అంతరిక్ష శకలాలపై ఇస్రో నిఘా

అంతరిక్ష శకలాలపై ఇస్రో నిఘా

అంతరిక్షంలో గంటకు వేల కిలోమీటర్ల స్పీడ్​తో తిరుగుతుండే చిన్న చిన్న శకలాలు, శాటిలైట్ల ముక్కల నుంచి మన శాటిలైట్లను కాపాడుకునేందుకు ఇస్రో ఓ కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. స్పేస్ లోని శకలాలపై ప్రతిక్షణం ఓ కన్నేసి ఉంచేందుకు సొంతంగా ‘ప్రాజెక్ట్ నేత్ర’ను ఇస్రో అమలు చేస్తోంది. ఇందులో భాగంగా లేహ్​లో ఓ పవర్ ఫుల్ ఆప్టికల్ టెలిస్కోప్​ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ టెలిస్కోప్ నిర్మాణం కోసం గురువారం బెంగళూరులోని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ)’తో ఇస్రో ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, ప్రాజెక్ట్ నేత్ర (నెట్ వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనలైసిస్) కోసం ఆప్టికల్ టెలిస్కోప్ తయారీలో ఐఐఏ సహకారం అందించనున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి.

భూమి నుంచే అంతరిక్షంపై నిఘా  

ప్రస్తుతం మనం అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపి, వాటితో భూమిపై నిఘా పెడుతున్నాం. కానీ వందలు, వేల కోట్లు ఖర్చు చేసి అంతరిక్షానికి పంపే శాటిలైట్లకు చిన్న రాయో, పాడైపోయిన శాటిలైట్ల నుంచి వచ్చిన చిన్న ముక్కనో తగిలిందంటే.. ఇక మన శాటిలైట్లు ముక్కలు చెక్కలైపోవడం ఖాయం. అందుకే.. మన శాటిలైట్లు తిరిగే కక్ష్యల్లో స్పేస్ డెబ్రిస్ ఎదురొచ్చే ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తే.. శాటిలైట్ల ఎత్తును పెంచి, లేదా తగ్గించి వాటిని కాపాడుకోవచ్చు. ఇందుకోసమే ఇస్రో భూమిపై నుంచి అంతరిక్షంపై కన్నేసి ఉంచేందుకు ప్రాజెక్ట్ నేత్రను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్రో రూ. 400 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా.. లేహ్​లో ఒక అత్యతంత కచ్చితత్వంతో పనిచేసే లాంగ్ రేంజ్ ఆప్టికల్ టెలిస్కోప్​, నార్త్ ఈస్ట్​లో ఒక రాడార్​ను, కేరళలోని పొన్ముడి, రాజస్థాన్​లోని మౌంట్ అబూలో మరో రెండు టెలిస్కోపులను ఇస్రో నిర్మించనుంది. శ్రీహరికోటలోని షార్​లో ఉన్న మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్​నూ ఉపయోగించనుంది. స్పేస్ డెబ్రిస్ విషయంలో ప్రస్తుతం అమెరికా, కెనడా సంయుక్తంగా నిర్మించిన ‘నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (నోరాడ్)’ సెంటర్ ఇచ్చే డేటాపైనే ఇండియా సహా చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రాజెక్ట్ నేత్ర యాక్టివిటీస్ ప్రారంభమైతే మనమే సొంతంగా స్పేస్ డెబ్రిస్​పై నిఘా వేయొచ్చు. స్పేస్ నుంచి మన దేశంపై పడే ఆస్టరాయిడ్లు, శత్రు మిసైల్స్​పైనా నిఘా పెట్టేందుకు వీలవుతుంది.

ఎన్ఐటీ కర్నాటకలో అకడమిక్ సెంటర్..

కర్నాటకలోని సురత్కల్​లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​టెక్నాలజీ (నిట్)లో ఇస్రో రీజనల్ అకడమిక్ సెంటర్ ఏర్పాటుకు కూడా శుక్రవారం ఒప్పందం కుదిరింది. అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రంలో నిట్, ఇస్రో కలిసి పరిశోధనలు చేస్తాయని చెబుతున్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి