
పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలు రోడ్లపై మోటార్ సైకిళ్లు, కార్లు నడుపుతూ వెళ్లడం రోజూ కనబడే దృశ్యమే. పొద్దుటే మైనర్ పిల్లలు రయ్ రయ్యన స్కూటీలు, బైకులపై తిరుగుతూ పేపర్, పాల ప్యాకెట్లు ఇళ్లలో వేస్తుంటారు. త్వరగా బస్టాపు వద్దకు వెళ్లేవాళ్లను పిల్లలే బైకులపై దింపి వస్తుంటారు. స్కూల్ యూనిఫాం వేసుకున్న పిల్లలు ఇద్దరు, ముగ్గురు ఒకే వాహనంపై కూర్చొని వేగంగా బడి బాట పడతారు. పిల్లలు బైక్ నడిపితే ఎన్నో పనులు సులువుగా అవుతున్నాయని అనుకునేవారే కానీ అదొక చట్ట ఉల్లంఘన అని, దానికి భారీ శిక్ష, జరిమానా ఉంటాయనే గ్రహింపు ఎవరికీ లేదు.
మోటార్ వెహికల్ యాక్ట్, 1988 ప్రకారం 18 ఏళ్లలోపువారు జనసంచార ప్రాంతాల్లో వాహనాలు నడపకూడదు. 16 ఏళ్లు దాటినవారు 50 సీసీ సామర్థ్యం ఉన్న మోటార్లు మాత్రమే నడపాలి. లూనా మోపెడ్లాంటి ద్విచక్ర వాహనాలు ఆ కోవకు వస్తాయి. పిల్లలు కారు లేదా మోటార్ సైకిల్ నడుపుతూ పట్టుబడితే వారి పోషకులకు 3 ఏళ్ల జైలు శిక్షతోపాటు నగదు జరిమానా కూడా ఉంటుంది. ఆ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ 3 ఏళ్లపాటు రద్దు చేయబడుతుంది.
నడిపిన పిల్లలకు శిక్షగా వారికి 18 ఏళ్లకు బదులు 25 ఏళ్లు వచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ లభిస్తుంది. అయితే ఇలా పట్టుబడిన వారిని నేర తీవ్రతను బట్టి హెచ్చరికతోపాటు కనీస జరిమానా విధించి వదిలేస్తున్నారు. అయితే అలా నడిపేవారు ఎన్నిసార్లు పట్టుబడినా ఇదేతంతు సాగుతోంది.
కన్నవారి కన్నుగప్పి పిల్లలు వాహనం తీసుకెళ్ళి నడిపినా, యజమానికి తెలియకుండా వాహనాన్ని బయటికి తెచ్చినా పెద్దలకు శిక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. కీస్ ఇచ్చి పిల్లలను పంపినా మాకు తెలియదని చిన్న అబద్ధంతో వారు తప్పించుకోవచ్చు. మరోవైపు తమ పిల్లలు బాగానే నడుపుతున్నారు, ప్రమాదాలేమీ జరగడం లేదు కదా అనే భావన పెద్దల్లో ఏర్పడింది. అలాంటప్పుడు లైసెన్స్ వయసును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాలి తప్ప చట్టాన్ని ఉల్లంఘించకూడదు.
తల్లిదండ్రులు బాధ్యులుగా లైసెన్స్ ఇవ్వాలి
అమెరికా, కెనడా మరి కొన్ని దేశాల్లో 15 , 16 ఏళ్ల వారికే కొన్ని షరతులతో కూడిన లైసెన్స్ లభిస్తోంది. మన దేశంలో కూడా మోటార్ వాహనాల వినియోగం చాలా పెరిగింది. మామూలు కుటుంబాల్లో కూడా మోటార్ సైకిల్ వాడకం ఉంటోంది. ఇంట్లో వాహనాలు ఉండడం వల్ల పిల్లలు కూడా చిన్న వయసులోనే డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ఇంటర్ చదువుతున్న పిల్లలు సొంత వాహనాలపై కాలేజీకి వెళ్తున్న పరిస్థితి ఉంది.
కావున పర్యవసానాలకు తల్లిదండ్రుల బాధ్యతగా హామీ పత్రం తీసుకొని వారి పిల్లలకు పరిమితులతో లైసెన్స్ ఇచ్చే వెసులుబాటును మన దగ్గర కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. అలా జరిగితే పిల్లలు నడిపే వాహనాల ప్రమాదాలు చేసినపుడు చట్టపర నియమాలకు పెద్దలు సిద్ధంగా ఉండక తప్పదు.
ప్రమాద బీమా కవరేజీ ఉండదు
లైసెన్స్ లేనివారు వాహనం నడిపినందున ప్రమాదాలకు బీమా కవరేజి కూడా ఉండదు. అయితే కోర్టులు మాత్రం థర్డ్ పార్టీ విషయంలో బీమా కంపెనీలను వదిలిపెట్టడం లేదు. బాధితులకు నష్టపరిహారం చెల్లించి పెద్దల నుండి వసూలు చేసుకొమ్మని తీర్పులిస్తున్నాయి. దాంతో బీమా సంస్థలు పై కోర్టులో అప్పీలు చేసుకుంటున్నాయి.
జువైనల్ హోంకు వెళ్లిన పిల్లలు బయటకు వస్తున్నారు. యజమానులు జారుకుంటున్నారు. అలా మైనర్లు చేసిన యాక్సిడెంట్లో బాధితులకు న్యాయం దక్కడం లేదు. లైసెన్స్ పొందే వయసును కొంతమేరకైనా తగ్గిస్తే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లవుతుంది. అప్పటిదాకా ప్రభుత్వాలు ఉన్న చట్టాన్ని కఠినంగానైనా అమలు చేయాలి లేదా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చట్ట సవరణలైనా చేపట్టాలి.
- బద్రి నర్సన్-