పుతిన్​వి బెదిరింపులేనా.. 

పుతిన్​వి బెదిరింపులేనా.. 
  • పుతిన్ నిజంగనే బాంబులేస్తడా?
  • రష్యా అణ్వాయుధాలు వాడినా.. నాటో రంగంలోకి దిగినా ప్రపంచానికి తప్పని అణుయుద్ధం 
  • న్యూక్లియర్ వార్ తో అన్నిదేశాలపైనా తీవ్ర ప్రభావం 
  • బాంబులేసిన చోట కోట్ల మంది బలైపోతరు
  • ప్రపంచమంతా ఐస్ ఏజ్ పరిస్థితులొస్తయంటున్న నిపుణులు 

సెంట్రల్​ డెస్క్, వెలుగు: ఉక్రెయిన్​పై మిలిటరీ ఆపరేషన్​ పేరిట యుద్ధం మొదలుపెట్టి రెండు నెలలు గడుస్తున్నా పట్టు సాధించలేకపోవడంతో రష్యా రగిలిపోతోంది. దీంతో ఎలాగైనా తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. వార్​ మొదలైన మొదట్లోనే అణ్వాయుధాలు సిద్ధం చేసుకోవాలని తమ మిలిటరీకి పుతిన్​ ఆదేశాలిచ్చారు. నల్ల సముద్రంలో మాస్క్​ వా వార్​షిప్​ను ఉక్రెయిన్​ ధ్వంసం చేయడం పుతిన్​ను మరింత రెచ్చగొట్టింది. స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో చేరితే సరిహద్దుల్లో అణుబాంబులను మోహరిస్తమని పుతిన్​ ప్రకటించారు. దీంతో ప్రపంచాన్ని అణుభయం చుట్టుముట్టింది. 

మొదటి నుంచీ అణుబాంబులు వేస్తామని బెదిరిస్తూ వస్తున్న ఆయన.. ఇప్పుడు నిజంగానే ఉక్రెయిన్ పై అణుయుద్ధానికి దిగుతారా? రష్యాకు దీటుగా నాటో అణుయుద్ధానికి దిగితే ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి? అంటే.. ప్రపంచానికి ఇప్పటికిప్పుడు అణుముప్పు ముంచుకొచ్చే చాన్సే లేదని కొందరు నిపుణులు చెప్తుంటే.. మరికొందరు మాత్రం.. ఆ ముప్పును కొట్టిపారేయలేమంటున్నారు. 

అంచనాలు తప్పి.. పుతిన్ బెదిరింపులు 

కేవలం ఐదు రోజుల్లోనే ఉక్రెయిన్ ను జయిస్తామని భావించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కొన్నిరోజుల్లోనే వాస్తవం తెలిసొచ్చింది. ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడం, సరైన వ్యూహాలు లేక రష్యన్ బలగాలు ఎదురుదెబ్బలు తినడం నిరాశకు గురిచేసింది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహా మరియుపోల్, ఖార్కివ్ వంటి సిటీలపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ ఏకంగా 60 కిలోమీటర్ల మిలిటరీ కాన్వాయ్ ని పంపినా.. ఆ కాన్వాయ్ సైతం కీవ్ సమీపంలోకి వెళ్లి స్తంభించిపోయింది. దీంతో యుద్ధం మొదలైన కొద్దిరోజులకే పుతిన్ తన న్యూక్లియర్ ఫోర్సెస్ సన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఉక్రెయిన్ లో అమెరికా సాయంతో కెమికల్ వెపన్స్ తయారు చేస్తున్న ఆనవాళ్లు దొరికాయంటూ ప్రకటనలు చేశారు. అయితే, ఉక్రెయిన్ ను ఎంత ధ్వంసం చేస్తున్నా.. ప్రతిఘటన తగ్గకపోవడంతో పుతిన్ తీవ్ర నిరాశలో మునిగారు. మరోవైపు నాటో రంగంలోకి దిగకుండా ఉండేలా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించేందుకూ వెనకాడబోమని బెదిరిస్తూ వచ్చారు. 
 

