ఏపీకి మరో ముప్పు.. రైతులకు వాతావరణశాఖ అలర్ట్

ఏపీకి మరో ముప్పు.. రైతులకు వాతావరణశాఖ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ ముప్పు పొంచి ఉందా..? తుపాన్ రూపంలో మరో గండం రానుంది..? ఇప్పటికే తుపాన్ తో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులను మళ్లీ అగాధంలో నెట్టేయనుందా..? వాతావరణశాఖ అధికారుల వెదర్ రిపోర్టు ఏం చెబుతోంది..? డిసెంబర్ 16న బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడి..18వ తేదీకి అది అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం దాని గమనం (దిశ) శ్రీలంక - తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతోందని తెలిపారు. ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా ఏర్పడనుందని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ వైపుగా 50 శాతం వచ్చే ఛాన్స్ కనిపిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే  డిసెంబర్ 21, 22, 23, 24, 25 తేదీల వరకు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఈసారి భారీ ముప్పు సంభవించే చాన్స్ ఉందంటున్నారు.  రైతులు తమ పనులను డిసెంబర్ 15వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. 

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, వాయువ్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపారు.

ఈ వాతావరణ పరిస్థితుల వల్ల.. ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు చినుకులు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉందని తెలిపారు.  

దక్షిణ కోస్తాంధ్రలో కూడా తేలిక పాటి నుండి ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.