జీవితానికి ఒక పర్పస్ అంటూ ఏదైనా ఉంటుందా?

జీవితానికి ఒక పర్పస్ అంటూ ఏదైనా ఉంటుందా?

జీవితానికి ఒక పర్పస్ (ప్రయోజనం) అంటూ ఏదైనా ఉంటుందా? ఉంటే... ఆ పర్పస్  ఏంటి? ఇదే  క్వశ్చన్​ ఒక రైటర్ ను అడిగితే... ‘గొప్ప పుస్తకం రాయడం’ తన లైఫ్ పర్పస్  అంటాడు. అదే పొలిటీషియన్​ని అడిగితే ‘పెద్ద పదవి పొందడమే’ తన లైఫ్ పర్పస్ అని చెప్తాడు. చదువుకునే స్టూడెంట్ అయితే ‘జాబ్ తెచ్చుకుని మంచిగ సెటిల్​ కావాలి’ అంటాడు. ప్రేమికుల హృదయాలను తడితే అమరమైన ప్రేమను పొందడమే తమ లైఫ్ పర్పస్ అంటారు. ఒక పేదవాడితో మాట్లాడితే డబ్బు సంపాదించడమని..., అదే బాగా డబ్బున్నవాళ్లని అడిగితే ఇంకా ఎక్కువ సంపాదించడమే తమ లైఫ్ పర్పస్ అనొచ్చు. 

కానీ, వాస్తవానికి ఇవన్నీ నిజంగా జీవిత పరమార్థాలేనా? కానేకాదు అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్​ ఓ కవితలో. కానీ, వీటిల్లో పడి లైఫ్​ ఒరిజినల్​ పర్పస్​ మర్చిపోతున్నారు అంతా. ముందుగా జీవితం అనేది ఒక వ్యాపారం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. జీవితాన్ని వ్యాపారంగా చూసేవాళ్లు జీవితాంతం పరుగులు తీస్తూనే ఉంటారు. ఆ పరుగు దేనికో కూడా తెలియకుండా పరుగులు తీస్తారు. చివరికి అసలైన జీవితాన్ని అనుభూతి చెందకుండా, అసలేం అనుభవించకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్తారు.  నిజానికి జీవితానికి సంబంధించి అసలు ఒక పర్పస్, గోల్ అనేవి ఏమీ ఉండవు. ఇది తెలుసుకున్న రోజు మనిషి ఉరుకులు పరుగులు ఆగిపోతాయి. ఆ క్షణం నుండే మనిషిలో ఒక నిశ్శబ్దం ఆవరిస్తుంది. మనసు నెమ్మదిస్తుంది. సంపూర్ణ జీవితాన్ని అనుభవించే సామర్థ్యం కలుగుతుంది. ఇక, అప్పుడు లైఫ్​కి పర్పస్ లేదు, మనసుకు అంతం లేదనే విషయం అర్థం చేసుకుంటారు.  

చేతిలో ఉన్నదాన్ని జారిపోనివ్వకుండా
ఒకసారి ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాలి.. ఫలానా దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? ఎంత ప్రేమిస్తున్నారు? అని. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఇలా  ప్రశ్నించుకున్నారా? సూర్యుడు పడమటి దుప్పటి కప్పుకునే ముందు ఉండే అందాన్ని..రాత్రి చుక్కలు నిండిన ఆకాశం...ఎర్రటి గులాబీలు..పసిపిల్లల బోసినవ్వులు.. ఎందుకు  అంత అందంగా కనిపిస్తున్నాయి?  ఈ ప్రశ్నలు ఎవరిని అడిగినా దానికి ప్రత్యేకించి ఒక కారణాన్ని చెప్పరు. ఎందుకంటే అసలు దానికి రీజన్ అనేది​ ఉండదు.  కానీ, వాటివల్ల సంతోషం మాత్రం కలుగుతుంది.  అలాగే, జీవితానికి కూడా ఒక పర్పస్ అంటూ ఏమీ లేదు. షాక్ అవ్వకండి. జీవితానికి ఒక పర్పస్ లేదా ఒక పరమార్థం ఉంటుందన్న ఆలోచనే తప్పు. అది పర్పస్ కాదు, దురాశ! అందుకే  చేతిలో ఉన్న క్షణాన్ని జారిపోనివ్వకుండా అనుభవించాలి. ప్రజెంట్ మూమెంట్​లో జీవించడం ఒక బ్లెస్సింగ్​ లాంటిది. మనసు  కోరుకునేది ఆ బ్లెస్సింగ్స్​నే.  ఎందుకంటే జీవితం ఒక లాజిక్ కాదు. జీవితం అంటే  ఒక ప్రేమ సముద్రం. 

