మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?

మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?

నేటి కాలంలో సగటు మనిషి జీవితం ఎంత భారమవుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నారంటే.. అందులో కనీసం ఇద్దరు పనిచేస్తే తప్ప ఇంటిల్లిపాదికి పూట గడవని పరిస్థితి. అందునా, ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు పైచదువులు చదువుతున్నారంటే ఖర్చులు తడిసి మోపెడవుతాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ దుస్థితి మరీ ఎక్కువ.. వచ్చే ఆదాయం సంగతి పక్కన పెడితే.. నెల తిరిగే సరికి అప్పులతో కుటుంబాన్ని నెట్టుకు రావాల్సిన పరిస్థితులు. 

ప్రస్తుత రోజుల్లో ద్రవ్యోల్బణం, అధిక జీవన వ్యయాల కారణంగా ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గింది. స్కూల్ ఫీజుల దగ్గర నుంచి నిత్యవసరాలు, ఇంటి రెంట్లు, హాస్పిటల్‌‌ ఖర్చులు ఇలా ప్రతిదీ పిరం అయ్యాయి. ఆకాశాన్నంటుతున్న ఈ ధరలు సామాన్యుల జేబులను గుల్ల చేస్తున్నాయి. ఈ విషయంపై ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన పూర్వ విద్యార్థి(ప్రితేష్ కాకాని).. మెట్రోపాలిటన్ నగరంలో నివసిస్తున్న సగటు నలుగురు సభ్యుల కుటుంబానికి ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై వివరణాత్మక లెక్కలు వేశారు.    

ప్రితేష్ కాకాని ప్రకారం.. మెట్రోపాలిటన్ నగరంలో నివసించాలంటే ఒక కుటుంబానికి ఏడాది ఖర్చు రూ. 20 లక్షలు అవసరమవుతాయని తెలిపారు. అందులో ఇంటి అద్దె దగ్గర నుంచి మొదలు.. తిండి, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, వస్త్రధారణ, ప్రయాణాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల కొనుగోళ్లు వంటి అన్నిటికీ అయ్యే ఖర్చులను వివరించాడు. నెలవారీ అద్దె రూ.35,000 పేర్కొనగా.. ఆహార ఖర్చుల కోసం నెలకు రూ. 10,000, వైద్యానికి రూ. 8000, పెట్రోల్ కు రూ. 5,350, విద్యుత్ + గ్యాస్ రూ. 1,500.. ఇలా ప్రతి ఒక్క ఖర్చుకు కేటాయింపులు జరిపాడు.

''భారతదేశంలోని మెట్రో నగరంలో సగటు నలుగురు సభ్యులు మధ్యతరగతి కుటుంబానికి సౌకర్యవంతమైన జీవితం కోసం ఏడాదికి 20 లక్షలు ఖర్చు అవుతుంది. విలాసవంతమైన ఖర్చులు ఇందులో జోడించబడలేదు.." అని అతను చేసిన ఖర్చు వివరాలను స్క్రీన్‌షాట్‌ రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజెన్స్.. అతని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.