నెతన్యాహు ఇంటి దగ్గర్లో డ్రోన్ దాడి..అడ్డుకున్న ఐరన్ డోమ్

నెతన్యాహు ఇంటి దగ్గర్లో డ్రోన్ దాడి..అడ్డుకున్న ఐరన్ డోమ్
  • ఓ బిల్డింగ్​ను తాకడంతో పాక్షికంగా ధ్వంసం
  • పలు డ్రోన్లను అడ్డుకున్న ఐరన్ డోమ్
  • లెబనాన్ నుంచి దూసుకొచ్చిన యూఏవీలు

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్  ప్రధాని బెంజమిన్  నెతన్యాహు నివాసం లక్ష్యంగా శనివారం డ్రోన్  దాడి జరిగింది. సిజేరియా పట్టణంలోని బెంజమిన్ నివాసం వైపు ఒక డ్రోన్  దూసుకొచ్చింది. ఆ సమయంలో నెతన్యాహుతో పాటు ఆయన కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరు. డ్రోన్ దాడిలో ఎవరూ గాయపడలేదని ఇజ్రాయెల్  ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

లెబనాన్  నుంచి ఆ డ్రోన్ ను ప్రయోగించారని, దారిలో ఒక బిల్డింగ్ ను తాకడంతో భవనం పాక్షికంగా ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు. అలాగే, మరో రెండు డ్రోన్లు కూడా తమ దేశంలోకి దూసుకొచ్చాయని, ఐరన్  డోమ్ వాటిని అడ్డుకుందని చెప్పారు. కాగా.. తామే ఆ డ్రోన్లను ప్రయోగించామని హెజ్బొల్లాగానీ, ఇతర ఉగ్రసంస్థగానీ ఇంతవరకూ ప్రకటించలేదు. 

నిరుడు అక్టోబరు 7న తమ దేశంపై హమాస్ మిలిటెంట్లు దాడి చేసినప్పటి నుంచి హమాస్ తో పాటు హెజ్బొల్లా ఉగ్రసంస్థపైనా ఇజ్రాయెల్  యుద్ధం చేస్తోంది. ఆ రెండు టెర్రర్  సంస్థల అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్  పోరాడుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్  చేసిన దాడుల్లో తమ దేశంలో 1,418  మంది చనిపోయారని లెబనాన్  తెలిపింది. 

మరోవైపు నార్త్ బీరుట్​లోని జౌనీలో శనివారం ఇజ్రాయెల్ దాడి చేయగా.. ఇద్దరు చనిపోయారని లెబనాన్ అధికారులు వెల్లడించారు. అలాగే, గాజాలోనూ ఇజ్రాయెల్  తన దాడులను కొనసాగిస్తోంది. శనివారం జరిపిన దాడుల్లో 50 మంది చనిపోయారని పాలస్తీనా అధికారులు తెలిపారు.

యహ్యా లేకున్నా పోరాటం ఆగదు: ఖమేనీ

హమాస్  చీఫ్  యహ్యా సిన్వార్  చనిపోయినా హమాస్  పోరాటం ఆగదని, ఇంతకుముందులాగే ఇజ్రాయెల్ పై హమాస్  పోరాడుతుందని ఇరాన్ సుప్రీం లీడర్  అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. శనివారం ఓ వార్త సంస్థతో ఖమేనీ మాట్లాడారు. ‘‘యహ్యా మరణం నిజంగా హమాస్ కు పెద్దదెబ్బ. కానీ, అతని మరణంతో హమాస్  నైతికస్థైర్యం ఏమాత్రం దెబ్బతినదు. పోరాటం ఆగదు. అతను అమరుడు” అని ఖమేనీ వ్యాఖ్యానించారు.

సిన్వార్  తలలో బుల్లెట్

హమాస్  చీఫ్  యహ్యా సిన్వార్  పోస్టుమార్టం రిపోర్టును అధికారులు విడుదల చేశారు. తలకు బుల్లెట్​ గాయంతో సిన్వార్ చనిపోయాడని పోస్టుమార్టంచేసిన చీఫ్​ పాథాలజిస్ట్  చెప్పారు. సిన్వార్ శరీరంలోని ఇతర భాగాలపైనా గాయాలు ఉన్నాయని అన్నారు. కాగా.. డీఎన్ఏ టెస్టు చేసిన తర్వాతే చనిపోయింది సిన్వార్  అని ఇజ్రాయెల్  అధికారులు వెల్లడించారు. 

డీఎన్ఏ టెస్టు కోసం సిన్వార్  ఎడమ చేతిలోని ఒక వేలిని కోశారు. గతంలో సిన్వార్  ఇజ్రాయెల్ లో రెండేండ్లు జైలుశిక్ష అనుభవించాడు.అప్పుడు సేకరించిన డీఎన్ఏతో తాజా డీఎన్ఏ ఫలితాల ను పోల్చి చూసి సిన్వార్​ను గుర్తించారు.