
‘‘ఓ చిన్న సమస్య తర్వాత విజయం సాధించాం. ఎగిరే రంగుల్లా తిరిగొచ్చాం” అని ఇస్రో చైర్మన్ కే శివన్ అన్నారు. సోమవారం చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ తర్వాత ఆయన మాట్లాడారు. ఇస్రో, ఇండియానే కాకుండా ప్రపంచం మొత్తం చంద్రయాన్ 2 ప్రయోగం గురించి ఆసక్తిగా ఎదురు చూసిందన్నారు. రాకెట్లో లోపం కనిపెట్టగానే టీం చాలా అప్రమత్తమైందని, వారం పాటు కష్టపడి పనిచేసి లోపాన్ని సరిచేశారని అన్నారు. కుటుంబం, వ్యక్తిగత ఆనందాలనూ త్యాగం చేసి పనిచేశారని కొనియాడారు. కేవలం ఒక్క రోజులోనే రాకెట్‌ను సరిదిద్దడం నమ్మశక్యం కానిదన్నారు.
‘‘చంద్రయాన్ 2ను జీఎస్ఎల్వీ మార్క్3 ఎం1 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఆనందంగా ఉంది. అయితే, అనుకున్నదానికన్నా 6 వేల కిలోమీటర్ల ఎక్కువ కక్ష్యలోకి దానిని పంపింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే దిశగా ఈ విజయం దేశ చరిత్రను తిరగరాయబోతోంది. ఈ మిషన్ ఇక్కడితో అయిపోలేదు. వచ్చే 48 రోజులు చాలా కీలకం. సైంటిస్టులంతా చంద్రయాన్ కక్ష్యలో 15 మార్పులు చేస్తారు. అసలైన రోజొచ్చాక, చివరి 15 నిమిషాలు చుక్కలు కనిపిస్తాయి. విక్రమ్ ల్యాండర్‌ను భద్రంగా చంద్రుడిపై దింపడమే చాలా పెద్ద పని. సెప్టెంబర్ 6 నుంచి 8 మధ్య విక్రమ్‌ను చంద్రుడిపై దింపుతాం” అని శివన్ చెప్పారు. ఏడాదిన్నరగా ఇస్రోలోని ప్రతి ఉద్యోగి రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. ఈ మిషన్‌ను సక్సెస్ చేసిన వారందరికీ సెల్యూట్ అన్నారు. ఎప్పుడూ ఇలాగే కలిసికట్టుగా పనిచేసి కార్టోశాట్ 3 సహా భవిష్యత్ ప్రయోగాలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.
రైతు కుటుంబం.. సర్కారు బడిలో చదువు
కైలాసవాడివు శివన్(62) ఏళ్ల వయసులో చైర్మన్ ఇస్రోను విజయపథంలో నడిపిస్తున్నారు. ఆయన సొంతవూరు తమిళనాడులోని నాగర్ కోయిల్ కు దగ్గరలో ఉన్న మేళ సరక్కాళ్ విళ్లై. శివన్ తండ్రి ఓ రైతు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఇండియా సొంతగా క్రయోజెనిక్ టెక్నాలజీని సాధించడంలో, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1980లో మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చదివారు.
ఇస్రోలో పని చేస్తూ, 49 ఏళ్ల వయసులో 2006లో ఐఐటీ బాంబే నుంచి పీహెచ్ డీ అందుకున్నారు. 2017లో 104 ఉపగ్రహాల ప్రయోగానికి శివన్ నాలెడ్జ్ ఇస్రోకు ఎంతగానో ఉపయోగపడింది. ఆయన చేసిన సేవలకు 2007లో ఇస్రో మెరిట్ అవార్డుతో గౌరవించింది. 2011లో డా.బీరేన్ రాయ్ స్పేస్ సైన్స్ అవార్డు, శ్రీహరి ఓం ఆశ్రమ్ ప్రేరిత్ డా.విక్రమ్ సారాభాయ్ రీసెర్చ్ అవార్డును అందుకున్నారు.