ఎన్నిసార్లు సాఫ్ట్​వేర్ మార్చినా అదే నిర్లక్ష్యం

ఎన్నిసార్లు సాఫ్ట్​వేర్ మార్చినా అదే నిర్లక్ష్యం

హైదరాబాద్, వెలుగు: సర్కార్ ఆఫీసుల్లో ఏ పనులు కావాలన్నా ముందు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందే. అయితే  మీ సేవ సెంటర్ల ద్వారా ఇష్యూ చేసే సర్టిఫికెట్ల ప్రాసెస్​లో జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వచ్చిన అప్లికేషన్లను సరిగ్గా పరిశీలించకుండా గుడ్డిగా అప్రూవ్ చేసేస్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్లు సరిగా లేకపోయినా బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఫలితంగా విచ్చలవిడిగా ఫేక్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. ఇటీవల ఓల్డ్​సిటీలోని మీ సేవ సెంటర్​లో 3 వేల ఫేక్ సర్టిఫికెట్లు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. వీటికి ఎవరు అప్రూవల్ ఇస్తున్నారన్న దానిపై ఉన్నతాధికారులు సరైన ఫోకస్ పెట్టడకపోవడంతో రోజురోజుకూ ఇలాంటి సర్టిఫికెట్లు పుట్టుకొస్తున్నాయి. అయితే, అన్నీ కరెక్ట్​గా ఉన్న వారికి మాత్రం ఆలస్యమవడం, ఫేక్ సర్టిఫికెట్లు మాత్రం క్షణాల్లో జారీ అవుతుండటంతో బల్దియా అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లలో సాఫ్ట్ వేర్ ని మూడు సార్లు మార్చినా ఫేక్ సర్టిఫికెట్ల జారీని అరికట్టడం లేదు. జీహెచ్ఎంసీ సర్వర్లను సక్రమంగా మెయింటెనెన్స్​చేయకపోవడం కూడా ఇందుకు ఓ కారణమని తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఈ సమస్యకు చెక్ పెడితేనే ఫేక్ సర్టిఫికెట్ల జారీని అడ్డుకునే అవకాశం ఉంది.

ఏ టెక్నాలజీ అయినా అంతే..

సర్టిఫికెట్లు ఆలస్యంగా జారీ అవుతుండటంతో కొత్త టెక్నాలజీ పేరుతో మీ సేవ సెంటర్ల ద్వారా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నప్పటికీ టెక్నికల్​సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఒక సర్టిఫికెట్ ​కోసం అప్లయ్ చేస్తే మరో సర్టిఫికెట్ జారీ అవుతోందని చెప్తున్నారు. పేర్లు, అడ్రెస్​లు కూడా తప్పుగా నమోదవుతుండటంతో తప్పులను సరిచేసుకునేందుకు జీహెచ్ఎంసీ ఆఫీసులు, హాస్పిటల్స్,  మీసేవ సెంటర్ల చుట్టూ జనం చక్కర్లు కొడుతున్నారు. ఇలా ఒక్క సర్టిఫికెట్​కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నప్పటికీ, సర్టిఫికెట్ల జారీలో తప్పులు ఉంటుండటంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఐటీ వాళ్లకూ అర్థం కావట్లే..

సర్వర్​లో ఏర్పడుతున్న టెక్నికల్​సమస్యలు జీహెచ్ఎంసీ ఐటీ వింగ్ వాళ్లకు కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఓ సమస్య పరిష్కారం కాగానే మరోకటి ఎదురవుతుండటంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఇటు జనాల నుంచి ఫిర్యా
దులు పెరుగుతుండటంతో ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ విధానాన్ని ఎంత మార్చినా కూడా ఫేక్ సర్టిఫికెట్లను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. టెక్నికల్ సమస్యతో తప్పుడు సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయని కొందరు, జారీలో ఆలస్యమంటూ మరికొందరు. ఇలా జీహెచ్ఎంసీకి ప్రతిరోజూ ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై సరైన నిర్ణయం తీసుకోకపోతే జనం మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అప్రూవల్​కే పరిమితం!

గతంలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల అప్లికేషన్ల  నుంచి జారీ వరకు అంతా బల్దియా అధికారులే చూసుకునేవారు. అప్లికేషన్లు ఆలస్యమైనా సర్టిఫికెట్లు మాత్రం జారీ అయ్యేవి. కానీ ఇప్పుడు అంతా మీ సేవ సెంటర్లకే బాధ్యతలు అప్పగించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అప్రూవల్ ​ఇవ్వడం వరకు మాత్రమే జీహెచ్ఎంసీ అధికారులు పరిమితమయ్యారు. దీంతో మీసేవ సెంటర్ల నిర్వాహకులు  ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏ విషయాన్ని అడిగినా సరే తమకు తెలియదంటూ దాటవేస్తున్నారు. దీంతో జనం బల్దియా సర్కిల్ ఆఫీసులు, హాస్పిటల్స్​చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గతంలో ఉన్న విధానంతోనే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు జారీ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.