గాజా హ్యుమానిటేరియన్ జోన్‌‎పై ఇజ్రాయెల్ దాడి.. 19 మంది మృతి

గాజా హ్యుమానిటేరియన్ జోన్‌‎పై ఇజ్రాయెల్ దాడి.. 19 మంది మృతి

డెయిర్ అల్-బలా: గాజాలోని హ్యుమానిటేరియన్ జోన్‌‌‌‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు. మరో 60 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్-, హమాస్ యుద్ధం కారణంగా నిరాశ్రయులైన వేలాది మంది పాలస్తీనియన్లు.. ఖాన్ యూనిస్‌‌‌‌లోని మువాసిలో ఉన్న హ్యుమానిటేరియన్ జోన్‌‌‌‌లో నివసిస్తున్నారని గాజా హెల్త్ మినిస్ట్రీ మంగళవారం వెల్లడించింది. 

ఈ జోన్‌‌‌‌పై ఇజ్రాయెల్ సోమవారం అర్ధరాత్రి వైమానిక దాడికి పాల్పడిందని తెలిపింది. ఇప్పటిదాకా 19 మంది డెడ్ బాడీలు లభ్యమయ్యాయని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వివరించింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. దాడిలో ప్రజలు ఆశ్రయం పొందుతున్న టెంట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొంది.

హమాస్ మిలిటెంట్లపైనే దాడి చేశాం

తమ హ్యుమానిటేరియన్ జోన్‌‌‌‌పై దాడి జరిగినట్లు గాజా హెల్త్ మినిస్ట్రీ చేసిన కామెంట్‎పై ఇజ్రాయెల్ స్పందించింది. సీనియర్ హమాస్ మిలిటెంట్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తాము దాడి చేసినట్లు వెల్లడించింది. ఆ ప్రాంతంలో  కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌లో హమాస్ మిలిటెంట్లు దాగి ఉన్నట్లు చెప్పింది. గాజాలోని పలు టెర్రరిస్ట్ గ్రూపులే హ్యుమానిటేరియన్ జోన్‌‌‌‌పై దాడి చేసి దానికి ఇజ్రాయెల్‎ను బాధ్యులను చేస్తున్నారని మండిపడింది. 

ఇజ్రాయెల్ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని.. ఆ ప్రాంతంలో టెర్రరిస్టులెవరూ లేరని హమాస్ తెలిపింది. అయితే, తమ వాదనలే వాస్తవమని ఇజ్రాయెల్ గాని, హమాస్ గాని తగిన ఆధారాలను బహిర్గతం చేయలేదు. కాగా..ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 40,900 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.