నాటో దిగితే అణుయుద్ధమే  

ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతున్నట్లుగా రష్యాకు, నాటో దేశాలకు మధ్య సంప్రదాయ యుద్ధం జరిగితే.. రష్యా ఓడిపోక తప్పదు. అదే పరిస్థితి వస్తే.. రష్యా అణుయుద్ధానికి తెరతీస్తుంది. దీంతో ఇటు రష్యా.. అటు నాటో దేశాలు అణుబాంబులు వేసుకుంటే.. చివరకు మొత్తం ప్రపంచమే నాశనం అవ్వక తప్పదు. అందుకే.. యుద్ధంలోకి దిగకుండా ఉండేందుకే అమెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. తమ దేశంపై నో ఫ్లై జోన్ ను ప్రకటించాలని నాటోకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పదే పదే విజ్ఞప్తి చేశారు. కానీ.. నాటో నో ఫ్లైజోన్ ను ప్రకటిస్తే.. ఉక్రెయిన్ గగనతలంలోకి వచ్చే రష్యా విమానాలను కూల్చేయాల్సి వస్తుంది. దీంతో రష్యా ప్రతీకార దాడులకు దిగుతుంది. అంటే.. రష్యాతో నాటో ఏ రకమైన యుద్ధానికి దిగినా.. చివరకు పరిస్థితి కంట్రోల్ తప్పి అణుయుద్ధానికి దారి తీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

రష్యా అణుబాంబులు వేస్తుందా? 

యుద్ధం మొదలైన 4 రోజులకే రష్యా అణ్వాయుధ బలగాలు హైఅలర్ట్ లో ఉండాలని పుతిన్ ఆదేశించారు. నార్తర్న్, పసిఫిక్ బలగాలనూ యుద్ధ సన్నద్ధతతో ఉండాలని ఆదేశాలిచ్చారు. దీంతో అప్పటి నుంచే పుతిన్ అణుబాంబులు ప్రయోగిస్తారా? అన్న ఆందోళనలు మొదలయ్యాయి. దేశ ఉనికికి ముప్పు వస్తే తప్ప అణుబాంబులు ప్రయోగించకూడదన్నది తమ న్యూక్లియర్ పాలసీ అని, కానీ తమ మనుగడకు ముప్పు వాటిల్లితే మాత్రం అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఇటీవల పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా అణుబాంబులు ప్రయోగిస్తే.. అమెరికా అందుకు దీటుగా ప్రతిస్పందించే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. పుతిన్ అంతటి సాహసానికి దిగే అవకాశాలు చాలా తక్కువని అమెరికా మిలటరీ అధికారులు భావిస్తున్నారు. నాటో దేశాలపై కాకుండా ఉక్రెయిన్ లోనే చిన్న అణుబాంబును వేసినా.. నాటో రంగంలోకి దిగాల్సి రావచ్చని పేర్కొన్నారు. ఒకవేళ ఉక్రెయిన్​లో రష్యా మినీ అణుబాంబులు లేదా కెమికల్ వెపన్స్ వాడినా వాటితో  ఏర్పడే రేడియేషన్, కెమికల్ గ్యాసెస్ పొరుగున ఉన్న నాటో దేశాలకు వ్యాపించొచ్చని, అదే జరిగితే.. దానిని నాటోపై దాడిగానే పరిగణించాల్సి 
వస్తుందని చెప్తున్నారు.  

అణుయుద్ధానికి నో చాన్స్: బ్రియాన్ టూన్ 

ప్రపంచానికి ఇప్పటికిప్పుడు అణుబాంబుల ముప్పు ఉండకపోవచ్చని యూనివర్సిటీ ఆఫ్​కాలిఫోర్నియా (బౌల్డర్) స్పేస్ ఫిజిక్స్ ప్రొఫెసర్, అణుయుద్ధ పరిశోధకుడు బ్రయాన్ టూన్ స్పష్టం చేశారు. ‘‘అణుయుద్ధమే జరిగితే రష్యా అంతా అగ్నిగుండం అవుతుందన్న విషయం పుతిన్​కు తెలుసు. రష్యాలోని ప్రతి పెద్ద నగరంపైనా అమెరికా10 అణు బాంబులు వేయగలదు. అలాగే అమెరికా, ఇతర దేశాలకూ రష్యా నుంచి అంతే ముప్పు ఉంటుంది” అని బ్రయాన్ అన్నారు.  

