సూర్యాపేట జిల్లా డీఆర్డీఏ ఆఫీస్‌లో అక్రమ దందా

సూర్యాపేట జిల్లా డీఆర్డీఏ ఆఫీస్‌లో అక్రమ దందా

సూర్యాపేట : దివ్యాంగుల గుర్తింపు సర్టిఫికెట్ల జారీలో సూర్యాపేట జిల్లాలో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ అనర్హులకు సైతం సదరం సర్టిఫికెట్లు ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. డీఆర్డీఏ ఆఫీసులో పనిచేస్తున్న ఓ ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగి సదరం క్యాంప్‌‌‌‌నకు అటెండ్​అయ్యే డాక్టర్లు కలిసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రూ. 20 వేలు ఇచ్చిన వారికి సర్టిఫికెట్‌‌‌‌తో పాటు పింఛన్‌‌‌‌ కూడా శాంక్షన్‌‌‌‌ అయ్యేలా చేస్తామని దందా నడుపుతున్నారు. 

ప్రభుత్వ పథకాల కోసం అడ్డదారులు

చెవిటి, మూగ, చూపు తదితర సమస్యలతో బాధపడే దివ్యాంగులకు ప్రభుత్వం గుర్తింపు (సదరం) సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. మీ సేవ ద్వారా స్లాట్‌‌‌‌ బుక్‌‌‌‌ చేసుకున్న వారిని డాక్టర్లు టెస్ట్‌‌‌‌ చేసి అర్హత ఉన్న వారికి వారి వైకల్య తీవ్రతను గుర్తించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్లు ఆసరా పింఛన్‌‌‌‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌‌‌‌, ఎం‌‌‌‌ఎస్‌‌‌‌ఎంఈ రుణాల మంజూరులో సబ్సిడీకి ఉపయోగపడుతాయి. దీంతో కొందరు వ్యక్తులు తమకు ఎలాంటి వైకల్యం లేకున్నా ప్రభుత్వ పథకాలను పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న సిబ్బంది వారి నుంచి అందినకాడికి వసూలు చేసి అర్హత లేకున్నా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌దే హవా..

డీఆర్డీఏ ఆఫీస్‌‌‌‌లో పనిచేసే ఓ ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌ కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తున్నట్లు సమాచారం. డీఆర్‌‌‌‌డీవో ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ట్రైనింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తిని సదరం డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఉద్యోగుల కొరత కారణంగా డిప్యుటేషన్‌‌‌‌పై పంపించారు. దీన్ని అనుకూలంగా మలుచుకున్న సదరు ఉద్యోగి అక్రమ దందాకు తెరలేపాడు. సదరం స్లాట్‌‌‌‌ బుకింగ్‌‌‌‌ నుంచి సర్టిఫికెట్‌‌‌‌ అందించే వరకు మొత్తం తానే చూసుకుంటానని చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. అనర్హుల నుంచి రూ. 20 వేలు వసూలు చేస్తూ రేచీకటి, ఆర్థో, వినికిడి సమస్య ఉందని సర్టిఫికెట్‌‌‌‌ జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇలా కేవలం ఒక్క చిలుకూరు మండలంలోనే 60 మందికి పైగా అనర్హులకు సర్టిఫికెట్‌‌‌‌ జారీ చేసి, ఆసరా పింఛన్‌‌‌‌ కోసం అప్లై చేయించాడని పలువురు చెబుతున్నారు. 

మచ్చుకు కొన్ని ఘటనలు..

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ నెల 19న సదరం క్యాంప్‌‌‌‌కు వచ్చారు. వారికి అర్హత లేకున్నా వారి నుంచి రూ. 20 వేలు తీసుకొని సర్టిఫికెట్లు జారీ చేశారు. చిలుకూరు మండలానికి చెందిన ఓ మహిళ వద్ద సదరు ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌ రెండు నెలల కింద రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నాడు. అనుకున్న టైంకు పైసలు తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆమెకు రేచీకటి ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన----- సదరం క్యాంప్‌‌‌‌లో సర్టిఫికెట్‌‌‌‌ జారీ చేశాడు. ఇందుకు బదులుగా ఆమె వద్ద తీసుకున్న అప్పు మాఫీ అయినట్లు రాయించుకున్నట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొల్లలు. దొంగ సర్టిఫికెట్లతో కొందరు సర్కారు పథకాలు పొందుతుంటే తమకు  అన్యాయం జరుగుతోందని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

వెరిఫై చేసి చర్యలు తీసుకుంటాం.. 

అక్రమాలు జరిగిన విషయం మా దృష్టికి రాలేదు. వెరిఫై చేసి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటాం. అనర్హులకు జారీ అయిన సర్టిఫికెట్లను క్యాన్సిల్‌‌‌‌ చేస్తాం. – కిరణ్ కుమార్, డీఆర్డీఏ పీడీ, సూర్యాపేట