ఇజ్రాయెల్లో తొలి ఒమిక్రాన్ మరణం

ఇజ్రాయెల్లో తొలి ఒమిక్రాన్ మరణం

ప్రపంచదేశాలను ఒమిక్రాన్ భూతం వెంటాడుతోంది. ఇప్పటికే బ్రిటన్, అమెరికాల్లో ఈ వైరస్ బారిన పడి ఇద్దరు చనిపోయారు. తాజాగా ఒమిక్రాన్ బారినపడి ఇజ్రాయెల్ లో  ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఒమిక్రాన్ బారినపడ్డ 60ఏళ్ల వ్యక్తి రెండు వారాల క్రితం బీర్షెబాలోని సొరోకా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో మంగళవారం కన్నుమూశాడు. బాధితునికి పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. వైరస్ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు నాల్గో డోస్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆ దేశ ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. 60ఏళ్లు పైబడిన వారితో పాటు మెడికల్ సిబ్బంది, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి తొలుత నాల్గో డోస్ ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. దీంతో పాటు రెండు, మూడో డోస్ ల మధ్య కాలవ్యవధిని 5 నుంచి 3 నెలలకు తగ్గించింది. ఇజ్రాయెల్ ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రజలకు విస్తృతంగా టీకాలు వేసింది. అనంతరం బూస్టర్ డోస్ సైతం అందించిన తొలి దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ లో 340 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది.