ఫేక్ ఫొటోలతో అటెండెన్స్! డబ్బులు కొట్టేసేందుకు సిబ్బంది ఎత్తుగడ

ఫేక్ ఫొటోలతో అటెండెన్స్! డబ్బులు కొట్టేసేందుకు సిబ్బంది ఎత్తుగడ
  • ఎన్​ఆర్​ఈజీఎస్​ ఎన్​ఎంఎంఎస్​ పోర్టల్​లో చీటింగ్​
  • పని ప్రదేశాల్లో ఉన్న కూలీల ఫొటోలకు బదులు ఇతరులవి అప్​లోడ్
  • వాటి ఆధారంగానే కూలీల అటెండెన్స్, డబ్బుల చెల్లింపు

ఈ ఫొటోలో ఉన్నది ఇద్దరు మహిళలు. ఇది అప్పటికే సెల్​ ఫోన్​లో స్టోర్​ చేసుకున్న ఫొటో. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం ఎక్వాయిపల్లి గ్రామపంచాయతీలోని నర్సరీలో ముగ్గురు పనిచేసినట్లు సిబ్బంది వర్క్​ ఐడీని తయారు చేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు రికార్డ్​ చేశారు. అయితే ముగ్గురికి బదులు ఎన్​ఆర్​ఈజీఎస్​లోని ఎన్​ఎంఎంఎస్ పోర్టల్​లో కొందరు మహిళలు గ్రూపుగా దిగిన ఫొటోను అప్​లోడ్​ చేసి అటెండెన్స్​ వేశారు.

ఈ ఫొటోలో ఉన్నది ఓ మైనర్​. ఇతడు గవర్నమెంట్​ స్కూల్​కు వెళ్లేందుకు యూనిఫాం వేసుకొని రెడీ అయ్యాడు. ఈ బాలుడు ఎన్​ఆర్​ఈజీఎస్​లో వర్క్​ చేసినట్లు వర్క్​ ఐడీ క్రియేట్​ చేశారు. మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలం దొడ్డిపల్లి గ్రామంలో వర్క్​ నేమ్​ లేకుండా వర్క్​ఐడీ క్రియేట్​ చేసి.. ఆ వర్క్​కు సంబంధించిన అటెండెన్స్​లో ఈ బాలుడి ఫొటో అప్​లోడ్ చేశారు. ఉదయం ఏడు గంటలకు ఫొటో అప్​లోడ్​ చేసినట్లు ఎన్​ఎంఎంఎస్​ పోర్టల్​లో రికార్డ్​ అయింది.

మహబూబ్​నగర్​, వెలుగు: ఎన్​ఆర్​ఈజీఎస్​లోని ఆన్​లైన్​ అటెండెన్స్​లో అవకతవకలు జరుగుతున్నాయి. ఆన్​లైన్​ పోర్టల్​లో కొందరు సిబ్బంది ఫేక్​ ఫొటోలు అప్​లోడ్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పోర్టల్​లో పనులు చేసిన వారి పేరు ఒకటి ఉంటే.. ఫొటో మరొకరిది ఉంటోంది. ఎలాంటి వర్క్​ నేమ్​ లేకుండా ఫేక్​ ఫొటోలు పెట్టి.. సిబ్బంది వర్క్ ఐడీలు క్రియేట్​ చేస్తున్నట్లు తెలిసింది. ఈ అటెండెన్స్​ ఆధారంగానే కూలీ చెల్లింపులు జరుగుతుండటంతో ఆ డబ్బులు ఎవరి బ్యాంక్​ అకౌంట్లకు మళ్లుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫీల్డ్​ విజిట్​ చేయకుండానే..

2022 వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఎన్​ఆర్​ఈజీఎస్​ చెల్లింపులు జరిగేవి. అయితే పారదర్శకంగా చెల్లింపులు జరగడం లేదని అదే ఏడాది ఫిబ్రవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్​ఆర్​ఈజీఎస్​ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. రాష్ర్టాలకు చెందిన రాగా సాఫ్ట్​ వేర్​కు బదులు నేషనల్​ మొబైల్​ మానిటరింగ్​ సిస్టం(ఎన్​ఎంఎంఎస్​)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ బాధ్యతను ఎన్​ఐసీకి అప్పగించింది. దీని ద్వారా ఏ గ్రామంలో ఏం పని జరుగుతోంది, కూలీలు ఎంత మంది పాల్గొన్నారు? అనే వివరాలను ఫొటోలతో అప్​లోడ్​ చేసేలా ఈ  పోర్టల్​ను డెవలప్​ చేశారు. ఫీల్డ్​ అసిస్టెంట్లు, మేట్లకు లాగిన్​ ఐడీలు ఇచ్చారు. వీరు వారి వారి ప్రాంతాల్లో ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెండు సార్లు విజిట్​ చేయాలి.

