గాజాపై ఇజ్రాయెల్ దాడులు..85 మంది మృతి.. నెతన్యాహుపై ఇంటా, బయటా పెరుగుతున్న విమర్శలు

గాజాపై ఇజ్రాయెల్ దాడులు..85 మంది మృతి.. నెతన్యాహుపై ఇంటా, బయటా పెరుగుతున్న విమర్శలు

డీర్ అల్-బలాహ్ (గాజా స్ట్రిప్):  గాజా స్ట్రిప్‌‌పై ఇజ్రాయెల్ సైన్యం సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తీవ్రమైన దాడులు జరిపింది. ఈ దాడుల్లో మొత్తం 85 మంది మరణించారని పాలస్తీనా హెల్త్ ఆఫీసర్లు వెల్లడించారు. ఉత్తర గాజాలో రెండు చోట్ల ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒక ఇంట్లోని ఫ్యామిలీతోపాటు స్కూల్ లో షెల్టర్ పొందుతున్న 22 మంది చనిపోయారు.

మృతుల్లో సగం మంది స్త్రీలు, పిల్లలే ఉన్నారని పాలస్తీనా హెల్త్ ఆఫీసర్లు వివరించారు. మధ్య గాజాలోని డీర్ అల్-బలాహ్ సిటీలోనూ దాడి జరిగిందని..అక్కడ 13 మంది చనిపోయారని చెప్పారు. దానికి సమీపంలోని నుసీరత్ శరణార్థి శిబిరంపై జరిగిన మరో దాడిలో 15 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.

లక్ష్యాల ప్రకటన తర్వాత దాడులు తీవ్రం

బందీలందరినీ విడిపించడంతోపాటు హమాస్ గ్రూప్ మొత్తాన్ని నాశనం చేసి, గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాల అనంతరం గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. కేవలం ఈ మూడునాలుగు రోజుల్లోనే గాజాలో 300 మందికి పైగా మరణించారు. కాగా, గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులపై విమర్శలు పెరుగుతున్నాయి.

నెతన్యాహుపై కెనడా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌‌డమ్ వంటి మిత్ర దేశాలతో పాటు ఇజ్రాయెల్‌‌ పొలిటికల్ లీడర్లు కూడా మండిపడుతున్నారు. ఈ విమర్శలను నెతన్యాహు తిరస్కరించారు. తమపై హమాస్ అక్టోబర్ 7, 2023న చేసిన దాడికి ఈ యుద్ధం ఒక పెద్ద బహుమతి అని సమర్థించుకున్నారు. 

 48 గంటల్లో 14 వేల మంది పిల్లలు చనిపోతరు

యుద్ధం వల్ల గాజాలో పెరుగుతున్న ఆహార సంక్షోభంపై యునైటెడ్ నేషన్స్(యూఎన్) హెచ్చరిక జారీ చేసింది. గాజా స్ట్రిప్‌‌లోకి తక్షణ సహాయం చేరకపోతే మరో 48 గంటల్లో 14 వేల మంది శిశువులు మరణించే ప్రమాదం ఉందని తెలిపింది. ఇజ్రాయెల్ దిగ్బంధం కారణంగా గాజాలోకి నిత్యావసర సామగ్రి సరఫరా నిలిచిపోయిందని వెల్లడించింది.