పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం సాధ్యమేనా?

పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం సాధ్యమేనా?

ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసి డ్రాపవుట్స్ అరికట్టడంలో సలహాలు ఇవ్వవలసిందిగా స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజాన్ని కోరారు. ఇది అత్యంత ప్రజాస్వామిక నిర్ణయమే! విద్యాహక్కు చట్టం-2009, నూతన జాతీయ విద్యా విధానం-2020, వాటి చట్టబద్ధమైన నిబంధనలు ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యతో  అనుసంధానాన్ని కోరుతున్నాయి.  

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలైన  కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికా పాఠశాలలు, సైనిక పాఠశాలలు, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు, ఇతర రాష్ట్రాల పాఠశాల వ్యవస్థ ఇప్పటికే  ఇంటర్ విద్యను పాఠశాల వ్యవస్థలో  అంతర్భాగంగా  నిర్వహిస్తున్నారు.  ప్రైవేటు విద్యావ్యవస్థ ఈవిషయంలో ఒక అడుగు ముందు ఉంది‌‌.  

ప్లేస్కూల్ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్​లో నిర్వహిస్తున్నారు. ఇక కార్పొరేట్  విద్యాసంస్థలు పట్టణాల్లో  వీధికో ఇంటర్  బ్రాంచి తెరిచి విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా చేస్తున్నాయి.  ఇట్లాంటి స్థితిలో  ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంటర్ విద్యా సంస్కరణ, పాఠశాలల విలీనం విషయం ఎజెండా తెరపైకి వచ్చింది.  

తెలంగాణ ప్రభుత్వం 469 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 500 ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఇంటర్ విద్యను నిర్వహిస్తోంది.  ఈ  కళాశాలల్లో 3,04,174 మంది విద్యార్థులు ఉండగా,  6,992మంది పీజీ టీచర్లు బోధనా రంగంలో ఉన్నారు.  ఇంతచేసినా ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న 1,385 జూనియర్  కళాశాలల్లోనే  5,46,217 మంది విద్యార్థులు  ఫీజులు చెల్లించి మరీ చదువుతున్నారు.  

ప్రభుత్వ జూనియర్  కళాశాలల్లో సరైన సంఖ్యలో విద్యార్థుల  నమోదు  లేకపోవడానికి కారణం ఆయా కళాశాలల్లో  వసతులు సరిగా లేక పోవడమే.  కొన్ని కళాశాలల్లో కనీస అవసరాలైన టాయ్లెట్,  లేబరేటరీ సౌకర్యాలు కూడా సక్రమంగా లేవు.  ఇక  గురుకుల  పాఠశాలల్లోనైతే దివాలా తీసిన ఇంజినీరింగ్  కళాశాలలకు లక్షలాది రూపాయలు అద్దె  చెల్లించి నిర్వహిస్తున్నారు.  ఇవన్నీ ఇంటర్ విద్య పట్ల గత ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి అద్దం పడతాయి. 
 

విద్యకు తొలి ప్రాధాన్యత 

పరిపూర్ణమైన జ్ఞానవంతులుగా విద్యార్థిని తయారుచేసే వేదికగా ఇంటర్ విలీనం అయిన పాఠశాల వ్యవస్థ ఉండాలి. ఆ దిశగా ఆధునిక మార్పులు ఉండాలి. పది పాసైనవారు దాదాపు అందరూ ఇంటర్లో చేరుతున్నారు. విద్యాహక్కుచట్టం అమలు వలన పాఠశాల నమోదు 2009లో 85.7శాతం ఉంటే, 2021నాటికి అది96.7శాతంకు పెరిగింది. డ్రాపవుట్ కూడా 5.3శాతం నుంచి1.5శాతానికి తగ్గిపోయింది.  