కెమికల్ వెపన్స్ మాటేమిటి?  

రష్యా వద్ద ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా రసాయన ఆయుధాలు ఉండేవి. నోవిచోక్, సరీన్, వీఎక్స్ రకం నర్వ్ ఏజెంట్లు, మస్టర్డ్ గ్యాస్, ఫాస్జీన్ టాక్సిక్ గ్యాస్ వంటివి ఉండేవి. వాటన్నింటినీ నాశనం చేశామని రష్యా 2017లో ప్రకటించింది. కానీ రష్యా వద్ద అవి ఇంకా ఉన్నాయని 2018, 2020లో వెల్లడైంది. ప్రస్తుతం వాటిని ఉక్రెయిన్ పై వేసేందుకు ‘ఫాల్స్ ఫ్లాగ్’ ఆపరేషన్ కు రష్యా సిద్ధమవుతోందని అమెరికా భావిస్తోంది. గతంలో ఇరాక్ పై అమెరికా యుద్ధానికి దిగినట్లుగా.. ఉక్రెయినలో కెమికల్ వెపన్స్ తయారు చేస్తున్నారని చెప్తూ రష్యా అణుబాంబులు లేదా రసాయన ఆయుధాలను ప్రయోగించొచ్చు. లేదంటే తన సైన్యంలోనే చిన్న యూనిట్ పై తక్కువ మొత్తంలో రసాయన ఆయుధాలను ప్రయోగించి.. ఉక్రెయిన్ పై ఆ నింద వేసి, కెమికల్ వెపన్స్ ప్రయోగించే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. కెమికల్ వెపన్స్ వాడితే జనం ప్రాణాలు పోవడమే కాదు.. గాలి, నీరు, నేల అంతా కలుషితం అవుతాయి. నర్వ్ ఏజెంట్ల వంటివి మనిషి చర్మానికి తాకినా.. కొన్ని సెకన్లు లేదా నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. అయితే, కెమికల్ వెపన్స్ కు రష్యా సిద్ధం కాలేదని చెప్తున్నారు.

ప్రపంచంలోని అణుబాంబులు13,890 

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని దేశాలలో మొత్తం 13,890 అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా. 1986 నాటికే భూమిపై 70,300 న్యూక్లియర్ వార్ హెడ్ లు ఉండేవి. అవన్నీ వాడితే గనక భూమిపై జీవజాలం అంతా తుడిచిపెట్టుకుపోతుందంటూ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అణ్వాయుధాలను భారీగా తగ్గించుకోవాలని అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్, సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్ మిఖాయిల్ గోర్బచెవ్ అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగా షార్ట్ రేంజ్ అణ్వాయుధాలను గణనీయంగా నిర్మూలించారు.  

మినీ బాంబులేస్తదా?

