మందుల ధరలు 10 శాతం పెరిగే అవకాశం!

 మందుల ధరలు 10 శాతం పెరిగే అవకాశం!

మనిషి అనారోగ్యానికి గురైతే రకరకాల వ్యాధులకు వాడే ఔషధాలకు ఈ ఆర్థిక సంవత్సరం నుంచే 10 శాతం వరకు పెంచేందుకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 800 రకాల మందుల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ వైద్య ఖర్చులు సామాన్యుడికి పెనుభారంగా మారుతుండగా, ఇక మందుల ధరల కూడా పెరిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు. జనరిక్ మందులు అందుబాటులో ఉన్నా.. వాటిపై ప్రజలకు పెద్దగా అవగాహన లేదు. పైగా బ్రాండెడ్​ ఫార్మా కంపెనీలు ప్రజలు జనరిక్​ మందుల వైపు చూడకుండా అనేక అపోహలకు తెర లేపే ప్రయత్నం చేస్తున్నాయి. డాక్టర్లకు పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ.. వారి కంపెనీ మందులనే వాడాలని సూచిస్తున్నాయి.

జాతీయ ఔషధ సర్వే ప్రకారం..

ప్రపంచ దేశాలకు చౌకతో నాణ్యమైన మందులు సరఫరా చేస్తున్న మనదేశం, సొంత ప్రజలకు వాటిని ఎందుకు అందించలేకపోతోంది? సరసమైన ధరలకు లభించే జనరిక్ మందులపై ఉద్దేశపూర్వక జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేక పోవడం ప్రభుత్వాల వైఫల్యమే. మనదేశంలో వైద్య చికిత్సకయ్యే ఖర్చులో మూడొంతుల దాకా జనమే సొంతంగా భరిస్తున్నారు. మరోవైపు 2014-–16లో వచ్చిన “జాతీయ ఔషధ సర్వే” రిపోర్టు ప్రకారం మనదేశంలో 3.16 శాతం, తెలంగాణలో 2.91 శాతం ఔషధాలు నాసి రకానివని తేలింది. ఇదే క్రమంలో సర్కారు వైద్యంలో అయితే 12.57 శాతం ఔషధాల నాణ్యతా ప్రమాణాలు కొరవడినట్లు తేల్చింది. ఔషధాల కొనుగోలుకు ముందే ఉత్పత్తి సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలపై తనిఖీలు చేయాలని ఈ సర్వే సూచించింది. ఔషధాలను ఎప్పటికప్పుడు జాతీయ గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షించాలంది. నాణ్యతా ప్రమాణాల తనిఖీ వ్యవస్థను పటిష్టం చేయాలని స్పష్టం చేసింది.

నియంత్రణాధికారుల కొరత..

రాష్ట్రంలో డ్రగ్ ఇన్​స్పెక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో తనిఖీలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.  ఇదే అదునుగా నాసిరకం మందులు వెల్లువలా మార్కెట్​లోకి వస్తున్నాయి. అంతిమంగా ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారింది. ఔషధ నియంత్రణాధికారుల కొరత వీరి అడ్డగోలు వ్యాపారానికి వరంగా మారింది. 
రాష్ట్రం మొత్తంమ్మీద ప్రస్తుతం సుమారు 36 వేల ఔషధ దుకాణాలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన ‘హాతీ’ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రతి 100 ఔషధ దుకాణాలకు ఒక  డ్రగ్ ఇన్​స్పెక్టర్​ ఉండాలి. ఈ మాదిరిగా చూస్తే, రాష్ట్రంలో సుమారు 360 మంది అధికారులు అవసరం ఉన్నారు. అలా రాష్ట్రంలోని సుమారు 560 ఔషధ ఉత్పత్తి సంస్థల తనిఖీకి మరో 25 మంది అధికారులు కావాలి. మొత్తంగా 385 మంది నియంత్రణాధికారులు అవసరం ఉండగా.. ప్రస్తుతం రాష్ట్రంలో మంజూరైన డ్రగ్ ఇన్​స్పెక్టర్ల ఉద్యోగాలు(పోస్టులు) కేవలం 71 మంది మాత్రమే. ఇందులోనూ 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఔషధ దుకాణాలకు అనుగుణంగా అదే నిష్పత్తిలో నియంత్రణాధికారుల సంఖ్య పెంచాల్సి ఉంది. ఆ వైపుగా వైద్య ఆరోగ్య శాఖ నియామకాలు చేపట్టాలి. మన దేశంలోనే ఫార్మా రంగానికి తెలంగాణ కీలక కేంద్రంగా గుర్తింపు పొందినది. డ్రగ్ ఇన్​స్పెక్టర్లే ఉత్పత్తిలో మరోవైపు విక్రయాల్లో నాణ్యత ప్రమాణాలను వారే పర్యవేక్షించాల్సి ఉన్నందున వెంటనే ప్రభుత్వం నియంత్రణాధికార్లు భర్తీ చేపట్టాలి. 
- ‌‌‌‌మేకిరి దామోదర్, సోషల్ ఎనలిస్ట్.