
- ముడి సరుకుల ఖర్చులు ఎక్కువవుతాయన్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు
- ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరుగుతాయి
- భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయక తప్పదని వెల్లడి
న్యూఢిల్లీ: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఇండియన్ ఎఫ్ఎంసీజీ(ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) కంపెనీలు నష్టపోనున్నాయి. ముడిసరుకుల ధరలు నిలకడగా ఉన్నాయని ఊపిరి పీల్చుకుంటుండగా, ఇప్పుడు ఆయిల్ ధరలు పెరగడం వల్ల ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరిగే పరిస్థితి వచ్చింది. దీంతో సబ్బులు, స్నాక్స్, డిటర్జెంట్స్, పెయింట్స్ లాంటి రోజువారీ వస్తువుల ధరలు పెంచాల్సి వస్తుందని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (సింతాల్, గుడ్ నైట్ బ్రాండ్స్) సేల్స్ హెడ్ కృష్ణ ఖట్వానీ మాట్లాడుతూ, “జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి షార్ట్ టర్మ్‌లో సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల ప్రొడక్ట్‌ల ధరలు పెరిగి, కస్టమర్లపై భారం పెరుగుతుంది” అని అన్నారు.
ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్ట్‌ల ధరల్లో ప్యాకేజింగ్ మెటీరియల్స్ లాంటి హై-డెన్సిటీ పాలిథీన్, ఇతర పాలిమర్స్ (క్రూడాయిల్ నుంచి వచ్చేవి) వాటా 15–-20 శాతం వరకు, రవాణా ఖర్చుల వాటా 30శాతం వరకు ఉంటుంది. ముడిసరుకుల ఖర్చులు పెరగడం వల్ల ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గుతాయని, ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయక తప్పదని కంపెనీలు చెప్తున్నాయి. పార్లే ప్రొడక్ట్స్ వైస్-ప్రెసిడెంట్ మయాంక్ షా మాట్లాడుతూ, “ధరలు ఎంత పెరుగుతాయో ఇప్పుడు చెప్పలేం. మరో 10–-15 రోజుల్లో ఆయిల్ ధరలు ఎంత పెరుగుతాయో చూసి నిజమైన ప్రభావాన్ని అంచనా వేయగలం. జియోపొలిటికల్ పరిస్థితులను గమనిస్తున్నాం” అని అన్నారు.
క్రూడాయిల్ బ్యారెల్‌కు 79 డాలర్లు
బ్రెంట్ క్రూడాయిల్ రేటు సోమవారం బ్యారెల్‌కు 79 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జూన్ మధ్య నుంచి 10 శాతం పెరిగింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై ఇజ్రాయెల్ దాడులు, తెహ్రాన్ నుంచి మిస్సైల్ ప్రతీకారం తర్వాత ఈ పెరుగుదల వచ్చింది. మేలో ధరలు బ్యారెల్‌కు 65 డాలర్ల దగ్గర ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడి నిర్ణయం తీసుకోవడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎఫ్‌జీఈ ఫౌండర్ ఫెరీడున్ ఫెషరాకి ప్రకారం, హర్మూజ్ జల సంధి మూతపడితే బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుతుంది. భారత్ తన 90శాతం క్రూడ్ ఆయిల్ అవసరాలను దిగుమతుల ద్వారా చేరుకుంటోంది. కిందటేడాది ఇండియాకు దిగుమతి చేసుకున్న క్రూడాయిల్‌లో 38శాతం ఈ రూట్ ద్వారా వచ్చింది.
పెయింటింగ్ కంపెనీలకు ఇబ్బంది..
ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్ట్స్‌లో ఉపయోగించే ఇతర పెట్రోలియం ఉత్పత్తుల్లో లీనియర్ ఆల్కైల్ బెంజీన్ (డిటర్జెంట్స్‌లో), టైటానియం డైఆక్సైడ్ (క్యాండీస్, బేక్డ్ గూడ్స్, కాస్మెటిక్స్, పెయింట్స్‌లో) ఉన్నాయి. డెకరేటివ్ పెయింట్స్‌లో 300 కి పైగా ఐటెమ్స్ ఉపయోగిస్తారు. వీటి ధరలు పెరిగితే ఫైనల్ ప్రొడక్ట్ రేటు ఎక్కువవుతుంది.
“మిడిల్ ఈస్ట్‌లోని యుద్ధాల వల్ల గ్లోబల్ సప్లై చైన్‌లో అంతరాయాలు, షిప్‌లు చుట్టు తిరిగి రావడం వల్ల ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు పెరిగాయి. క్రూడ్ ధరలు పెరగడంతో రా మెటీరియల్ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. ఈ ఖర్చులు ఇలాగే పెరిగితే, కొన్ని ప్రొడక్ట్‌ల ధరలను సవరించాల్సి వస్తుంది” అని షాలిమార్ పెయింట్స్ సీఈఓ కుల్దీప్ రైనా అన్నారు. కాగా, గత ఐదు క్వార్టర్స్‌లో ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు నెమ్మదించాయి. డిమాండ్ పుంజుకుంటున్న టైమ్‌లో గ్లోబల్‌గా అనిశ్చితి నెలకొంది.