యాసంగిలో 34 లక్షల ఎకరాలకు సాగునీరు

యాసంగిలో 34 లక్షల ఎకరాలకు సాగునీరు
  • 11.95 లక్షల ఎకరాల్లో వరి 
  • 22.32 లక్షల్లో ఆరుతడి పంటలు
  • సాగునీటి శాఖ ప్రతిపాదనలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగిలో సాగునీటి ప్రాజెక్టుల కింద 34 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ఆ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం వరి వేయొద్దని చెప్తుండటంతో దాని సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించింది. ప్రాజెక్టుల నిండా నీళ్లున్నా వరి విస్తీర్ణాన్ని కనీసం ఆరున్నర లక్షల ఎకరాలు తగ్గించి ప్రతిపాదనలు తయారు చేసింది. 11.95 లక్షల ఎకరాల్లో వరి, 22.32 లక్షల ఎకరాల్లో ఆరు తడి పంటల చొప్పున 34.27 లక్షల ఎకరాలకు 296 టీఎంసీల నీళ్లు కావాలని లెక్కగట్టింది. ప్రభుత్వ అనుమతితో ప్రాజెక్టుల కింద వారబంది (ఆన్‌‌‌‌అండ్‌‌‌‌ఆఫ్‌‌‌‌) పద్ధతిలో నీళ్లిస్తామని ఇంజనీర్లంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 43 వేల ఎకరాల్లో ఆరు తడి పంటలకు నీళ్లివ్వనున్నారు. కొండపోచమ్మ సాగర్‌‌‌‌ కింద 4,638 ఎకరాలకు నీళ్లిస్తారు. మేజర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టుల కింద 49.33 లక్షల ఎకరాల విస్తీర్ణముంది. యాసంగిలో 31.86 లక్షల ఎకరాలకు నీళ్లివ్వనున్నారు. ఇందులో వరి విస్తీర్ణం 10.60 లక్షల ఎకరాలు. 21.25 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేయాలని నిర్ణయించారు. మీడియం ప్రాజెక్టుల కింద 3.67 లక్షల ఎకరాల విస్తీర్ణముంది. అందులో 2.41 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి 27.06 టీఎంసీలు నీళ్లు అవసరమని లెక్కగట్టారు.
ఎక్కువ ఆయకట్టు శ్రీరాంసాగర్‌‌‌‌ కిందే

శ్రీరాంసాగర్‌‌‌‌ ప్రాజెక్టు కిందే ఎక్కువ ఆయకట్టు ప్రతిపాదించారు. ఎస్సారెస్పీ స్టేజ్‌‌‌‌ 1 కింద చెరువులను కలుపుకొని 8.35 లక్షల ఎకరాలకు నీళ్లివ్వనున్నారు. ఇందులో 3.84 లక్షల ఎకరాల్లో 63.01 టీఎంసీల నీళ్లతో వరి సాగు చేస్తారు. స్టేజ్‌‌‌‌ 2 కింద 3.44 లక్షల ఎకరాలకు 31.82 టీఎంసీల నీళ్లివ్వనున్నారు. వీటిలో 54 వేల ఎకరాల్లో వరికి నీళ్లిస్తారు. నాగార్జున సాగర్‌‌‌‌ ఎడమ కాల్వ కింద 6.42 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రతిపాదించగా అందులో వరి 1.55 లక్షల ఎకరాలే.
యాసంగి అవసరాలపై చర్చిద్దాం

తెలుగు రాష్ట్రాల్లో యాసంగి సాగు, తాగునీటి అవసరాలపై చర్చించేందుకు మరోసారి త్రీమెన్​ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. గురువారం జల సౌధలోని కేఆర్​ఎంబీ మెంబర్​ సెక్రటరీ డీఎం రాయ్​పురే ఆధ్వరయంలో నిర్వహించిన త్రీమెన్​ కమిటీ సమావేశంలో తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు పాల్గొన్నారు. ఖరీఫ్​ పంట సీజన్​కు సంబంధించి ఈ నెల 15 వరకు నీళ్లివ్వాలంటూ కేవలం ఏపీ నుంచే ఇండెంట్​ పంపారని, తెలంగాణ కూడా ఇండెంట్​ పంపాలని సూచించారు.

దీనిపై స్పందించిన తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​.. అన్ని ప్రాజెక్టులూ నిండుగా ఉన్నాయని, కాబట్టి ఇప్పుడు కేవలం 15 రోజులున్న వానాకాలం పంట కోసం ఇండెంట్​పై చర్చ అనవసరమన్నారు. ఈ సీజన్​లో రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటిపై చర్చించాలని కోరారు. తెలంగాణకు యాసంగిలో సాగు కోసం 151 టీఎంసీలు, తాగునీటికి 19 టీఎంసీలు అవసరమని తెలిపారు. త్రీమెన్​ కమిటీ సమావేశాన్ని మరోసారి నిర్వహిస్తే వాటిపై చర్చించొచ్చని చెప్పారు. మురళీధర్​ ప్రతిపాదనకు ఏపీ ఈఎన్సీ కూడా ఆమోదం తెలిపారు. దీంతో ఈ నెలాఖరులో సమావేశం నిర్వహిస్తామని రాయ్​పురే చెప్పారు.