దుబ్బాక టర్నింగ్​ పాయింట్​ అయ్యేనా ?

దుబ్బాక టర్నింగ్​ పాయింట్​ అయ్యేనా ?

హోరాహోరీగా క్యాంపెయిన్​ చేసిన పార్టీలు

పోల్‌ మేనేజ్‌మెంట్‌పైనే అన్ని పార్టీల నేతల ఫోకస్​

బరిలో 23 మంది క్యాండిడేట్లు

1,98,756 మంది ఓటర్లు

315 పోలింగ్‌ సెంటర్లు

ఈ నెల 10న కౌంటింగ్​

టీఆర్​ఎస్​ వర్సెస్​ బీజేపీ

దుబ్బాకలో మొదట్లో త్రిముఖ పోటీ ఉన్నట్టు కనిపించినా.. ప్రచారం ముగిసే సరికి టీఆర్‌ఎస్‌  వర్సెస్​ బీజేపీ అన్నట్లుగా సీన్​ మారిందని స్థానికులు అంటున్నారు. చివరి వారంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుందని చెప్తున్నారు. సిద్దిపేటలో జరిగిన సోదాలు, లాఠీచార్జ్​ వంటి పరిణామాలతో దుబ్బాక పోల్​ హీట్​ రాష్ట్రమంతటా చర్చకు దారితీసింది. టీఆర్​ఎస్​కు  పోలీసులు వంతపాడుతున్నారంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బై ఎలక్షన్​పై  స్పెషల్​ ఫోకస్​ పెట్టి జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో మొదట్లో వార్​ వన్​ సైడ్​ ఉండొచ్చని అంచనా వేసిన రాజకీయ ఎక్స్​పర్ట్స్​ కూడా ఇప్పుడు టఫ్​ ఫైట్​ తప్పదని అంటున్నారు.

హైదరాబాద్‌/సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ఫోకస్‌ అంతా దుబ్బాకపైనే ఉంది. బై ఎలక్షన్​ చివరి దశకు చేరడంతో ఎలాగైనా గెలిచి తీరాలని అన్నీ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇక్కడి ప్రచార హోరును చూసి పరిశీలకులు గట్టి పోటీ తప్పదంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో దుబ్బాక రిజల్ట్​ టర్నింగ్​ పాయింట్​ అయితదా? అని జనం చర్చించుకుంటున్నారు. సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకునేందుకు టీఆర్​ఎస్​.. సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్​ పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోయాయి. లీడర్లంతా దుబ్బాకలోనే మోహరించి ఓటర్లను  ప్రసన్నం చేసుకునేందుకు తుది వరకు ప్రయత్నించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియగా.. మంగళవారం ఉదయం పోలింగ్‌  స్టార్ట్​ కానుంది.

హోరాహోరీ ప్రచారం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత తరఫున మంత్రి హరీశ్‌రావు అన్నీ తానై ప్రచారం చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజాప్రతినిధులంతా ప్రచారంలో పాల్గొన్నారు.  బీజేపీ, కాంగ్రెస్‌  నుంచి ఆ పార్టీల అగ్ర నేతలంతా ప్రచారంలో పాలుపంచుకున్నారు. మండల ఇన్‌చార్జులు సహా మొత్తం క్యాంపెయినింగ్‌ వ్యవహారాలన్నీ రాష్ట్ర స్థాయి నేతలే పర్యవేక్షించారు.

