వడ్ల దొంగలు బయటికొస్తన్రు!

వడ్ల దొంగలు బయటికొస్తన్రు!

సిద్దిపేట/చేర్యాల, వెలుగు: గత యాసంగి కొనుగోళ్లలో తప్ప, తాలు పేరిట  రైతులను, నకిలీ ట్రక్​షీట్ల పేరిట ప్రభుత్వాన్ని కోట్లలో ముంచిన ఘటనలు రాష్ట్రమంతా వెలుగుచూస్తుండగా, సిద్దిపేట జిల్లాలో జరిగిన అక్రమాలు అన్ని జిల్లాలను మించిపోయాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల సబ్‌‌‌‌‌‌‌‌డివిజన్ పరిధిలో వడ్ల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు తవ్విన కొద్దీ పెరుగుతున్నాయి. మొదట ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు రూ. 3.2 కోట్ల మేర అవినీతి జరిగిందని వెల్లడించారు.  కానీ నెల రోజులుగా సాగుతున్న ఎన్​ఫోర్స్​మెంట్​స్పెషల్​టీమ్స్​ ఎంక్వైరీలో ఈ అక్రమాల విలువ రూ. 10 కోట్లకు పైమాటేఅని తేలుతోంది.  మొదట చేర్యాల పీఏసీఎస్ వరకే పరిమితమనుకున్న ఈ అక్రమాలు కొమురవెల్లి, మద్దూరు మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో సైతం జరగడం కలవరపరుస్తోంది.  నెల క్రితం చేర్యాల పీఏసీఎస్ డైరెక్టర్లు 11 మంది యాసంగి సీజన్ లో వడ్ల కొనుగోళ్లలో రూ. 2 కోట్ల వరకు అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్, సివిల్‌‌‌‌ ‌‌‌‌సప్లయ్ కమిషనర్, కో ఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్ తోపాటు జిల్లా ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే  సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్ ఎన్ ఫోర్స్ మెంట్​ఐదు స్పెషల్​ టీంలను ఏర్పాటు చేసి ఎంక్వైరీ  ప్రారంభించింది. ప్రాథమికంగా రూ. 3.2 కోట్ల మేర అవకతవకలు జరిగాయని నిర్ధారించడంతో జిల్లా సివిల్‌‌‌‌ ‌‌‌‌సప్లయ్ డీఎం ఫిర్యాదు మేరకు చేర్యాల పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో సైతం భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఆ దిశగా  ఆఫీసర్లు దృష్టి సారించారు. దీంతో అవినీతి బాగోతం వెల్లడైంది. నెల రోజులుగా సాగుతున్న విచారణలో నాలుగు రైస్  మిల్లులను సీజ్ చేయడమే కాకుండా   చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట, కొమురవెల్లి మండలాలకు చెందిన ఐకేపీ, పీఏసీఎస్​సిబ్బంది 9 మందిని సస్పెండ్ చేశారు. యాసంగి వడ్ల కొనుగోళ్ల అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు 42 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 15 మందిని  రిమాండ్ కు పంపారు.  అక్రమాలతో సంబంధం ఉన్న మరో 80 మంది బ్యాంక్ ఖాతాలు అధికారులు ఫ్రీజ్​చేశారు. అరెస్టైన వారిలో పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల్లో పని చేస్తున్న నలుగురు మహిళలు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి ఐకేపీకి సంబంధించి మొత్తం 9 మంది ఉద్యోగులు ఉన్నారు. 
బినామీ రైతుల పేరిట కొనుగోళ్లు
చేర్యాల పీఏసీఎస్​పరిధిలోని చేర్యాల, కడవేర్గు, పోసాన్ పల్లి, చుంచనకోట, మర్రిముచ్చాల, వేచరేణి కొనుగోలు  కేంద్రాల్లో 78 తప్పుడు ట్రక్ షీట్లలో బినామీ రైతుల పేరిట కొనుగోలు చేసినట్టుగా రికార్డులు నమోదు చేసి  దాదాపు 4.06 కోట్లు దిగమింగారు. చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని కొన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో 26 ట్రక్ షీట్ల ద్వారా  వడ్లను కొనకుండానే కొన్నట్టుగా చూపి దాదాపు కోటిన్నర రూపాయలు కాజేశారు. ధూల్మిట్ట మండలం భైరాన్ పల్లిలో ఐదు రోజుల క్రితం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రికార్డులను తనిఖీ చేయగా రూ. 31 లక్షల మేర అవకతవకలు జరిగినట్టు తేలింది. ఇదే మండలంలోని ఒక రైతు గత సీజన్ లో సాగు చేయకున్నా అతని ఖాతాలోకి వడ్ల డబ్బులు జమైనట్లు అధికారులు గుర్తించారు. చేర్యాల మండలం చుంచన కోట గ్రామానికి చెందిన పొన్న బీరయ్య అనే రైతు తనకు తెలియకుండా తన బ్యాంకు ఖాతాలో స్థానిక ఐకేపీ సిబ్బంది రూ. 4.4 లక్షలు జమ చేసి తరువాత వాటిని డ్రా చేసుకున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
ఇద్దరు కీలక సూత్రధారులు
అక్రమాలలో ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. చేర్యాల పీఏసీఎస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌తోపాటు మరొక రైస్ మిల్లు యజమాని తరుగు, నాణ్యత పేరిట సేకరించిన వడ్లను అక్రమంగా ట్రక్ షీట్లలో నమోదు చేసి సొమ్ము చేసుకున్నారు. కిందిస్థాయి ఉద్యోగులకు డబ్బులు ముట్టజెప్పి ఖాళీ ట్రక్ షీట్లను సేకరించి వాటిలో వారు అనుకున్న విధంగా వివరాలు నమోదు చేశారు. ధూల్మిట్ట మండలానికి చెందిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మూసివేసిన తరువాత ఉద్యోగి ఒకరు రూ. ఐదు వేలకు ట్రక్ షీట్ ను మిల్లర్ కు అందజేసినట్టు సమాచారం. గత  యాసంగి సీజన్ లో ఇబ్బంది ముబ్బడిగా  కొనుగోలు కేంద్రాలకు వడ్లు రావడం, పర్యవేక్షణ కొరవడడంతోనే ఇంత భారీగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాలకు చెందిన దాదాపు వంద మంది రైతుల ఖాతాల్లో వారికి తెలియకుండానే డబ్బులు జమయ్యాయి. అక్రమాలతో సబంధం లేకుండా ఖాతాలో డబ్బులు జమ కావడం వారికి ఇబ్బందులను తెచ్చిపెట్టింది.  విచారణ సందర్భంగా ఆఫీసర్లు సంబంధిత రైతులను పిలిచి వివరాలు అడగడంతో తాము వడ్లు అమ్మలేదని చెప్పారు. ఆఫీసర్ల విచారణకు హాజరైన పలువురు  రైతులు ఆందోళనకు గురై వీటితో సంబంధమున్న మిల్లర్లను నిలదీస్తే మీకు ఏం కాకుండా మేం చూసుకుంటామంటూ చెబుతున్నారు.