ఉదాహరణకు  గత ఏడాది 4,51,278 మంది పదవ తరగతి పాసయితే,  ఇంటర్  మొదటి ఏడాదిలో  గత  ఏడాది నమోదైన విద్యార్థుల సంఖ్య 4,78,718గా ఉంది.  ఇవాళ  తల్లిదండ్రులు విద్యా ప్రాధాన్యత గుర్తించారు. ఎంత ఆర్థిక పరిస్థితి అనుమతించక పోయినా పిల్లల చదువులకే  తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇంటర్ పూర్తికాగానే స్వయం సమృద్ధితో  జీవించే  నైపుణ్యాలు పొందే దిశగా ఇంటర్ విద్యను సంస్కరించాలి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 5,246  ఉన్నత పాఠశాలలు, 469 ప్రభుత్వ ఇంటర్ కళాశాలలను విలీనం చేయడం పెద్దసమస్య కాకపోవచ్చు. కానీ, ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న పీజీ ఉపాధ్యాయులు,  విద్యార్థుల  సర్దుబాటులోనే అనేక సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది.

ప్రణాళిక సత్వరం అమలుచేయాలి

తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం  నియమించిన విద్యా కమిషన్  మండలానికి మూడు  పబ్లిక్ పాఠశాలలు చొప్పున  ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఈ పాఠశాలల్లో  ప్రాథమిక, మాధ్యమిక,  ప్రాథమికోన్నత పాఠశాల వ్యవస్థను 3-–12వ తరగతి వరకు ఒకే సంపూర్ణ పాఠశాల వ్యవస్థగా రూపొందించారు. దానిప్రకారం తెలంగాణా రాష్ట్రంలో 634 మండలాల్లో మండలానికి మూడు చొప్పున ఉన్న 1,902  పాఠశాలల  గుర్తింపు మాత్రమే అవసరం అవుతుంది. ఇప్పటికిప్పుడు ఆర్థిక భారం అని ప్రభుత్వం అనుకుంటే  మండల కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాల,  రెసిడెన్షియల్ పాఠశాల  లేదా ఉన్నత పాఠశాలలో  ఒకదానిని ఎంపిక చేసుకుంటే 634 పాఠశాలలు ఉన్న వనరులతోనే సర్దుబాటుతోపాటు,   నమోదు శాతం కూడా పెరుగుతుంది. 

క్రమంగా ఇతర పాఠశాలల్లో కూడా ఇంటర్ విద్యను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. లక్షలాది రూపాయలు వెచ్చించి, వేలాదిమంది విద్యావేత్తల అభిప్రాయం అనుభవం  రంగరించి  రూపొందించిన తెలంగాణా విద్యా కమిషన్ సిఫార్సులు ఈ విషయంలో ఉండగా మరో ఆలోచన చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేనేలేదు.   ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సేవలు ఏమైనా గౌరవప్రదంగా, ఆచరణాత్మకంగా ఇచ్చిన సలహాలను  స్వీకరించడంలో తప్పులేదు. కనుక తెలంగాణా విద్యా కమిషన్ సూచనలు ఇంటర్మీడియట్ విలీనం విషయంలో నూటికి నూరు శాతం ఆచరణాత్మకమైనవి. కనుక ఈ ఏడాది పదిపాసైన విద్యార్థులు ఇంటర్  మొదటి సంవత్సరం తమ పాఠశాలలోనే చదివేలా ప్రభుత్వం ప్రణా ళికను  సత్వరం అమలుచేయాలని కోరుకుందాం.

రేవంత్ రెడ్డి  ప్రభుత్వం సంస్కరణలకు పూనుకోవడం ఆహ్వానించదగిన అంశం.  అయితే,  ఇంటర్  పాఠశాల విద్యలో విలీనం చేయడంలో  చట్టబద్ధమైన అడ్డంకులు  ఏమీలేవు. నూతన విద్యా విధానం (ఎన్ఈపీ)లో  అంతర్భాగం అయిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ తెలంగాణ పాఠశాలలో ప్రవేశ పెట్టే సందర్బంలో తెలంగాణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు అవసరం అవుతాయి. విద్యార్థులు స్వయం సమృద్ధి సంపాదించే కోర్సులు అంతర్భాగం చేయాలి. ఐటిఐ,  పాలిటెక్నిక్ లాంటి  సాంకేతిక పరమైన సిలబస్​తోపాటు,  వ్యవసాయ విద్య,  పారిశ్రామిక విద్య,  వైద్య పరిశోధనావిద్య, సాంకేతిక విద్య, కంప్యూటర్ విద్య,  ఇలాంటి విద్యలకు ఆయా పాఠశాలలు వేదికలు కావాలి.

- ఎన్.తిర్మల్,
ఎడ్యుకేషన్​ ఎనలిస్ట్​