, వాటి పనితీరు, క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారా..? లేరా..? తదితర అంశాలను తనిఖీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 288 హాస్పిటల్స్, 57 డయాగ్నిస్టిక్ సెంటర్లను వైద్యారోగ్య శాఖ ఆరు బృందాలను ఏర్పాటు చేసింది.
ఆడపిల్ల అని తేలడంతో..
ప్రైవేట్ హాస్పిటల్స్ తనిఖీలు ఇంకా కొనసాగుతుండగానే ఈ నెల 18న మరో అబార్షన్ జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. తుర్కపల్లి మండలానికి చెందిన వివాహిత భువనగిరిలోని ఓ డయాగ్నిస్టిక్ సెంటర్లో స్కానింగ్ చేయించుకోగా ఆడపిల్ల అని తెల్సింది. దాంతో ఆమెకు ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లిందని, 13 వారాల గర్బాన్ని తొలగించుకుందని తెలిసింది. భువనగిరి పోలీసులు సదరు హాస్పిటల్‌కు వెళ్లి వివరాలు సేకరించారు.
ఆ సమాచారాన్ని రెండ్రోజుల తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు అందించారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ముగ్గురు డాక్టర్లతో టీమ్‌ను ఏర్పాటు చేశారు. సదరు డాక్టర్లు డ్యూటీలో బిజీగా ఉండడంతో ఇంకా విచారణ ప్రారంభించలేదని, వినాయక చవితి తర్వాత విచారణ బృందం హాస్పిటల్‌ను తనిఖీ చేయనుందని అధికారులు చెప్తున్నారు. అబార్షన్ చేయించుకున్న మహిళను కూడా విచారిస్తారు. ఆస్పత్రికి అనుమతులు ఉన్నాయా, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) అనుమతులు ఉన్నాయా అని పరిశీలిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసినట్టు తేలితే సదరు హాస్పిటల్‌పై చర్యలు తీసుకుంటారు.