ఉదయం 11 గంటలకు పనుల వద్దకు వెళ్లి కూలీలు ఏం పనులు చేస్తున్నారో ఫొటో తీసి పోర్టల్​లో అప్​ లోడ్​ చేయాలి. మస్టర్​ రోల్​ నంబరుతో పాటు పని పేరు, వర్క్​ ఐడీలు క్రియేట్​ చేయాలి. మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి విజిట్​ చేసి కూలీలు పనులు చేస్తున్న ఫొటో దింపి ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేసి అటెండెన్స్​ వేయాలి. అయితే ఇక్కడే అక్రమాలకు తెర లేపుతున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించకుండానే ఈ పోర్టల్​లో ఫేక్ ఫొటోలను అప్​లోడ్​ చేస్తున్నట్లు తెలిసింది. ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు ఫొటోలను అప్​లోడ్​ చేయాల్సి ఉండగా.. ఒక పూటకు సంబంధించిన ఫొటోలను మాత్రమే అప్​లోడ్​ చేసి అటెండెన్స్​ వేస్తున్నారు.

వీటిలో కూడా ఎక్కువగా ఫేక్​ ఫొటోలే ఉంటున్నాయి. పర్యవేక్షించాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. టెక్నికల్​ అసిస్టెంట్లు ఎంబీలు తయారు చేసి ఏపీఎంలు, ఎంపీడీవోలకు అందించిన అనంతరం.. అప్రూవ్​ చేశాక కూలీ డబ్బులు రిలీజ్​ చేస్తున్నారు. కానీ డబ్బులు చెల్లించే సమయంలో ఆన్​లైన్​లో కూలికి సంబంధించిన వివరాలను పరిశీలించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ముందే ఒప్పందం చేసుకొని ఫొటోల సేకరణ..

కొందరు సిబ్బంది.. వారి బంధువులు, స్నేహితుల ఫొటోలు తీసుకొని అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ముందే వారితో ఒప్పందం చేసుకొని బ్యాంక్ అకౌంట్లను కూడా తెరిపించినట్లు సమాచారం. ఆన్​లైన్​లో వర్క్​ నేమ్, వర్క్​ ఐడీలు క్రియేట్​ చేసి వీరి పేర్లు, ఫొటోలు అప్​లోడ్​ చేసి అటెండెన్స్​ వేసుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాత వీరి అకౌంట్లలో కూలీ జమ అవుతుండగా.. ఆ డబ్బులు అందరూ పంచుకుంటున్నట్లు తెలిసింది.

గతంలో నారాయణపేట జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ఫీల్డ్​ అసిస్టెంట్​ తనకు తెలిసిన వారితో పాటు స్టూడెంట్లు, వలస కూలీల పేర్ల మీద జాబ్​ కార్డులు సృష్టించాడు. వారి పేరుతో బ్యాంక్​ అకౌంట్ల తెరిచి పనులు చేసినట్లు ఎంబీలు తయారు చేసి కూలీ డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయించాడు. దాదాపు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర అవినీతి జరుగగా.. విచారణ జరిపిన ఆఫీసర్లు 57 రకాల పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఫీల్డ్​ అసిస్టెంట్​తో పాటు ఏపీవోను సస్పెండ్​ చేశారు. 

ఫేక్​ ఫొటోలు పెట్టొద్దని చెబుతున్నాం

ప్రతి బుధవారం ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహిస్తున్నాం. పోర్టల్​లో ఫేక్​ ఫొటోలను అప్​లోడ్​ చేయొద్దని చెబుతున్నాం. పనులను కూడా ఎప్పటికప్పుడు ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ఫేక్​ ఫొటోలు అప్​లోడ్​ చేసినట్లు మా దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకుంటాం. - నర్సింహులు, డీఆర్​డీవో, మహబూబ్​నగర్