- పొలిటికల్ హీటే కారణమా?
- పీఎంకు ఎయిర్‌పోర్టులో స్వాగతం, వీడ్కోలు పలికిన మంత్రి తలసాని
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ టూర్‌కు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రికి ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సిన ఆయన ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు. అయితే.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ హీట్ పెరగడం వల్లే ప్రధాని పర్యటనకు సీఎం డుమ్మా కొట్టినట్లు తెలుస్తున్నది. శనివారం హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రాగా.. గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో స్వాగతం పలికారు.
ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుకున్న ప్రధానిని స్వాగతించి సాయంత్రం వరకు ఆయన వెంట వివిధ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనాలని షెడ్యూల్లో ఉంది. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలతో పాటు ముచ్చింతల్ చినజీయర్ ఆశ్రమంలోని రామానుజుల విగ్రహావిష్కరణలో ప్రధానితోపాటు పాల్గొనాల్సి ఉంది. ఈ ప్రోగ్రాంలన్నింటికీ కేసీఆర్ దూరంగా ఉండటం రాజకీయంగా ఊహాగానాలకు తెరలేపింది.
స్వాగతం పలుకుతానని చెప్పి..!
గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఐదు రోజుల కింద కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌పై విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కావాలని కామెంట్లు చేశారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే.. ప్రొటోకాల్ ప్రకారం వెళ్లి స్వాగతం పలుకుతానని అదే రోజు మీడియా అడిగిన ప్రశ్నకు కేసీఆర్ బదులిచ్చారు. కానీ.. శనివారం రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి మాత్రం ఆయన స్వాగతం పలకలేదు. ఉదయం నుంచి ప్రగతిభవన్‌లో కేసీఆర్ ఉన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వైరం పెరిగినందునే ప్రధాని మోడీ ప్రోగ్రామ్‌కు సీఎం అటెండ్ కాలేదని తెలుస్తున్నది. దుబ్బాక, హుజూరాబాద్ బై ఎలక్షన్ల తర్వాత బీజేపీకి, టీఆర్ఎస్కు ‘నువ్వా నేనా’ అన్నట్లు రాజకీయ పోరు నడుస్తున్నది. ఇటీవల ధాన్యం సేకరణపై సీఎం హోదాలో కేసీఆర్ ఆందోళన చేయడం, కేంద్ర బడ్జెట్‌ను విమర్శిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాజకీయ విమర్శలకు మించి మాట్లాడటాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఏకంగా రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కావాలని సీఎం చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఈ పొలిటికల్ హీట్‌లో ప్రధానిని నేరుగా కలుసుకునేందుకు కేసీఆర్ వెనుకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతున్నది. గురువారమే ముచ్చింతల్‌కు వెళ్లి రామానుజ విగ్రహావిష్కరణ ఏర్పాట్లు పరిశీలించిన కేసీఆర్.. చివరి క్షణంలో ప్రధాని టూర్‌కు వెళ్లకపోవటం వెనుక ఇటీవలి రాజకీయ పరిణామాలే కారణమనే చర్చ నడుస్తున్నది.
ఒక్కరోజు ముందు తలసానికి బాధ్యతలు
ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలికే బాధ్యతలను ఆయన టూర్‌కు ఒక్కరోజు ముందు అంటే శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కార్యాలయం అప్పగించింది. ప్రధాని పర్యటనకు మంత్రి తలసానిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నామినేట్ చేసినట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి సీఎంవో అఫీషియల్‌గా జీఏడీకి లెటర్ రాసింది. ఈ లెటర్‌ను మీడియాకు లీక్ చేయటంతో.. కేసీఆర్ పీఎం టూర్‌కు వెళ్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కనీసం ముచ్చింతల్కార్యక్రమంలోనైనా పాల్గొంటారని చివరి వరకు చర్చ జరిగింది. కానీ ఇక్రిశాట్ కార్యక్రమంతోపాటు రామానుజుల విగ్రహావిష్కరణకు కూడా ఆయన హాజరుకాలేదు. ప్రధానితో కలిసి వేదిక పంచుకోవాల్సి వస్తుందనే కారణంతోనే డుమ్మా కొట్టినట్లు చర్చలు జోరందుకున్నాయి. రాష్ట్రానికి ప్రధాని వస్తే ప్రొటోకాల్ ప్రకారం సీఎం హోదాలో అటెండవుతానని, అందులో డౌట్ ఎందుకని మొన్న ప్రెస్మీట్లో చెప్పిన కేసీఆర్.. తీరా ప్రధాని పర్యటన టైమ్‌లో మాత్రం దూరంగా ఉండటం, అసలు కారణమేమిటో సీఎంవో నుంచి కూడా అధికారికంగా ప్రకటన విడుదల కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.