సంపూర్ణ సంతోషం
జీవితం అంటే సంపూర్ణమైన సంతోషం. జీవితం అంటే సంతోషం నిండిన నవ్వు. జీవితం అంటే నవ్వులు పూయించే వినోదం. అంతేగానీ, జీవితానికి ఒక పర్పస్ అంటూ ఏమీ లేదు. అందుకే ప్రస్తుత క్షణంలో జీవించాలి.  జీవితానికై తనదైన ఒక సొంత ముగింపు ఉంటుంది.  దానికి మరో ముగింపు లేదు. ఇతర ఏ ప్రయోజనమూ దానికి ముగింపు కాదు. ఇది అర్థం చేసుకున్న క్షణంలోనే జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది.  ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి నుండి మన లైఫ్ పర్పస్​ను చెప్పే ఒక అద్భుతమైన కవితను గుర్తు చేసుకోవాలి.
‘‘ సముద్ర తీరాన పిల్లలు కలుసుకున్నారు. పైన ఆకాశం నిశ్చలంగా ఉంది. అవిరామంగా సముద్రం పొంగి పొర్లుతోంది. అంతంలేని లోకాల సముద్ర తీరాన  పిల్లలు అరుపులతో, నృత్యాలతో కలుసుకున్నారు. ఇసుకతో ఇళ్లు కట్టుకుంటారు.  ఉత్త ఆల్చిప్పలతో ఆడుకుంటారు. ఎండుటాకులతో పడవలు చేసి,  విశాల సముద్రంపైన చిరునవ్వులతో వదులుతారు. వారికి ఈదడమెట్లానో తెలీదు. వలలు వెయ్యడం తెలీదు. పల్లెవాళ్లు ముత్యాలకోసం మునుగుతారు. వ్యాపారులు ఓడల్లో ప్రయాణమవుతారు.  కానీ, పిల్లలు గులకరాళ్లని పోగు చేసుకొని వాటిని నీళ్లలో వెదజల్లుతారు. గుప్త భాగ్యరాశులకోసం వెతకరు. వాళ్లకు వలలు వెయ్యడం చేతకాదు.  తోవ తెలియని ఆకాశంలో తుపాన్ విస్తరిస్తోంది.  ఓడలు మునిగిపోతున్నాయి. మృత్యువు విచ్చలవిడిగా సంచరిస్తోంది. అంతులేని లోకాల తీరాన పిల్లలు ఆడుతూనే ఉన్నారు’’ అంటాడు ఓ కవితలో. ఇది పిల్లల కోసం రాసిన కవిత కాదు. పిల్లల్లాగే మనమంతా ఎలాంటి పర్పస్ లేకుండా జీవితాన్ని ఆస్వాదించాలని చెప్తూ  రాసిన కవిత. దురాశను విడిచిపెట్టి జీవితం చివరి పేజీ వరకు ఆడుతూ, పాడుతూ సాగాలని చెప్పిన కథ. సముద్ర తీరంలో ఆడుకునే పిల్లలు ఆల్చిప్పలు, రంగురంగుల గులక రాళ్లను ఏరుకుంటారు! కానీ, వాటి పర్పస్ ఏంటి? గుప్తరాశులతో ఓడల్లో బయలుదేరిన వ్యాపారుల సంగతి ఏమైంది? కాబట్టి, జీవితానికి ఏ పర్పస్ లేదు. జీవితాన్ని ఆడుతూ, పాడుతూ ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే జీవితానికి అందమైన ముగింపు! ఇది అనుకున్నంత ఈజీ కాదు. కానీ, అనుకుంటే ఈజీనే! 
:::మానసి