రష్యా దగ్గర ఉన్న మొత్తం అణుబాంబుల్లో 2 వేల వరకూ టాక్టికల్ న్యూక్లియర్​ వెపన్సే. టాక్టికల్​ వెపన్స్ అంటే తక్కువ పరిధిలో ఉండే టార్గెట్లను నాశనం చేసేందుకు ఉపయోగపడేవి. ఇవి రెడీ టు ఫైర్​ బాంబులు. వీటిని ఎలా కావాలంటే అలా వాడొచ్చు. ఫ్లైట్స్, షిప్స్, మిస్సైళ్లు, సబ్​మెరైన్లు, చిన్న చిన్న బాంబులుగా కూడా ఉపయోగించవచ్చు. ఆర్టిలరీ షెల్స్ గా, టార్పెడోలుగా కూడా ప్రయోగించవచ్చు. ఇవి పేలడం వల్ల కలిగే నష్టంకన్నా వాటి ద్వారా విడుదలయ్యే రేడియేషన్​ ప్రభావమే ఎక్కువ. ఇవి సైజ్​లోనూ, సామర్థ్యంలోనూ స్ట్రాటజిక్  వెపన్స్​తో పోలిస్తే చాలా భిన్నమైనవి. ఇందులో చిన్నవి ఒక కిలో టన్ను అంతకంటే తక్కువగా.. పెద్దవైతే 100 కిలోటన్నుల బరువు వరకు ఉంటాయి. సైజ్,​ ఎంత ఎత్తు నుంచి ప్రయోగించారు, స్థానికవాతావరణం వంటి వాటి ఆధారంగా వీటి ప్రభావం ఉంటుంది. టాక్టికల్​ న్యూక్లియర్​ వెపన్స్​ ను మోసుకెళ్లే రెండు వ్యవస్థలు ప్రస్తుతం రష్యా దగ్గర ఉన్నాయి. అందులో ఒకటి క్యాలీబర్​ మిస్సైల్. భూమి, సముద్రం ద్వారా ప్రయోగించే ఈ క్రూయిజ్​ మిస్సైల్​ 1,500 కిలోమీటర్ల నుంచి 2,500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్స్​ను ఛేదించగలదు. ఇక ఇస్కాందర్ ఎం మిస్సైల్​ లాంచర్​ ద్వారా కూడా టాక్టికల్​ వెపన్స్​ను ప్రయోగించవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా 400 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఛేదించవచ్చు.

‘హిరోషిమా’ కంటే పవర్ ఫుల్

రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా 1945లో జపాన్ లోని హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబు పేలుడుతో 15 కిలోటన్నుల శక్తి విడుదలై సుమారు 1.29 లక్షల మందిని బూడిద చేసింది. నాగసాకిపై వేసిన బాంబుతోనూ 15 కిలోటన్నుల శక్తి విడుదల కాగా, 2.26 లక్షల మంది బలయ్యారు. ఆ తర్వాత చాలా దేశాలు అణ్వాయుధాలు సమకూర్చుకున్నా.. ఇప్పటివరకూ అణుయుద్ధానికి మాత్రం దిగలేదు. ప్రస్తుతం అమెరికా, రష్యా వద్ద ఉన్న అణ్వాయుధాలు హిరోషిమా, నాగసాకిపై వేసిన వాటికంటే చాలా రెట్లు పవర్ ఫుల్ గా ఉన్నాయని అంచనా. ఉదాహరణకు అమెరికా వద్ద ఉన్న బీ61 న్యూక్లియర్ బాంబ్ బరువును బట్టి.. 0.3, 1.5, 10 లేదా50 కిలోటన్నుల పేలుడును సృష్టించగలదు. ఇప్పుడు రష్యా వద్ద ఉన్న స్ట్రాటజిక్​ వెపన్​ కనీస సామర్థ్యం 800 కిలో టన్నులు.      

అమెరికా ఏం చేస్తుంది? 

రష్యా అధ్యక్షుడు పుతిన్ అణుయుద్ధానికి దిగితే అమెరికా, దాని మిత్ర దేశాలు ఎలా ప్రతిస్పందించాలి? అన్నదానిపై యుద్ధం ప్రారంభమైన 4 రోజులకే అమెరికా అధ్యక్షుడు బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) జాక్ సలివన్ ప్రత్యేక టీమ్ ను రంగంలోకి దించారు. రష్యా కదలికలను గమనిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసేందుకు జాతీయ సెక్యూరిటీ ఆఫీసర్లతో ‘టైగర్ టీమ్’ను ఏర్పాటు చేశారని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేస్తున్న నాటో దేశాల కాన్వాయ్ పై రష్యా దాడి చేస్తే లేదా మాల్డోవా, జార్జియాలపై కూడా రష్యా దండెత్తితే.. ఏం చేయాలన్న విషయాలను టైగర్ టీమ్ పరిశీలిస్తోందని తెలిపింది.