గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు.. 23 మంది మృతి.. ఫుడ్ కోసం వెళ్తుండగా జనంపైకి ఫైరింగ్

గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు.. 23 మంది మృతి..  ఫుడ్ కోసం వెళ్తుండగా జనంపైకి ఫైరింగ్
  • పలువురికి తీవ్ర గాయాలు
  • గాజా స్ట్రిప్ లో తీవ్రమవుతున్న ఆహార సంక్షోభం

డీర్ అల్ బలా: గాజాలో ఇజ్రాయెల్ బలగాలు ఆదివారం రెండు చోట్ల జరిపిన కాల్పుల్లో మరో 23 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాలస్తీనాకు మానవతాసాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుకోవడంతో గాజా స్ట్రిప్ లో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. పౌరుల ఆకలి కేకలు మిన్నంటాయి. దీంతో అందుబాటులో ఉన్న ఆహార పంపిణీ కేంద్రాలకు జనం పోటెత్తుతున్నారు. 

ఆదివారం టీనా, మోరాగ్ ప్రాంతాల్లో ఆహార పంపిణీ కేంద్రాలకు పరుగులు పెట్టిన జనంపై ఇజ్రాయెల్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయని యూసుఫ్ అబెద్ అనే ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. ‘‘ఖాన్ యూనిస్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న టీనాలో ఓ ఆహార పంపిణీ కేంద్రంలో ఫుడ్ సప్లై చేస్తున్నారు. 

ఆ సమయంలో నేను కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు వెళుతున్నా. ఇంతలోనే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. కళ్లు మూసి తెరిచేలోపు ఆ ప్రాంతమంతా రక్తపాతంగా మారింది. తోటివారిని కాపాడేందుకు ప్రయత్నించాలనుకున్నా.. కానీ ఇజ్రాయెల్  బలగాలు కాల్పుల వల్ల వీలు కాలేదు. దీంతో నేను కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తాల్సి వచ్చింది” అని యూసుఫ్ వివరించాడు. 

ఫుడ్ కోసం వెళ్లినప్పుడల్లా కాల్పులు.. 

ఇజ్రాయెల్ సరిహద్దుల వద్ద మోరాగ్ కారిడార్ సమీపంలో ఆహారం తెచ్చే ట్రక్కుల కోసం వేచిచూస్తున్న పౌరులపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరపడంతో తొమ్మిది మంది చనిపోయారని పాలస్తీనా అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం దక్షిణ గాజాలోని నాజర్ హాస్పిటల్ కు డెడ్ బాడీలు వచ్చాయని ఆ హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. టీనా, మోరాగ్ కారిడార్ మిలిటరీ జోన్లను ఇజ్రాయెల్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఉన్నాయి. ఆహారం తెచ్చుకోవడానికి వెళ్తున్న ప్రతీసారి ఇజ్రాయెల్ ఫోర్సెస్ తమపై కాల్పులు జరుపుతూనే ఉన్నాయని గాజా వాసులు చెబుతున్నారు. కాగా, గాజాలో మానవతాసాయం అందిస్తున్న కేంద్రాల వద్ద మే 27 నుంచి జులై 31 వరకు ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో 859 మంది చనిపోయారని యునైటెడ్ నేషన్స్ తెలిపింది.