పూర్తి విచారణ జరపాలి
చేర్యాల సబ్‌‌‌‌‌‌‌‌డివిజన్ పరిధిలో గత యాసంగి సీజన్​లో  పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కవడం వల్ల రైతులకు చెందాల్సిన రూ. కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి పోయాయి. అక్రమాలకు సూత్రధారులైన వారి బ్యాంక్ అకౌంట్ల ను ఫ్రీజ్ చేయాలి. తెరవెనుక సహకరించిన వారిని సైతం అరెస్టు చేయాలి. ఈ విషయంపై జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన మరింత తీవ్రం చేస్తాం.
                                                                                                                                                               – బి.చక్రధర్‌‌‌‌‌‌‌‌, చేర్యాల జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌

అక్రమార్కుల ఆస్తులు జప్తు చేయాలి
వడ్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినవారి ఆస్తులను జప్తు చేయాలి. కేవలం పోలీసు కేసులతో  కొందరిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం బ్యాంకు అకౌంట్లలో పడినందున వెంటనే ఈడీ, ఐటీ డిపార్ట్ మెంట్లు జోక్యం చేసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి.  రోజుల తరబడి విచారణ సాగితే అక్రమార్కులు తప్పించుకుంటారు. మరింత వేగంగా విచారణ పూర్తి చేయాలి. 
                                                                                                                                                       – గిరి కొండల్ రెడ్డి, జడ్పీటీసీ, మద్దూరు