ప్రచారం చివరి రోజు దుబ్బాక అంతటా లీడర్లు కలియతిరిగారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావు తరఫున పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్‌‌ చేగుంటలో ప్రచారం చేశారు. ఎంపీ అర్వింద్‌‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తొగుట, మిరుదొడ్డి మండలాల్లో రోడ్‌‌ షోలు నిర్వహించారు. బీజేపీ కోర్‌‌ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌‌ వెంకటస్వామి దౌల్తాబాద్‌‌, మాజీ ఎంపీ జితేందర్‌‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రచారం చేశారు. మంత్రి హరీశ్‌‌రావు ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని నిమిషాల ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన ఆరోపణలను బీజేపీ క్యాండిడేట్‌‌ రఘునందన్‌‌రావు తిప్పి కొట్టారు. కాంగ్రెస్‌‌ అభ్యర్థి శ్రీనివాస్‌‌రెడ్డి తరఫున పీసీసీ చీఫ్‌‌ ఉత్తమ్‌‌ వీడియో కాన్ఫరెన్స్‌‌లో నేతలతో మాట్లాడారు. ఎంపీ రేవంత్‌‌రెడ్డి చేగుంట, మిరుదొడ్డి మండలాల్లో రోడ్‌‌ షోలు నిర్వహించారు. టీఆర్‌‌ఎస్‌‌ తరఫున మంత్రి హరీశ్‌‌రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌‌రెడ్డి, రసమయి బాలకిషన్‌‌  ప్రచారం చేపట్టారు.

నేతల మధ్య మాటల యుద్ధం

దుబ్బాక బైపోల్‌‌ ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలతో ఉప ఎన్నిక హీట్‌‌  పెరిగింది.  దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం రూ.285 కోట్లు ఇచ్చిందని, ఈ విషయాన్ని నిరూపించకుంటే ఎంపీ పదవికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని బండి సంజయ్​ సవాల్‌‌ విసిరారు. పింఛన్లు, కేసీఆర్‌‌ కిట్‌‌లో కేంద్రం వాటాపై సంజయ్‌‌ చర్చకు వచ్చి నిరూపించాలని మంత్రి హరీశ్​రావు అన్నారు.

పోల్​ మేనేజ్‌‌మెంట్‌‌పై గురి

బై పోల్‌‌కు ఇంకో 24 గంటలే ఉండటంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.  ఎంత  ప్రచారం చేసినా ఓటర్లను పోలింగ్‌‌ బూత్‌‌ వరకు రప్పించే చర్యలు చేపట్టకపోతే అన్ని ప్రయత్నాలు వృథా అవుతాయని భావిస్తున్నాయి. ఒక పార్టీ కదలికలపై మరో పార్టీ నేతలు నిఘా వేసి కట్టడి చేసే ప్రయత్నాలు సాగిస్తున్నారు. పోల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ను కట్టడి చేయడంలోనూ అధికార యంత్రాంగం అధికార పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నా దుబ్బాక ఓటర్లు ఎవరిని కరుణిస్తారో ఈనెల 10న కౌంటింగ్​లో తేలుతుంది.

రేపు పోలింగ్​.. 10న కౌంటింగ్

దుబ్బాక సీటుకు కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్‌‌‌‌ 29న షెడ్యూల్‌‌‌‌ ప్రకటించింది. అక్టోబర్‌‌‌‌ 9న నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది. ఈ ఎలక్షన్​లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌‌‌‌ రావు, కాంగ్రెస్‌‌‌‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి సహా 23 మంది  పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో 1,98,756 మంది ఓటర్లు ఉండగా.. 315 పోలింగ్‌‌‌‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 89 సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌‌‌‌ జరుగనుంది. ఈ నెల 10న ఓట్లు లెక్కిస్తారు.

నలుగురు స్పెషలాఫీసర్లు

దుబ్బాక ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నలుగురు స్పెషలాఫీసర్లను నియమించింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఒక అబ్జర్వర్‌తో పాటు వ్యయ పరిశీలకుడిని మాత్రమే నియమిస్తుంటుంది. కానీ, ఇక్కడి పరిస్థితులు, కంప్లయింట్లతో రంగంలోకి దిగి.. పోలీస్‌ అబ్జర్వర్‌గా తమిళనాడు ఐపీఎస్‌ ఆఫీసర్​ను నియమించింది. ఎన్నికల ఖర్చు పరిశీలనకు మరొకరినీ ఏర్పాటు చేసింది. కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడని ఫిర్యాదులు అందడంతో ఆయనపై బదిలీ వేటు వేసింది. బందోబస్తు కోసం నాలుగు కేంద్ర కంపెనీ బలగాలను రంగంలోకి దింపింది.