ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్​ అవుట్ :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్​ అవుట్ :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడే ఉండదని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, మాజీ మంత్రి జానారెడ్డి హాజరయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. 

నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలన్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు కలిసి రావడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ విచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ పరిపాలన చేస్తోందన్నారు. కరువు కాంగ్రెస్ తెచ్చిందని విషప్రచారం చేస్తున్నారని, 2023లోనే  క్రాప్ హాలిడే ఇచ్చి కేసీఆరే కరువు తెచ్చారని ఆరోపించారు. కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​కు భారీ మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, టీపీసీసీ డెలిగేట్ సీహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు, జడ్పీటీసీ కృష్ణకుమారి పాల్గొన్నారు.