నల్లవాగు కింద  క్రాప్ హాలిడే? .. రైతులు, లీడర్ల అభ్యంతరం

నల్లవాగు కింద  క్రాప్ హాలిడే? .. రైతులు, లీడర్ల అభ్యంతరం
  • రిపేర్లకు రూ.24.54 కోట్లు
  • గతంలోనూ క్రాప్ హాలిడేలు  
  • ప్రశ్నార్థకంగా  5,350 ఎకరాల ఆయకట్టు

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు:  సంగారెడ్డి జిల్లా  సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్ వద్ద  1965లో  నల్లవాగు ప్రాజెక్టును  నిర్మించారు. అయితే  కాల్వలకు రిపేర్లు చేయడానికి ఇరిగేషన్ ఆఫీసర్లు క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. దీంతో ప్రాజెక్టు కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. క్రాప్​ హాలిడేకు ఆయకట్టు రైతులు, ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి కూడా ఆబ్జెక్షన్ చెప్పారు.   గతంలో రెండుసార్లు  క్రాప్ హాలిడే ఇచ్చినా పనులు చేయలేదని రైతులు మండిపడుతున్నారు. రైతుల అభ్యంతరాల నేపథ్యంలో మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. 

5,350 ఎకరాల ఆయకట్టు

నల్లవాగు ప్రాజెక్టు కింద దాదాపు 5,350 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 1,493 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1,488 అడుగుల  నీటి నిల్వ ఉంది. సిర్గాపూర్, కల్హేర్ మండలాల పరిధిలో 13 గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాలకు కుడి, ఎడమ  కాలువల ద్వారా సాగునీరు అందుతోంది. కాలువలు పూర్తిగా  శిథిలావస్థకు చేరాయి. ప్రాజెక్టు గేట్లు, కాల్వల రిపేర్ల కోసం ఆరున్నరేళ్ల క్రితం రూ.24.54  కోట్లు సాంక్షన్ అయ్యాయి.  ఏడాది తర్వాత పనులు మొదలు పెట్టి 40 శాతం పూర్తిచేసి, మిగతా 60 శాతం పనులు  వదిలేశారు. పనుల డిలే కారణంగా మొదట్లో 18 నెలల పాటు రైతులు సాగుకు దూరంగా ఉన్నారు. అయినా వర్క్స్ కంప్లీట్ చేయలేదు. 

 2018, 2019  యాసంగి సీజన్లలో  అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు.  ఒక సీజన్​ లో పంట పోయినా శాశ్వత ప్రయోజనం కలుగుతుందని రైతులు క్రాప్ హాలిడేకు అంగీకరించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రిపేర్ పనులు పూర్తి కాకపోగా రెండుసార్లు పంటలు వేయక రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఈసారి అలా జరగకూడదని భావించిన రైతులు క్రాప్ హాలిడేకు ఒప్పుకోవడం లేదు.  రెండు పర్యాయాలు క్రాప్ హాలిడే ప్రకటించినప్పటికీ  రిపేర్ పనులు పూర్తి కాలేదు. దాంతో అగ్రిమెంట్ పొడిగించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిర్మాణ సంస్థ విజ్ఞప్తి చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ విషయమై గతంలో చాలాసార్లు జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో  చర్చ జరిగినప్పటికీ రిజల్ట్ కనిపించలేదు.

2 వేల ఎకరాలకు నీళ్లియ్యొచ్చు

ప్రస్తుత పరిస్థితుల్లో యాసంగి సీజన్ గట్టెక్కాలంటే ప్రాజెక్టు కింద ఉన్న 2 వేల ఎకరాల ఆయకట్టు కు నీళ్లు ఇవ్వొచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అవకాశం ఉన్నా క్రాప్ హాలిడే ప్రకటించాలనే అధికారుల ఆలోచనతో  రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నాలుగున్నరేళ్లుగా పనులు పూర్తిచేయకపోగా ఇప్పుడు మళ్లీ సీజన్ టైంలో క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటే ఎట్లా అని రైతులు మండిపడుతున్నారు. ఇదే జరిగితే భూములు బీడువారిపోతాయని  రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  2 వేల ఎకరాల్లో పంటలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చి మిగతా ఆయకట్టు  పరిధిలో కాలువలకు రిపేర్లు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

పంటలకు సెలవిస్తే ఎట్లా? 

సిర్గాపూర్ మండలం జమ్లా తండాలో నాకు 4 ఎకరాల పొలం ఉంది. రబీ సీజన్ లో మొక్కజొన్న పండిస్తాను. ఈసారి ప్రాజెక్టులో నీళ్లు లేని కారణంగా పంటలు వేసుకోవద్దనే ప్రచారం చేస్తున్నరు.  పంటలు వేసుకొని కుటుంబాన్ని పోషించుకునే తాము అదే లేకపోతే ఎట్లా బతకాలి. ఇది సరైన పద్ధతి కాదు. మా పంటలకు సరిపోయే నీళ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవకాశం ఉన్నచోట సాగునీళ్లు ఇచ్చి వ్యవసాయం చేసుకునేందుకు సహకరించాలి. నల్లవాగు ప్రాజెక్టుకు వెంటనే రిపేర్లు చేపట్టి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలే.  జైపాల్ (రైతు) 

ఈసారి పనులు పూర్తి చేస్తాం

నల్లవాగు ప్రాజెక్టు రిపేరింగ్ పనులు ఈసారి కచ్చితంగా పూర్తి చేస్తాం. గతంలో కాంట్రాక్టర్ కారణంగా పనులు పెండింగ్ లో పడ్డాయి. ఇప్పుడు ఆయా పనులు పూర్తి చేసేందుకు సదరు కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈసారి క్రాప్ హాలిడేస్ కోసం ప్రపోజల్ సిద్ధం చేశాం. స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డితోపాటు రైతులతో సంప్రదించాక తుది నిర్ణయం తీసుకుంటాం. రబీ పంటల కోసం రైతులకు నీళ్లు ఇవ్వడానికి ప్రాజెక్టులో సరిపోయేంత లేవు. రానున్న ఎండాకాలం అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొంత నీటిని నిల్వ ఉంచడానికి ప్లాన్ చేశాం.

ఇరిగేషన్ డీఈఈ, పవన్